శకుంతల అనగానే ప్రస్తుతం గుణశేఖర్ తీసిన సినిమాయే చర్చకొస్తుంది కానీ 1966లోనే కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో బి సరోజాదేవి శకుంతలగా, ఎన్.టి. ఆర్ దుశ్యంతుడిగా ఒక సినిమా వచ్చింది. అప్పట్లో హీరో ఓరియంటెడ్ గా టైటిల్ పెట్టాలన్న ఆభిజాత్యం లేక “శకుంతల” అనే పెట్టేశారు స్ట్రైట్ గా.
దానికంటే ముందు 1961లో శాంతారాం దర్శకత్వంలో హిందీ చిత్రం “స్త్రీ” వచ్చింది. దానికి ఉపశీర్షికగా “అభిజ్ఞాన శాకుంతలం” అని కూడా వేసారు. వాటిల్లో “స్త్రీ” బాగానే ఆడింది కానీ తెలుగు “శకుంతల” మాత్రం పెద్దగా నడవలేదు.
శకుంతల కథకి మూలం మహాభారతమే అయినా కాళిదాసు పుణ్యమా అని చాలా మార్పులు చేసుకుని గొప్ప ఫిక్షన్ గా మారింది. మూలకథలో ఉంగరం పడిపోవడం, అది చేప మింగడం, ఆ ఉంగరాన్ని చూసాక దుశ్యంతుడికి శకుంతల గుర్తురావడమనే ఘట్టం లేదు. అది కాళిదాసు కల్పన.
ఆ విధంగా కాస్తంత కల్పన మూలానికి వన్నె తెచ్చేదిగా పాత్రౌచిత్యాలని పెంచే విధంగా ఉండడం ఆహ్వానించదగినదే. ఆ ఉంగరమనే చిహ్నాన్ని ఆధారంగా చేసుకుని చేసిన మార్పు కనుక దీనికి “అభిజ్ఞాన శాకుంతలం” అని నామకరణం చేసాడు కాళిదాసు. “అభిజ్ఞ” అంటే చిహ్నం. ఇక్కడ ఆ చిహ్నం ఉంగరం.
ఇక ఇలాంటి మార్పే మహాభారతంలోని ఒకానొక ఘట్టంలో చేసి “శశిరేఖా పరిణయం” అనే జానపద నాటకం రాసుకున్నారు ఎన్నో ఏళ్ళ క్రితం. కాలక్రమంలో దానిని మూకీ సినిమాలుగానూ, 1949లో “వీర్ ఘటోత్కచ్” పేరుతో హిందీలోనూ, ఆ తర్వాత సుప్రసిద్ధమైన 1957నాటి మనకి తెలిసిన “మాయాబజార్” గానూ మన ముందుకొచ్చాయి. నిజానికి అభిమన్యుడి భార్య శశిరేఖ కానేకాదు. అసలు శశిరేఖ అనే పాత్ర మహాభారతంలో లేనే లేదు. అభిమన్యుడి భార్య విరాటరాజు కుమార్తె ఉత్తర. అయినప్పటికీ నాటకీయత అద్భుతంగా రక్తి కట్టి సూపర్ హిట్టయిపోయింది. కనుక అక్కడ కూడా చేసిన మార్పు ఆహ్వానించదగ్గదే.
ఇప్పుడు గుణశేఖర్ “శాకుంతలం” కి వద్దాం. దీనిని శాకుంతలం అనడం కంటే “సమంతలం” అనడం నయమేమో. ఎందుకంటే సమంత టైటిల్ రోల్ పోషించందన్న ఏకైక కారణం వల్ల జనం దృష్టి దీనిపై పడింది తప్ప మరొక కారణం లేదు.
ఇంతకీ గుణశేఖర్ ఏం చేసాడంటే 1966 నాటి కమలాకర కామేశ్వరరావు “శకుంతల”లోని సీన్లను కొన్ని యథాతధంగా వాడేశాడు. అవి పర్వాలేదనిపించాయి. ఇక అందులో లేని ఉగ్రనేమి కథ, యుద్ధం వగైరాలన్నీ జొప్పించి అసలు కథని, కరుణ రసాన్ని పక్కకి నెట్టేసాడు.
వ్రతం చెడ్డా ఫలితం దక్కాలంటారు. సినిమా ఆడకపోయినా “పాపం బాగానే తీసాడు” అనే సింపతీ అయినా మిగలుండాలి. ఫ్లాపయ్యి డబ్బూ పోయి, ఆ పైన అక్షింతలు కూడా పడుతుంటే ఆ చిరాకు వర్ణనాతీతం.
ఇక్కడేంటంటే కాపీ కొట్టిన భాగం పర్వాలేదనిపించింది. సొంతంగా క్రియేట్ చేసి తీసింది చిరాకు తెప్పించింది. దీనిని బట్టి గుణశేఖర్ పనితనాన్ని ఎలా చూడాలి?
శకుంతల కథని తీసుకుని సినిమాగా తియ్యాలనుకోవడం గుణశేఖర్ కి అన్ని విధాలుగా శక్తికి మించిన పనే అనుకోవాలి…అటు బడ్జెట్ పరంగా, ఇటు క్రియేటివిటీ పరంగా కూడా!
ఇక రాసుకున్న సంభాషణలు కూడా కొన్ని చిత్రంగా ఉన్నాయి. “రైతే రాజు..దున్నేవాడిదే భూమి” అనే నినాదం ఎప్పటిది? ఆ కమ్యూనిష్టు సిద్ధాంతాన్ని పట్టుకెళ్లి దుశ్యంతుడికి పెట్టారు. ఎప్పుడో ద్వాప్రయుగ కాలాన్ని ఇప్పటి కాలానికి అన్వయించుకుని రాయాల్సినంత అవసరమేమొచ్చింది?
అలాగే సింహాన్ని వేటాడబోయిన దుశ్యంతుడికి బాలభరతుడి పాత్ర చేత, “ప్రజల్ని కాపాడడం, ఇతర జీవాల్ని రక్షించడం రాజు బాధ్యత” అంటూ 21 వ సాతబ్దం నాటి వన్యమృగ సంరక్షణని దృష్టిలో పెట్టుకుని రాసి పారేసారు.
ఆ రోజుల్లో అడవులెక్కువ, ఊళ్లు తక్కువ ఉండేవి. వన్యమృగాలు జనావాసాల్లోకి వచ్చి వీరంగం చేస్తుంటే రాజులు వేటాడేవారు. అది అప్పటి నిత్యకృత్యం. అప్పుడా కౄరమృగాలు అడవుల్లో అంతరించిపోతున్నాయని బెంగపడే పరిస్థితులు లేవు. ఏ కాలానికి సంబంధించిన సంభాషణలు ఆ కాలం కథలకి ఉండాలి కానీ ప్రతి దాంట్లోనూ సొంత పైత్యం జోడించాలనుకోవడం అతి తెలివి ఔతుంది.
గుణశేఖర్ స్క్రిప్ట్ విషయంలో పడిన కష్టం చాలా తక్కువ. పాత సినిమాని ముందు పెట్టుకుని నచ్చిన ముక్కలు లేపేసి దానికి యుద్ధాలు అవీ తగిలించి తెర మీద హెవీనెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసాడు. కానీ తెర మీద కనపడాల్సిన హెవీనెస్ ప్రేక్షకుల తలల్లో తేలింది.
ఈ చిత్రంతో పాటూ విడుదలైన అరవ డబ్బింగ్ సినిమా “విడుదల”కి కూడా సరితూగని విధంగా కలెక్షన్స్ ఉన్నాయంటే ఎంత దయనీయమైన విఫలప్రయత్నమో అర్ధమౌతుంది.
తదుపరి చిత్రానికైనా గుణశేఖర్ అసలు సిసలైన కసరత్తు చేసి దిగుతాడని ఆశిద్దాం.
– శ్రీనివాసమూర్తి