ఏపీలో అఖిల పక్షం అన్న మాట తరచూ వినిపిస్తుంది. అన్ని పార్టీలు కలసి కేంద్రం వద్దకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సహా కీలకమైన అంశాల మీద వెళ్లాలీ అనుకున్నా అఖిలపక్షం లో ఎవరున్నారు అన్నదే వైసీపీ వాదనగా ఉంది. అఖిలపక్షం కాదు అది ఏకైక పక్షంగా మారింది అన్న విమర్శ ఉంది.
తెలుగుదేశం బాటలోనే కుడి ఎడమలుగా ఉన్న కమలం, కమ్యూనిస్టులు చాలా కాలంగా మాట్లాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. జనసేన టీడీపీ పొత్తు దారిలో ఉందని అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ సైతం టీడీపీ టోన్ లోనే మాట్లాడుతుంది. అలాంటపుడు అఖిలపక్షం అంటే అది టీడీపీ పక్షమే అన్న భావన అయితే ఉంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద అఖిల పక్షాన్ని పిలవాలని సీపీఏం కోరుతోంది. కేంద్రం వద్దకు అన్ని పార్టీల ప్రతినిధులను తీసుకెళ్ళాలని డిమాండ్ చేస్తోంది. అఖిలపక్షం అంటే మాకు నమ్మకం లేదని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కుండబద్ధలు కొట్టారు. అందుకే అఖిలపక్షం అన్న మాటే తాము తలవడంలేదని చెప్పేశారు.
తెలుగుదేశం పార్టీ ఎంతసేపూ స్టీల్ ప్లాంట్ విషయంలో మోడీని వదిలేసి జగన్నే విమర్శిస్తూ వస్తోంది. మిగిలిన పార్టీలు అదే మాట్లాడుతున్న వేళ అఖిలపక్షం అనుకుంటూ హస్తిన ప్రయాణం కట్టినా ఒరిగేది ఏముండదని వైసీపీ విశ్వసిస్తోంది. అందుకే నో అఖిలపక్షం అనేస్తున్నారు బొత్స.
కోడి కత్తి కేసులో జగన్ సానుభూతి కోసమే అంతా చేయించుకున్నారు అని ఎల్లో మీడియాలో రాస్తున్న రాతల పట్ల బొత్స సీరియస్ అయ్యారు ఎన్‌ఐఏ రిపోర్ట్‌లో ఏముందో ఎల్లో మీడియాకు టీడీపీ నేతలకు ఎలా తెలిసిందని ఆయన ప్రశ్నించారు. కోడి కత్తి దాడి వెనక ఏముందో వాస్తవాలు బయటకు రావాల్సి ఉందని ఆయన అంటున్నారు.
తిరుపతి వద్ద అలిపిరి దాడిలో చంద్రబాబు గాయపడ్డారు ఆ దాడి ఆయన సానుభూతి కోసం చేయించుకున్నారా అని బొత్స స్ట్రెయిట్ క్వశ్చన్ తమ్ముళ్లకు వేశారు. జగన్ మీద విశాఖ ఎయిర్ పోర్టు లో జరిగిన దాడి వాస్తవం అన్నారు, దాని వెనక సూత్రధారులు ఎవరో బయటకు రావాల్సి ఉందని బొత్స అంటున్నారు.