ఏజెంట్ సినిమా మేకింగ్ టైమ్ లో కరోనా బారినపడి, బుడాపెస్ట్ లో 20 రోజుల పాటు ఐసియులో వున్నానని, బతికి వెనక్కు వచ్చానని, మరోసారి కాలికి గాయం కావడంతో రెండున్నర నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని దర్శకుడు సురేందర్ రెడ్డి అన్నారు.
ఇవన్నీ ఎవరికీ తెలియవు అని వివరించారు. ఏజెంట్ సినిమాకు వర్కింగ్ డేస్ 100 మాత్రమే అని, కానీ వివిధ కారణాల వల్ల పట్టిన సమయం మాత్రం రెండేళ్లని ఆయన వివరించారు. ఏజెంట్ సినిమా టీమ్ క్యూ అండ్ ఏ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి పాల్గొని సమాధానాలు ఇచ్చారు.
బాహుబలి ముందు ప్రభాస్ మార్కెట్ ఎలాగో, ఇప్పుడు అఖిల్ మార్కెట్ అలా అని, కానీ తరువాత వేరుగా వుంటుందని నిర్మాత అనిల్ సుంకర అన్నారు. సూపర్ స్టార్ అండర్ మేకింగ్ అని వివరించారు. సినిమా బాగుంటే హీరోల మార్కెట్ కు బౌండరీలు వుండవని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రెండు నెలల క్రితమే సినిమా హక్కులు విక్రయించేసామని, నైజాం హక్కుల మీద బేరసారాలు సాగుతున్నాయని వెల్లడించారు.
ఈ సినిమా ప్రారంభమైనపుడే తనకు దర్శకుడు సురేందర్ రెడ్డి క్లారిటీగా చెప్పేసారని, ఇబ్బందులు వుంటాయని అర్థమయ్యేలా వివరించారని హీరో అఖిల్ అన్నారు. అందుకే ఏ రోజూ ఈ సినిమా గురించి ఫ్రస్టేట్ కాలేదని అన్నారు. ఇష్టంగా పడిన కష్టం తప్ప వేరు కాదన్నారు. ప్రచారానికి చాలా తక్కువ సమయం వుందని, మీడియా సహకరిస్తే ఈ సమయం సరిపోతుందని అన్నారు.
హీరోయిన్ సాక్షి వైద్య, సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ తదితరులు ఈ సెషన్ లో పాల్గొన్నారు.