పవన్ కళ్యాణ్, 'పింక్' రీమేక్‌లో నటిస్తున్నాడని కన్ఫర్మేషన్ వచ్చింది.. లీకుల ఫొటోలు, వీడియోల ద్వారానానే. 'ఒట్టు, మా పవన్ కళ్యాణ్ సినిమాల్లో మళ్ళీ నటిస్తున్నాడు.. కావాలంటే ఇదిగో సాక్ష్యం..' అంటూ 'పిక్' సినిమా రీమేక్ తాలూకు షూటింగ్ స్పాట్‌లో తీసిన కొన్ని ఫొటోల్ని, వీడియోల్ని స్వయంగా పవన్ కళ్యాణ్ అభిమానులే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు. అక్కడితో ఈ లీకుల గోల ఆగలేదు.. ఇంకా కొనసాగుతూనే వుంది.
'డే వన్.. డే టూ..' అంటూ 'పింక్' రీమేక్ (టైటిల్ త్వరలోనే విడుదల చేస్తారట) షూటింగ్ స్పాట్ నుంచి ప్పటికప్పుడు వీడియోలు, ఫొటోలు బయటకు వస్తూనే వున్నాయి. తాజాగా కొన్ని డైలాగ్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇవి నిజంగానే సినిమాలో వుంటాయా.? లేదంటే, అభిమానులు అత్యుత్సాహంతో క్రియేట్ చేస్తున్నవా.? అనేది ఇప్పట్లో తేలే అవకాశం లేదు.
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకి ఈ తరహా లీకుల బెడద ఎక్కువ. అయినాగానీ, మరీ ఇంతలా.. షూటింగ్ స్పాట్ నుంచి అప్ డేట్స్‌ని లీకుల రూపంలో సోషల్ మీడియాలో విడుదల చేయడం అనేది బహుశా పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రమే జరుగుతోందేమో. అన్నట్టు, 'అత్తారింటికి దారేది' సినిమా అప్పట్లో విడుదలకు ముందే సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం విదితమే. ఆ దెబ్బకే సినిమా రిలీజ్‌ని ముందుకు జరిపారు. అఫ్‌కోర్స్ ఆ సినిమా ఘనవిజయం సాధించిందనుకోండి.. అది వేరే విషయం. 'ట్యాక్సీవాలా' సినిమా కూడా దాదాపు ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది.
ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్ ఎటూ తాను సినిమాల్లో తిరిగి నటిస్తున్నట్లు నిన్న మొన్నటిదాకా ప్రకటించని దరిమిలా, ఆయన సినిమాలు చేస్తున్న విషయాన్ని కన్‌ఫామ్ చేసేందుకే ఈ 'లీకుల' వ్యవహారం యూనిట్ వర్గాల నుంచే వెలుగు చూసిందా.? అనే కోణంలోనూ టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఏమో, ఆ సంగతేమోగానీ.. కొత్తగా ఇంకో వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ లీకులు ఇంకా ముదిరితే.. సినిమాపై ఇంట్రెస్ట్ అటకెక్కిపోవడం ఖాయం. అన్నట్టు, 'పింక్' రీమేక్‌ని మే 15న విడుదల చేస్తారట. ఉగాదికి టైటిల్‌ని రివీల్ చేయాలనే ఆలోచనలో వున్నారట.