యోగిరాజ్యంలో తుపాకుల మోత‌.. ఫేమ‌స్ కోసం!

మొన్న‌టి వ‌ర‌కూ నేర‌చ‌రిత్ర ఉన్న వారిని యూపీలో విప‌రీతంగా ఎన్ కౌంట‌ర్లు చేస్తూ ఉన్నార‌ని, యోగి ఆదిత్య‌నాథ్ యూపీ సీఎం అయ్యాకా.. ఐదారు వంద‌ల మంది రౌడీషీట‌ర్ల‌ను ఎన్ కౌంట‌ర్ చేసిన‌ట్టుగా మీడియాలో క‌థ‌నాలు…

మొన్న‌టి వ‌ర‌కూ నేర‌చ‌రిత్ర ఉన్న వారిని యూపీలో విప‌రీతంగా ఎన్ కౌంట‌ర్లు చేస్తూ ఉన్నార‌ని, యోగి ఆదిత్య‌నాథ్ యూపీ సీఎం అయ్యాకా.. ఐదారు వంద‌ల మంది రౌడీషీట‌ర్ల‌ను ఎన్ కౌంట‌ర్ చేసిన‌ట్టుగా మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇది ఒకందుకు మంచిదే అని, రౌడీ అనే పేరు వినిపించ‌కుండా యోగి గూండారాజ్ కు ఇలా చ‌ర‌మ‌గీతం పాడుతున్నార‌నే కీర్త‌న‌లూ వినిపించాయి. స‌మాజ్ వాదీ పార్టీ హ‌యాంలో యూపీ గూండారాజ్ గా మారింద‌ని, ఎస్పీ పాలు పోసి పెంచిన గూండాల‌ను ఇలా మ‌ట్టుబెడుతున్నార‌ని, ఇదే యూపీకి ప‌రిష్కార‌మార్గ‌మ‌నే విశ్లేష‌ణ‌లూ వాట్సాప్ లో విప‌రీతంగా వినిపించాయి.

గ‌త వారంలో కూడా అలాంటి ఎన్ కౌంట‌రే ఒక‌టి జ‌రిగింది. క‌ట్ చేస్తే ఆ ఎన్ కౌంట‌ర్ అయిన రౌడీ షీట‌ర్ కుటుంబీకులు కాల్చిచంప‌బ‌డ్డారు. ముందుగా ఈ హెడ్ లైన్ విన‌గానే బ‌హుశా పోలీసులే వీరిని కూడా కాల్చేశారేమో అని అంతా అనుకున్నారు. పోలీసుల తుపాకీ మోత‌కు రౌడీషీట‌ర్లు రాలిపోవ‌డం రొటీన్ అయిన నేప‌థ్యంలో.. మొన్నటి త‌ర‌హాలోనే ఇది కూడా ఎన్ కౌంట‌రే అని అంతా అనుకున్నారు.

అయితే తీరా చూస్తే కాల్చింది పోలీసులు కాదు! కాల్చి చంపింది పోలీసులు కాదు.. అంటూ వార్తా చాన‌ళ్లు ప్ర‌ముఖంగా చెప్పాల్సి వ‌చ్చింది. ఇంతా ఎన్ కౌంట‌ర్ల ప్ర‌భావం ఉంద‌క్క‌డ‌! జ‌ర్న‌లిస్టుల ముసుగులో ముగ్గురు యువ‌కులు పోలీసుల అదుపులోని వ్య‌క్తుల‌ను కాల్చి చంపార‌ని, చంపిన వెంట‌నే జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. వారిని వెంట‌నే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించ‌గా.. తాము ఫేమ‌స్ కావ‌డానికే వారు ఈ ప‌నికి ఒడిక‌ట్టిన‌ట్టుగా చెప్పారు. పోలీసుల అదుపులోని ఇద్ద‌రు నేర‌నేప‌థ్యం గ‌ల వ్య‌క్తుల హ‌త్య‌కు కార‌ణం.. నిందితులు ప‌బ్లిసిటీ కోసం చేసిన ప‌ని అని పోలీసుల ఎఫ్ఐఆర్ లోనే పేర్కొన్నారు!

ఎన్ కౌంట‌ర్ల‌ను  ప్ర‌భుత్వం హీరోయిజం అనుకున్న‌ట్టుంది. నేరాన్ని అరిక‌ట్ట‌డం అంటే నేర‌గాళ్ల‌ను కాల్చుకుంటూ పోవ‌డం కాద‌నే స‌త్యం చాలా వేగంగానే అర్థం అవుతున్న‌ట్టుగా ఉంది. ఒక‌డిని ఎన్ కౌంట‌ర్ చేస్తే మ‌రొక‌డు ఆ ప్లేస్ ను ఆక్ర‌మిస్తాడు త‌ప్ప‌, పోలీసులు కాల్చేస్తారంటూ మ‌ళ్లీ గ‌న్ను ప‌ట్ట‌ని వారు ఉండ‌రా! పోలీసుల అదుపులోని వారినే కాల్చి చంపేశారు. వారిని చంపి వీరు సంపాదించుకునే ఇమేజ్ కూడా రౌడీ ఇమేజే! పెద్ద రౌడీని చంపేసి ఇంకా పెద్ద రౌడీలు కావొచ్చ‌ని ఆశించే వారు యూపీ స‌మాజం నుంచి పుట్టుకురావ‌డం పెద్ద ఆశ్చ‌ర్యం కాదు!

ఐదు వంద‌ల మందికి పైగా రౌడీ షీట‌ర్ల‌ను యోగి ప్ర‌భుత్వం ఎన్ కౌంట‌ర్ చేసేసింద‌ని, ఇంత‌టితో యూపీ పుణీతం అయిపోయింద‌ని వాట్సాప్ యూనివ‌ర్సిటీ చాన్నాళ్ల నుంచినే వాదిస్తోంది. అయితే ఎన్ కౌంట‌ర్లుఅనేవి కేవ‌లం జ‌నాల‌ను ఎమోష‌న‌ల్ ఫూల్స్ చేసేందుకే వాడ‌తార‌ని, వంద కేసుల‌కు పైగా ఉన్న‌వాడిని క‌నీసం ఒక్క కేసులో బ‌య‌ట‌కు రాకుండా బొక్క‌లో వేయాల్సిన ప్ర‌భుత్వాలు, ఇన్ స్టంట్ జ‌స్టిస్ తో రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌నే ప్ర‌య‌త్నాలు చేస్తాయ‌నే విష‌యాన్ని సామాన్యుల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పే సినిమాలు కూడా వ‌స్తున్నాయి! ఎన్ కౌంట‌ర్ల వెనుక ఎంతో రాజ‌కీయం ఉంటుంది.

ఇదే రౌడీ షీట‌ర్ల‌ను గ‌తంలో పెంచి పోషించిన వారిలో పోలీసులు పాత్ర కూడా పెద్ద‌దే! మ‌రి ఇప్పుడు పోలీసుల అదుపులోని రౌడీషీట‌ర్ల‌నే కాల్చి చంపారు! ఇప్పుడేం చేస్తారు? కాల్చిన వారిని ఫేమ‌స్ చేసి, రౌడీయిజానికి కొత్త ర‌క్తాన్ని అందిస్తున్న‌ట్టా! చంపింది రౌడీషీట‌ర్ల‌నే కాబ‌ట్టి.. ఈ రౌడీల‌ను మంచి వాళ్లు అని ముద్ర వేస్తారా!