పవన్ కల్యాణ్ ను డైరక్ట్ చేయాల్సిన అవసరం లేదు, పవన్ సినిమా కోసం ఏదో ఒక రూపంలో పని చేస్తే చాలు. ప్రస్తుతం త్రివిక్రమ్ లక్ష్యం ఇదే. తెరవెనక పవన్ లైనప్ మొత్తం సెట్ చేస్తోంది త్రివిక్రమ్ అనే విషయం బహిరంగ రహస్యం.
మొన్నటికిమొన్న భీమ్లానాయక్ కు అన్నీ తానై వ్యవహరించాడు పవన్. ఇప్పుడు సముద్రఖని దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమాకు కూడా త్రివిక్రమే కథలో మార్పుచేర్పులు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ లాంటివి చూసుకున్నాడు. ఇప్పుడు పవన్ కోసం మరో సినిమా సెట్ చేసే పనిలో పడ్డాడట త్రివిక్రమ్. ఈసారి ఇది త్రివిక్రమ్ సొంత సినిమా.
వినోదాయ శితం రీమేక్ కోసం పవన్-సాయిధరమ్ తేజ్ ను కలిపిన త్రివిక్రమ్.. ఈసారి పవన్-వైష్ణవ్ తేజ్ కాంబోని సెట్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఈ మేరకు ఓ కథను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఎప్పట్లానే ఈ సినిమాను త్రివిక్రమ్ డైరక్ట్ చేయడం లేదు. సుధీర్ వర్మ చేతిలో ఈ ప్రాజెక్టును పెట్టే అవకాశాలున్నాయి.
సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ (ఇది త్రివిక్రమ్ బ్యానర్) బ్యానర్లపై ఈ కొత్త సినిమా వచ్చే అవకాశం ఉంది. పవన్-సుధీర్ వర్మ కాంబో ఎప్పట్నుంచో నలుగుతోంది. అది ఇదే అనేది తాజా సమాచారం.
అయితే ప్రస్తుతానికి ఇది స్పెక్యులేషన్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టులో ఎన్ని మార్పుచేర్పులు జరుగుతాయో చూడాలి. ఒకవేళ ప్రాజెక్టు సెట్ అయినా, ఏపీలో ఎలక్షన్ల తర్వాతే సెట్స్ పైకి వచ్చేలా ఉంది.