ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ నిన్న రాత్రి హత్యకు గురయ్యాడు. అరెస్టై జైలులో ఉన్న అతీక్ అహ్మద్ ను మెడికల్ చెకప్ కోసం ప్రయాగ్ రాజ్ లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ మరణించాడు. ఈ ఘటనలో అతీక్ సోదరుడు అష్రాఫ్ అహ్మద్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.
చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన అతిక్ అతని సోదరుడు మీడియాతో మాట్లాడుతుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు జర్నలిస్టుల బృందంలో చేరి అతిక్ మీడియాతో మాట్లాడుతుండగా దుండగుల్లో ఒకరు అతిక్ తలపై పిస్టల్ గురిపెట్టి కాల్చిచంపారు. మరో ఇద్దరు అతిక్ సోదరుడిపై కాల్పులు జరిపారు. కాల్పులు తర్వాత దుండగులు చేతులు పైకెత్తి పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది.
మరోవైపు అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ గురువారం ఝాన్సీలో రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్స్ జరిపిన ఎన్కౌంటర్ చనిపోయిన సంగతి తెలిసిందే. 2005 నాటి బీఎస్పీ శాసనసభ్యుడు రాజుపాల్ హత్యకేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్ తో పాటు ఆయన ఇద్దరు అనుచరులు ఫిబ్రవరి 24న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మాజీ ఎంపీ, గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్, ఇద్దరు కుమారులు, ఇద్దరు అనుచరులు, మరో తొమ్మది మందిపై కేసులు నమోదు చేశారు.
కాగా, జంట హత్యల నేపథ్యంలో ప్రయాగ్రాజ్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో అన్యాయానికి పరాకాష్ట అని ..‘పోలీసు కస్టడీలో ఎవరైనా చనిపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని’ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్వీట్టలో ప్రశ్నించారు.