సివిల్స్ చదివిన వాళ్లు మేధావులని, విషయపరిజ్ఞానం ఉన్న వాళ్లని అనుకుంటాం. ఎంతటి మేధావి అయినా అప్పుడప్పుడు తెలివితక్కువగా మాట్లాడొచ్చు. అది మానవ సహజం. కానీ మరీ నిరక్షరాశ్యుడిలా మాట్లాడడం మాత్రం విడ్డూరమే. మనం చెప్పుకునేది జేడీ లక్ష్మీనారాయణ గురించి. ఆయన సివిల్ సర్వెంట్ గా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపడానికి ప్రజలే తలొక వంద రూపాయలు వేసుకుని కొనేయాలట. ఇది జేడీ అన్న మాటేనా అని ఒక్క క్షణం ఎవరిని వాళ్లు గిల్లుకోవాల్సిన పరిస్థితి. జనమంతా కలిసి కొనడమేంటి? అసలింతకీ ప్రైవేటీకరణని ఆపాల్సిన అవసరమేంటి?
ముందుగా మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల వల్ల ప్రజాధనం ఎంత నష్టమౌతోందో తెలుసుకోవాలి.
స్టీల్ ప్లాంట్ విషయాన్ని పక్కన పెట్టి ప్రభుత్వ రంగమైన రైల్వేస్ కి సంబంధించిన ఒక ఉదాహరణతో చెప్పుకుందాం.
చాలా ఏళ్ల క్రితం పరీక్షలు రాసి రైల్వేలో ఉద్యోగం సంపాదించిన ఒక వ్యక్తి లాంగ్ లీవ్ పేరుతో కొన్ని నెలలు, లాస్ ఆఫ్ పే పేరుతో మరి కొన్ని నెలలు సెలవలు పెట్టుకుంటూ ఏళ్ల తరబడి కాలక్షేపం చేసాడు. అన్నేసి సెలవలు ఎందుకంటే వేరే వ్యాపారాలు చేసుకోవడానికట. అతని వ్యాపారాలేవిటో అతని సీనియర్ కి కూడా తెలుసు. అయినా కూడా లెక్క ప్రకారం ఎన్ని సెలవలు మంజూరు కావాలో అన్నీ అవుతూనే వచ్చాయి. తాజాగా అతను వాలంటరీ రిటైర్మెంటు తీసుకున్నాడు. ఇష్టంలేని ఉద్యోగం వదిలేయడానికి ఇన్నాళ్లు ఎందుకు పట్టిందంటే, పెన్షన్ పొందడానికి కావాల్సినంత సర్వీస్ పుటప్ చేయడానికి ఆగాల్సి వచ్చిందట. ఇప్పుడతనికి రైల్వేస్ తో సంబంధం లేదు. కానీ నెల నెలా భారీ పెన్షన్ అందుకుంటున్నాడు. అంటే ఉద్యోగంలో ఉన్నన్నాళ్లూ చేసిన ప్రభుత్వ సేవ ఏమీ లేదు…జీతం తప్ప పని మీద ఆసక్తి లేదు.. ఇప్పుడు మానేసాక పెన్షన్ కూడా అందుతోంది. ఇది ప్రజాధనానికి రంధ్రమే కదా! ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి వాళ్లు దేశంలో వేరు వేరు ప్రభుత్వ రంగాల్లో లక్షల్లో ఉండొచ్చు.
అదే రైల్వేస్ కనుక ప్రైవేటీకరణ జరిగితే వీళ్ల వ్యవహారాలు ఇలా సాగవు. “పని చేస్తేనే జీతం, పనితనం తగ్గితే ఊస్టింగ్, పెన్షన్ గిన్షన్ జాన్తా నహీ!” అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు వనరులన్నీ సరైన విధంగా వినియోగింపబడతాయి.
కొంతమంది అనొచ్చు…ప్రైవేటీకరణ జరిగితే రైల్వే టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండకపోవచ్చని. ఇప్పుడు మాత్రం ఉంటున్నాయా? తత్కాల్ బుకింగ్ అని చెప్పి అధిక ధరలకి టికెట్స్ అమ్మట్లేదా? వందేభారత్ ఎక్స్ప్రెస్ లో ఎక్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ప్రైవేట్ విమానం టికెట్ ధరకి సమానంగా లేదా? అయినా ప్రైవేటీకరణ జరిగితే అన్ని తరగతుల ప్రయాణీకుల్ని ఆకర్షించడానికి వాళ్ల లెక్కలు వాళ్లు వేసుకుని లాభాల్లో నడిపే పనులు చేస్తారు తప్ప కస్టమర్స్ ని దూరం చేసుకుని నష్టాల్లో నడపరు కదా!
ఇన్నాళ్లూ ప్రభుత్వ హయాములో నడిచిన ఎయిర్ ఇండియా ఏళ్ల తరబడి నష్టాల్లోనే నడిచింది. ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఎంతో కొంత లాభం చూస్తున్నాయి.
ప్రభుత్వ సొమ్ము అనేటప్పటికి అన్ని సంస్థలకి లోకువ. దండిగా ఖర్చులు చేయడం పని తక్కువ చేయడం. జనాకర్షణ పథకాలు ఆలోచించకపోవడం…!
అందుకే ప్రైవేటీకరణ జరగాలి.
జనంతో నేరుగా ప్రమేయమున్న ఎయిర్ ఇండియానే ప్రైవేటైజ్ అయినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కూడా చేస్తే తప్పేంటి?
ఈ విధానంలో నష్టపోయేది ఎవరంటే, తేరగా జీతాలు పొందుతూ పని తక్కువ చేసే బద్ధకస్థులు. ఎక్కడ కష్టపడి పని చెయ్యాల్సొస్తుందో అని బెంగ. అంతకు మించి ఎవ్వరికీ నష్టంలేదు. రాష్ట్రానికేదో భారీ ఆదాయం పోతోందా అంటే నష్టాల్లో నీలుగుతూ నిక్కుతూ నడుస్తూ పెను భారమౌతోందంటే ఇక ఆదాయం ఎక్కడిది? దాని కన్నా ప్రైవేటీకరణ చేస్తే టాక్సుల రూపంలోనైనా ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. కష్టాన్ని నమ్ముకునే విషయమున్న యువతకి ఉద్యోగాలొస్తాయి.
ఇప్పుడు జేడీ స్టేట్మెంటుని పరిశీలిద్దాం. స్టీల్ ప్లాంటుని జనం తలొక వంద రూపాయలు వేసుకుని కొనాలా? ఎందుకు కొనాలి? జనం కొంటే ఎవరు నడపాలి? సివిల్ సర్వెంట్ రాజకీయనాయకుడయ్యాక నిరక్షరాశ్యుడౌతాడా? చదివేస్తే ఉన్న మతి పోవడమంటే ఇదే.
ఇక్కడ టాపిక్ కాకపోయినా మరొకరి గురించి కూడా చెప్పుకోవాలి. జేడీ లాగానే జయప్రకాష్ నారాయణ మరొక మేధావి. తెలిసిన విషయాన్ని బేస్ వాయిస్ లో క్లారిటీగా చెప్తుంటే అన్ని విషయాల్లోనూ నిఖార్సైన మనిషి అనుకుంటాం. ఎన్.టి.ఆర్ పక్కన అన్నేళ్లు పని చేసిన తనని చంద్రబాబు వెన్నుపోటు ఉదంతం గురించి అభిప్రాయం చెప్పమంటే ఆ టాపిక్ జోలికి వెళ్లనంటాడు. ఫర్ గానో ఎగైనెస్ట్ గానో తన ఆర్గ్యుమెంట్ వినిపించవచ్చు కదా! ఎటు మట్లాడితే ఎవరికి కోపం వస్తుందో అన్న భయమా? డెమోక్రసీ గురించి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి స్పీచులిచ్చే ఈ మాజీ ఐ.ఏ.ఎస్ అధికారి కూడా భయం చాటున బతుకున్న సామాన్యుడే అనిపిస్తుంది చాలా సార్లు. అలాంటప్పుడు వీళ్లు ఎవరికి ఆదర్శమౌతారు? ఎందుకౌతారు?
మళ్లీ టాపిక్ లోకి వస్తే..బ్యాంకింగ్ వ్యవస్థనే చూడండి. గతంలో తరచూ బ్యాంకుల స్ట్రైకులుండేవి. కారణం ట్రేడ్ యూనియన్లు. ఇప్పుడవేవీ లేవు. ఉన్నా గాలి తీసేసిన ట్యూబుల్లాగ ఉన్నాయి. కార్పొరేట్ పద్ధతిలో నడుస్తున్న బ్యాంకింగ్ వ్యవస్థలో ఆఫీసర్లు, మేనేజర్లు, క్యాషియర్లు అన్న తేడా లేకుండా అందరూ టార్గెట్ల చట్రంలో ఇరుక్కుని పని చేస్తున్నారు. ఆ ప్రైవేట్ బ్యాంకుల్ని చూసి నేషనలైజ్డ్ బ్యాంకులు కూడా పోటీ పడి అదే విధానంలో నడుస్తున్నాయి.
విజయ్ మాల్యా లాంటి వాళ్లు బ్యాంకుల్ని ముంచి పోతున్నా సదరు బ్యాంకులు అమెరికాలోని కొన్ని బ్యాంకుల మాదిరిగా పూర్తిగా మూతబడకుండా నిలదొక్కుకుంటున్నాయంటే ఆర్బీయై విధానాలతో పాటూ, కార్పొరేట్ పద్ధతిలో బ్యాంకుల్లోని అందరూ నడుము వంచి పనిచేయడమే.
జనానికి వెంటపడి లోన్లివ్వడం, అంతే వెంట పడి వసూలు చేసుకోవడం, తద్వారా బ్యాంకింగ్ రంగాన్ని పరిపుష్టం చేయడం జరుగుతోంది. ప్రపంచపటంలో భారత్ ఆర్ధిక పరిపుష్టతలో ఐదవ స్థానంలోకి ఎగబాకిందంటే దానికి కారణం ప్రస్తుతం బ్యాంకులు నడుస్తున్న విధానం ఒకటి. అందులో “ఫ్లోటింగ్ ఇంటెరెస్ట్ రేట్స్” వంటివి ఎన్నో మనకి నచ్చనివి ఉన్నా కూడా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలకుండా ఉండడానికి ప్రస్తుతానికి ఇదొక్కటే మార్గమని సరిపెట్టుకోవాలి. మన బ్యాంకులే కనుక ముప్పై ఏళ్ల క్రితం ఉన్నట్టుగా ఉండుంటే ఎప్పుడో దివాళా తీసేవాళ్లం..పాకిస్తాన్, శ్రీలంక కంటే అధ్వాన్నంగా ఉండేవాళ్లం.
ఎలా చూసుకున్నా మన దేశానికి ప్రైవైటైజేషన్, పిపిపి (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్) అనివార్యం. పిపిపి వ్యవహారమే లేకపోతే హైదరాబాదులో మెట్రో రైల్ వచ్చేది కాదు. వచ్చినా ఇంత పద్ధతిగా నడిచేది కాదు. జనం కూడా ప్రైవేట్ ఆధీనంలో ఉన్న సంస్థల వద్ద పద్ధతిగా నడుచుకుంటారు కానీ గవర్న్మెంట్ సంస్థలనేటప్పటికి ఉదాశీనత చూపిస్తుంటారు. పద్ధతి నుంచి పరిశుభ్రత వరకు అన్ని విషయాల్లోనూ ప్రైవేట్ విధానంలో ఉన్న శ్రద్ధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండనే ఉండదు.
కనుక ఒక్క విశాఖ స్టీల్ ప్లాంటే కాదు, రానున్న రోజుల్లో రైల్వేస్, రోడ్లు, మునిసిపాలిటీ వ్యవస్థ కూడా పిపిపి పద్ధతిలో ప్రైవేట్ భాగస్వామ్యంతో నడావల్సిందే. అప్పుడే దేశం అబివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడుతుంది.
మన దేశ ప్రజల బుద్ధికి, పద్ధతికి, మన రాజకీయ వ్యవస్థకి, జనం పడే అవస్థకి సరైన మందు ప్రైవేటీకరణే.
శ్రీనివాసమూర్తి