కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బీచ్పల్లి దగ్గర నీరజా ప్రయాణిస్తున్న కారు టైరు పేలి పల్టీ కొట్టింది. దీంతో నీరజారెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను హూటాహుటిన కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
కాగా 1996లో ఆమె భర్త హత్యకు గురయ్యారు. దీంతో రాజకీయల్లోకి వచ్చిన నీరజారెడ్డి 2009లో ఆలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో నియోజకవర్గంలో పనులు జరగడం లేదని ఆరోపిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉండి.. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసినా తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని వైసీపీని వీడి బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆలూరు బీజేపీ ఇన్చార్జీగా ఉన్నారు.