ఇప్పటి వరకు తెలుగులో రీమేక్ చేయపోవడానికి ఒకటే కారణం అని, స్క్రిప్ట్ దగ్గర నుంచి ఫినిషింగ్ వరకు దాంతో ట్రావెల్ చేసే అవకాశం వుండదని, కానీ 96 సినిమాకు మాత్రం తమిళంలో ప్రొడక్షన్ నుంచి ఫాలో అవుతూ వస్తున్నానని, అందుకే అమితంగా నచ్చి రీమేక్ కు ముందుకు వెళ్లానని నిర్మాత దిల్ రాజు అన్నారు.
ఆ సినిమా చూసినపుడు చాలా ఎక్కువ ఫీల్ అయ్యానని, అప్పటికప్పుడే డెసిషన్ తీసుకుని, రీమేక్ రైట్స్ తీసుకున్నాని, ఆ రోజు నుంచి ఒకటే నమ్మకం అని, తాను ఏది ఫీల్ అయ్యానో, తనకు ఏది నచ్చిందో, రేపు విడుదలయ్యాక ప్రతి ఒక్కరికీ అదే ఫీల్ వుంటుందని, అదే విధంగా నచ్చుతుందని తాను నమ్ముతున్నాన్నారు.
తమిళ దర్శకుడు 96 సినిమాను చేసిన తీరు నచ్చి, ఆయనకే తెలుగు సినిమా బాధ్యతలు కూడా అప్పచెప్పానని దిల్ రాజు అన్నారు. ఇలాంటి ఒక స్క్రిప్ట్ రాయడం కానీ, దాన్ని అలా తెరకు ఎక్కించడం కానీ, ఆ సౌండ్ డిజైనింగ్ కానీ ఇవన్నీ అంత తేలికగా సాధ్యం అయ్యేవి కాదని, అందుకే తెలుగు వెర్షన్ కూ ప్రేమ్ కుమార్ నే దర్శకుడిగా ఎంచుకున్నానని ఆయన అన్నారు.
సినిమా రీమేక్ అనుకున్నాక, తనుకు సమంత మాత్రమే ఏకైక ఆప్షన్ గా అనుకున్నానని, హీరోగా ఎవరు? ఎవరు? అన్న ఆలోచన వచ్చాక, శర్వా మైండ్ లోకి వచ్చాడని అన్నారు. సమంత-శర్వా-ప్రేమ్ ముగ్గురు కలిసి మ్యాజిక్ చేసారని, అది ఈ నెల 7న చూస్తారని అన్నారు. తమిళంలో ఏ మ్యాజిక్ వుందో, ఫ్లావర్ వుందో అది అస్సలు మిస్ కాకూడదని తాను అనుకున్నానని, ఇక్కడి వారు ఎవరైనా తమిళం చూసి, తెలుగు వెర్షన్ కు వచ్చినా, కొత్తగానే ఫీల్ అవుతారని దిల్ రాజు ధీమా వ్యక్తం చేసారు.
ఇలాంటి మంచి సినిమాను తమిళంలో చూసినంత మాత్రాన తెలుగు లో చూడరని లేదని, తెలుగు ఫీల్, తెలుగు భాష, తెలుగు నటులు ఇవన్నీ కలిసి ఎంజాయ్ చేసేలా చేస్తాయని దిల్ రాజు అన్నారు. తమిళం మాదిరిగా తెలుగులో కూడా క్లాసిక్ అయితే కనుక శర్వాకు మళ్లీ కెరీర్ బెస్ట్ వస్తుందని దిల్ రాజు ధీమా వ్యక్తం చేసారు.