13.25 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారని, అతడేమో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడంటూ హ్యారీ బ్రూక్ మీద సోషల్ మీడియాలో ట్రోల్ నడిచింది. ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ కు ఆడుతున్న ఈ ఇంగ్లండ్ క్రికెటర్ పై తెలుగు సోషల్ మీడియా జనాలు కూడా ట్రోల్ చేశారు. రకరకాల మీమ్స్ తో ఇతడిని ఆడుకున్నారు. అలాగే హిందీ, ఇతర భాషల నెటిజన్లు కూడా బ్రూక్ ను బ్రూటల్ గా ట్రోల్ చేశారు!
అయితే ఐపీఎల్ లో ఇలా భారీ రేటు పలికిన వారంతా అదే స్థాయికి రాణించాలని ఏమీ లేదు! గతంలో కూడా రికార్డు స్థాయి పలికిన వారు అందుకు తగ్గట్టుగా రాణించలేకపోయిన సందర్భాలు బోలెడుఉంటాయి. తమకు అంత ధర పలుకుతుందని, వారు కూడా ఊహించి ఉండరు పాపం.
ఇలాంటి భారీ రేటు ను అందుకోవడం మాటెలా ఉన్నా, దీని వల్ల మానసికంగా వారిపై ఒత్తిడి పడే అవకాశాలూ పెరుగుతాయి. ఒకటీ రెండు సీన్లలో ఇలాంటి భారీ ధరలు పలికి, అంచనాలను అందుకోలేక, ఆ తర్వాతి ఏడాది డిమాండ్ పడిపోయి.. నిస్పృహకు గురైన వారు కూడా ఉండకపోరు!
హ్యారీ బ్రూక్ విషయంలోనూ ఇలాంటి ట్రోల్ సాగింది. వందల కొద్దీ మీమ్స్ పెట్టి, వేల కొద్దీ షేర్లతో ఇతడిని ఆడుకున్నారు నెటిజన్లు. అయితే వారందరికీ ఒకే సమాధానం అన్నట్టుగా ఇతడు నాలుగో మ్యాచ్ లో సెంచరీతో రెచ్చిపోయాడు. ఎస్ఆర్హెచ్ భారీ స్కోరుకు ఆస్కారం ఇచ్చాడు. బౌలర్లు కూడా తలో చేయి వేయడంతో ఆ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు నెగ్గింది.
దీంతో బ్రూక్ పై కూడా ఒత్తిడి కాస్త తగ్గి ఉండవచ్చు. భారీ రెమ్యూనిరేషన్ అందుకుంటున్నాడని అక్కడి తమ సొమ్మేదో ఇస్తున్నట్టుగా నెటిజన్లు విరుచుకుపడుతున్న వైనం ఇక కాస్త తగ్గుతుంది. అయితే ఇంతటితో ఎస్ఆర్హెచ్ గాడిన పడ్డట్టే అనుకోవడానికి కూడా లేదు. ఈ జట్టుకు ప్రధానంగా ఆల్ రౌండర్ల అండ లేదు.
వాషింగ్టన్ సుందర్ పేరుకు ఆల్ రౌండరే అయినా.. అతడంత ఫామ్ లో కనిపించడం లేదు. అలాగే ఎస్ఆర్మెచ్ వదులుకున్న పేరున్న ఆటగాళ్లు ఇప్పుడు వేర్వేరు జట్లకు బాగా ఆడుతున్నారు. సన్ జట్టు ఆటగాళ్లంతా ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు. వీరి మధ్యన ఒక జట్టుగా ఇంకా కూర్పు కుదిరినట్టుగా కూడా అగుపించడం లేదు.