దర్శకుడు గుణశేఖర్ కు పరాజయాలు కొత్త కాదు. దారుణ పరాజయాలు అంతకన్నా కొత్త కాదు. సైనికుడు..వరుడు..మృగరాజు..నిప్పు ఇలా పెద్ద హీరోలు అందరికీ తలా డిజాస్టర్ ఇచ్చిన రికార్డు గుణశేఖర్ ది. లేటెస్ట్ గా శాకుంతలం. చాలా గ్యాప్ తరువాత చేసిన సినిమా. తొలి రోజు సరైన ఓపెనింగ్ రాబట్టుకోలేకపోవడం అన్నది గుణశేఖర్ తప్పు కాకపోవచ్చు. కానీ ఆ వెంటనే నిట్టనిలువుగా కిందకు జారిపోవడం మొదలు పెట్టి, మరునాటికే డిజాస్టర్ స్థాయికి చేరిపోవడం అంటే అది మాత్రం ముమ్మాటికీ గుణశేఖర్ ఘనతే. అందులో సందేహం లేదు.
ఇక్కడ ఇంకెవరి తప్పూ లేదు. దిల్ రాజు కేవలం ఆర్థిక హంగులు మాత్రమే సమకూర్చారు. సినిమాకు కర్త..కర్మ..క్రియ అన్నీ గుణశేఖర్ నే. నలభై కోట్ల బడ్జెట్ అనుకున్నది 63 కోట్ల మేరకు వెళ్లిపోయినా దిల్ రాజు అడ్డుకున్నది లేదు. అందువల్ల ఆయన తప్పు లేదు.
గుణశేఖర్ చేసిన తొలి తప్పు స్క్రిప్ట్ విషయంలోనే జరిగింది. శాకుంతలం లాంటి థిన్ లైన్ సబ్జెక్ట్ లో ఎన్నో భావోద్వేగ కోణాలు వున్నాయి. సర్వం వదిలేసి ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే కణ్వ మహర్షిని మళ్లీ పేగుబంధంలోకి లాగి, తండ్రిగా మార్చింది శాకుంతల. ఆమెను రాజు దగ్గరకు పంపేటపుడు తండ్రి పడిన తపన కాళిదాసు వర్ణనలో వేరు. కానీ సినిమాలో అస్సలు ఆ భావోద్వేగాలే పండలేదు. ముని వాకిట చెలులతో, జంతువులు, పక్షులతో శాకుంతల ఆట పాటల వర్ణనలే వేరు. వీటన్నింటినీ తెరపైకి తేవడంలో గుణశేఖర్ పూర్తిగా విఫలమయ్యారు.
గుణశేఖర్ కు సెట్ ల మీద, విజువలైజేషన్ మీద దృష్టి ఎక్కువ. ఇక్కడ కూడా ఆధునిక సాంకేతికత వాడి అలాంటి ఫీట్ చేయాలని అనుకుని స్క్రిప్ట్ ను గాలికి వదిలేసారు. శాకుంతల అందాన్ని కాదు, ఆత్మాభిమాన కోణాన్ని చూపిస్తున్నా అంటూ చెప్పుకువచ్చారు గుణశేఖర్. కానీ అసలు శాకుంతల క్యారెక్టర్ నే సరైన విధంగా డిజైన్ చేయలేకపోయారు. ముగింపులో మగడు వచ్చిన వేళ పరుగెత్తి తలుపు మూసుకోవడం మినహా చూపించిన ఆత్మాభిమాన కోణం ఏమిటో.
అల్లు అర్హ కోసం లేని మెహర్బానీ డైలాగులు రాయడంలో చూపించన శ్రద్ద శాకుంతల విషయంలో క్లయిమాక్స్ లో చూపించి వుంటే బాగుండేది. కామెడీ రాయడం బుర్రా సాయి మాధవ్ కు సరిగ్గా రాదు అనే అపవాదు వుండనే వుంది. అది ఈ సినిమాలో శివబాలాజీ క్యారెక్టర్ ద్వారా మరోసారి రుజువైంది. మళ్లీ ఈ సినిమాలో కూడా రైతు..భూములు లాక్కోవడం అంటూ మళ్లీ తన రొటీన్ కు వెళ్లారు.
పోనీ స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టలేదు సరే, విజువల్స్ మీద అయినా సరైన పద్దతిలో వెళ్లారా అంటే అదీ లేదు. ఒక్క సన్నివేశంలో కూడా నేపథ్యానికి, పాత్రలకు మధ్య కొలతల లెక్కలు సరిపోలేదు. అయితే మరుగుజ్జుల్లా లేదంటే భారీగా ఇలా రకరకాలు గా కనిపించారు. పది కోట్లు ఖర్చు చేసిన తరువాత కూడా త్రీడీ వెర్షన్ చూడలేనట్లుగా తయారు కావడం అంటే ఎవరి తప్పిదం అనుకోవాలి.
ఇలాంటి సినిమాలకు పాటలు అద్భుతంగా వుండాలి. గుణశేఖర్ సినిమాల్లో పాటలు ఎప్పుడూ బాగుంటాయి. పెద్ద హిట్ లు ఆయన ఖాతాల్లో వున్నాయి. కానీ సినిమాలో అవి కూడా మైనస్ నే. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కు పెట్టింది పేరు అయిన మణిశర్మ ఈ సినిమా చేసిన వర్క్ ఘోరంగా విమర్శలకు గురయింది. ఇస్మార్ట్ శంకర్ పుణ్యమా అని మణిశర్మ స్టార్ట్ చేసిన సెకెండ్ ఇన్నింగ్స్ లో సూపర్ అని అనిపించుకున్న వర్క్ ఏదీ అంటే ఆలోచించాల్సిందే.
విడుదల నాటికి దాదాపు 20 కోట్లకు పైగా థియేటర్ మీద నుంచి రాబట్టాలనే లక్ష్యంతో విడుదలయింది శాకుంతలం. అందులో పావు వంతయినా రాబట్టగలుగుతుందా? అంటే అనుమానమే.