జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ అయితే ఇస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. వీలైనన్ని సినిమాలు చేసేయాలని పవన్ కల్యాణ్ గట్టిగా ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తున్నారు. తను పూర్తి కాలం రాజకీయాల్లోకి వచ్చేసినట్టుగా ఇక సినిమాల వైపు వెళ్లే ఉద్దేశం లేనట్టుగా జనసేన అధినేత ఇది వరకే ప్రకటించారు. అయితే పవన్ ఆ మాట మీద నిలబడలేదు. తను సినిమాల్లో నటించనని పవన్ చేసిన ప్రకటన కేవలం నటన మాత్రమే అయ్యింది. ఇప్పుడు ఆయన సినిమాలు చేసుకుంటున్నారు.
రాబోయే నాలుగేళ్లూ పవన్ సినిమాలకే పరిమితం కావొచ్చు. అడపాదడపా ట్విటర్ రాజకీయం చేస్తే.. తను రాజకీయాల్లో ఉన్నట్టుగా పవన్ భ్రమింపజేయడానికి ప్రయత్నించవచ్చు. ఇలాంటి రాజకీయాలు నడిచే రోజులు కావు ఇవి. పూర్తి కాలం రాజకీయాల్లో ఉంటానని చెప్పి, జనాల్లో తిరిగినప్పుడే పవన్ కల్యాణ్ కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు. అలాంటిది గెస్ట్ తరహా రాజకీయాలతో ఆయన మేరకు రాణించగలడో అంచనా వేయలేనంత కష్టమైనది ఏమీ కాదు.
పవన్ రాజకీయాల సంగతలా ఉంటే.. పవన్ సినిమాలు కాస్త అటూ ఇటూ అయితే అప్పుడు పరిస్థితి ఏమిటి? అనేది మరో చర్చ. సినిమాల సక్సెస్ రేటు ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు. అందునా పవన్ చేస్తున్న పింక్ రీమేక్ కమర్షియల్ హీరోకి ఏ మాత్రం సెట్ అవుతుందో సందేహమే. తమిళంలో ఈ సినిమాను అజిత్ చేసినప్పటికీ ఆడలేదు! అందుకే మార్పులు చేర్పులు చేస్తున్నారట. అయితే అలాంటి మార్పులు మొదటికే మోసం కావొచ్చేమో!
ఇక క్రిష్ కమర్షియల్ సినిమాలను ఏ మేరకు తీర్చగలడో సందేహమే! ఇక మిగతా రెండు సినిమాల సంగతి ఇంకా పూర్తి తెలియాల్సి ఉంది. కానీ రీ ఎంట్రీ తర్వాత తొలి సినిమాతో పవన్ కల్యాణ్ సత్తా చూపించాల్సి ఉంటుంది. బాస్ ఈజ్ బ్యాక్ తరహా హిట్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలా కాకుండా.. మళ్లీ కాటమరాయుడు, సర్ధార్ గబ్బర్ సింగ్ అంటే మాత్రం.. పవన్ సినీ కెరీర్ కు కూడా ఎర్ర జెండా ఊగే అవకాశాలుంటాయి. అత్యాశతో రాజకీయాల్లోకి వెళ్లి, అక్కడ ఏం సాధించలేక తిరిగి సినిమాల్లోకి వచ్చాకా సరైన హిట్ పడకపోతే మాత్రం పవన్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడీ కావొచ్చు! అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.