ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటంలేదెందుకంటూ అమాయకంగా నిలదీసేస్తున్నారు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. నిజమే, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ప్రత్యేక హోదా విషయమై ప్రశ్నించాల్సిందే.. ఆ బాధ్యత విపక్ష నేతగా చంద్రబాబుపై వుంది కూడా.! కానీ, ముఖ్యమంత్రిగా వున్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు.? ప్రత్యేక హోదా దండగ.. అని తేల్చేసింది ఆయనే.!
పైగా, ప్రత్యేక హోదా కోసం విద్యార్థులెవరైనా ఉద్యమాలు చేస్తే.. జీవితాలు నాశనమైపోతాయ్.. అని సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే హెచ్చరించారు. ఎప్పుడైతే బీజేపీతో బంధం తెగిందో.. ఇక, అప్పటినుంచీ ప్రత్యేక హోదా కోసం నానా యాగీ చేయడం మొదలెట్టారు 'యూ టర్న్' చంద్రబాబు. ఇప్పుడు, పార్లమెంటు సమావేశాల వేళ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఒత్తిడితెచ్చే ప్రయత్నమంటూ చంద్రబాబు యాగీ చేస్తోంటే.. టీడీపీ నేతలే నవ్వుకోవాల్సి వస్తోంది.
ఏం, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కదా.. ఢిల్లీకి వెళ్ళి ఇప్పుడు తన పరపతిని అక్కడ వాడి, ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎందుకు నినదించడంలేదు.? ఈ ప్రశ్న సహజంగానే పుట్టుకొస్తుంది. కానీ, చంద్రబాబు దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం లేదు.
మరోపక్క, అమరావతి పేరుతో చంద్రబాబు యాగీ షరామామూలుగానే కొనసాగుతోంది. 'అమరావతిలో 10 వేల ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల సంపద వస్తుంది..' అంటూ పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారిలా చంద్రబాబు మాట్లాడుతుండడం గమనార్హం. అమరావతి అనగానే చంద్రబాబుకి ముందుగా భూముల అమ్మకాలే గుర్తుకొస్తున్నాయి. అధికారంలో వున్నన్నాళ్ళూ అమరావతిని చంద్రబాబు 'లాభదాయకమైన' ప్రాజెక్టుగానే చూశారు.. పైగా, అది సొంత లాభం కావడమే బాధాకరమిక్కడ.
చంద్రబాబు సహా, పలువురు టీడీపీ నేతల మెడకి అమరావతి భూముల వ్యవహారం చుట్టుకునేలా కన్పిస్తున్నా.. చంద్రబాబు బుకాయింపులు మాత్రం షరామామూలుగానే కొనసాగుతున్నాయి. సందట్లో సడేమియా.. అంటూ ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకున్నారు. ఏం ప్రత్యేక హోదా.? ఇంకెక్కడి ప్రత్యేక హోదా.! కేంద్రం ఇంకోసారి స్పష్టం చేసేసింది.. ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యమే లేదని.