స్టీల్ ప్లాంట్ కోసం బడా కంపెనీలు క్యూ

విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే దేశంలోనే గొప్ప పేరు ఉంది. నాణ్యత కలిగిన ఉక్కుని తయారు చేయడంతో ప్లాంట్ కి ప్రపంచవ్యాప్తంగా గుడ్ విల్ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇపుడు వివిధ…

విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే దేశంలోనే గొప్ప పేరు ఉంది. నాణ్యత కలిగిన ఉక్కుని తయారు చేయడంతో ప్లాంట్ కి ప్రపంచవ్యాప్తంగా గుడ్ విల్ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇపుడు వివిధ విభాగాలను పటిష్టం చేసేందుకు కేంద్రం కొత్త ప్రయత్నాలు చేస్తోంది. వాటికే మరో విధంగా చెప్పుకుంటే దశలవారీ ప్రైవేటీకరణ అనవచ్చు.

కొన్ని విభాగాలను బలోపేతం చేసేందుకు అవసరం అయిన మూలధనం ప్లాంట్ కి కావాలి. దాని కోసం విడతల వారీగా బిడ్లను ఆహ్వానించేందుకు ప్లాంట్ సిద్ధపడుతోంది. ఇపుడు మొదట ఈవోఐ కోసం ఆసక్తి కలిగిన వారి నుంచి బిడ్లను కోరుతోంది.

గడువు ఈ నెల 15 దాకా విధించినప్పటికి దేశంలోని ప్రముఖ కంపెనీలు బిడ్లను దాఖలు చేసి విశాఖ ఉక్కు మీద తమ ఆసక్తి ఏంటో చూపించాయి. దాదాపుగా ఇరవై రెండు దాకా బిడ్లను బడా కంపెనీల నుంచే వచ్చాయని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ బిడ్ల దాఖలుకు గడువుని ఈ నెల 20 వరకూ పెంచుతూ తాజాగా ప్రకటించింది.

ఈ పరిణామంతో మరిన్ని కొత్త కంపెనీలు బిడ్ల కోసం పోటీ పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. వస్తు రూపేణా లేక ధన రూపేణా స్టీల్ ప్లాంట్ కి మూలధనం సమకూర్చవచ్చు. అయితే ఉక్కు రంగంలో అనుభవం ఉన్న వారే బిడ్లను దాఖలు చేయలన్నది కండిషన్ ఉంది.

బిడ్ ని దక్కించుకున్న కంపెనీకి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులను అందిస్తారు. ఆ విధంగా ఒప్పందంతో ఒక కీలకమైన మౌలికమైన భాగస్వామిగా ఎంట్రీ ఇచ్చేందుకు వీలు కుదురుతుంది. స్టీల్ ప్లాంట్ కి తక్షణ అవసరంగా దాదాపుగా తొమ్మిది వందల కోట్ల మూలధనం అవసరం ఉంది అని భావిస్తున్నారు.

ఈ విధంగా వివిధ‌ విభాగాలకు సంబంధించి పటిష్టం చేయడం కోసం అయిదారు వేల కోట్ల మూలధనం కావాల్సి ఉంది అని చెబుతున్నారు అందుకోసం దశల వారీగా బిడ్లను ఆహ్వానిస్తారని తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ కి అవసరం అయిన అయిదారు వేల కోట్ల రూపాయలను కేంద్రం అందించి ఆదుకోవచ్చు. కానీ ప్రైవేటీకరణ వైపే అడుగులు వేస్తున్న కేంద్ర పెద్దలు ఆ ప్రక్రియను సజావుగా సాగించేలా చూస్తున్నారని భోగట్టా. 

మొత్తంగా చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నంబర్ వన్ కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయని బిడ్ల దాఖలు తో అర్ధమవుతోంది. ఈ ప్రక్రియను బట్టి ప్లాంట్ భవితవ్యం ఏమిటి అన్నది తేలనుంది అని అంటున్నారు.