అయిపోయిన పెళ్లికి మేళం ఎందుకు?

ప‌దేప‌దే అయిపోయిన పెళ్లికి మేళం ఎందుకో అర్థం కావ‌డం లేదు. ప్ర‌త్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయ‌మ‌ని గ‌తంలో  చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడే కేంద్ర ప్ర‌భుత్వం చాలా స్ప‌ష్టంగా ప్ర‌క‌టించింది. కానీ గ‌త సార్వ‌త్రిక…

ప‌దేప‌దే అయిపోయిన పెళ్లికి మేళం ఎందుకో అర్థం కావ‌డం లేదు. ప్ర‌త్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయ‌మ‌ని గ‌తంలో  చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడే కేంద్ర ప్ర‌భుత్వం చాలా స్ప‌ష్టంగా ప్ర‌క‌టించింది. కానీ గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో త‌న‌కు 25కు 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్ర స‌ర్కార్‌ మెడ‌లు వంచి హోదా తీసుకొస్తాన‌ని న‌మ్మ‌బ‌లికాడు. రాష్ట్ర ప్ర‌జ‌లు వైసీపీకి 22 ఎంపీ సీట్లు క‌ట్ట‌బెట్టారు.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన మొద‌ట్లో ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధాని మోడీని క‌లిశారు. ఆ త‌ర్వాత విలేక‌రుల‌తో మాట్లాడుతూ మోడీకి త‌మ పార్టీ అవ‌స‌రం లేకుండా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మంచి మెజార్టీ ద‌క్కింద‌న్నాడు. మోడీకి త‌క్కువ సీట్లు రాక‌పోవ‌డం మ‌న దుర‌దృష్ట‌మ‌న్నాడు. ప్ర‌త్యేక హోదా గురించి ‘అడుగుతూనే’ ఉంటామ‌ని  ‘దీర్ఘం’ తీశాడు. ఆ రోజే ప్ర‌త్యేక హోదా క‌థ ముగిసిన‌ట్టేన‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు.  

ప్ర‌స్తుత పార్ల‌మెంట్ స‌మావేశాల్లో మ‌ళ్లీ ప్ర‌త్యేక హోదా అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని అడిగిన లిఖిత పూర్వ‌క ప్ర‌శ్న‌కు కేంద్ర ఆర్థికశాఖ స‌హాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ స‌మాధానమిస్తూ …రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఐదేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌న్న మాట వాస్త‌వ‌మేన‌ని, అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేప‌థ్యంలో హోదా ర‌ద్ద‌యిపోయిన‌ట్టేన‌ని స్ప‌ష్టం చేశాడు.

కేవ‌లం రాజ‌కీయ విమ‌ర్శ‌ల కోసం వైసీపీ, టీడీపీలు ప్ర‌త్యేక హోదాపై డ్రామాలు ఆడుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉండ‌గా ప్ర‌త్యేక ప్యాకేజీకి ఒప్పుకుని, ప్ర‌త్యేక హోదాను అట‌కెక్కించింది. దాన్ని అవ‌కాశంగా తీసుకున్న వైసీపీ దూకుడుగా వ్య‌వ‌హ‌రించి టీడీపీని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింది. నాడు టీడీపీ -బీజేపీ మ‌ధ్య విభేదాల‌కు ప్ర‌త్యేక హోదానే కార‌ణం. ఏది ఏమైతేనేం టీడీపీ అధికారాన్ని పోగొట్టు కోవాల్సి వ‌చ్చింది.

గ‌తంలో త‌మ‌ను ఇబ్బందుల‌పాలు చేసిన వైసీపీని, అదే ప్ర‌త్యేక హోదాతో దెబ్బ‌కు దెబ్బ తీయాల‌నే ఉద్దేశంతో టీడీపీ పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావించింది. ప్ర‌త్యేక హోదా ఎప్ప‌టికీ రాద‌ని అన్ని రాజ‌కీయ పార్టీల‌కు తెలుసు. కానీ త‌మ‌కు అధికార హోదా తెచ్చి పెట్టేందుకు దోహ‌దం చేస్తుంద‌నే ఉద్దేశంతో ఆ అంశాన్ని స‌జీవంగా ఉంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అంతే త‌ప్ప ఏ పార్టీకి చిత్త‌శుద్ధి లేద‌న్న‌ది నిజం.

సమంత-శర్వా-ప్రేమ్ ముగ్గురు కలిసి మ్యాజిక్ చేసారు