జర్నలిస్టులే కాపాడి.. జర్నలిస్టులే చంపేసి..

ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న వందల వేల ఎన్ కౌంటర్ల క్రమం గమనిస్తే.. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ (60), అతని తమ్ముడు అష్రాఫ్ లను కాల్చి చంపడం అనేది మరొకరి చర్య…

ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న వందల వేల ఎన్ కౌంటర్ల క్రమం గమనిస్తే.. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ (60), అతని తమ్ముడు అష్రాఫ్ లను కాల్చి చంపడం అనేది మరొకరి చర్య అని అనిపించదు. కానీ పోలీసుల సమక్షంలోనే, మీడియా జర్నలిస్టుల కెమెరాలు అన్నీ పనిచేస్తున్న సమయంలోనే జరిగిన ఈ కాల్పులను ఎలా అర్థం చేసుకోవాలో బోధపడదు. 

తన మీద వందకు పైగా కేసులున్న యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కాల్పుల్లో తమ్ముడి సహా మరణించడం అనేది అనూహ్యమైన సంఘటన కాదు. కాకపోతే ఒక రకంగా జరుగుతుంది అనుకున్నది కాస్తా మరో రకంగా చోటుచేసుకుంది. జర్నలిస్టుల కారణంగానే ఒకసారి చావును తప్పించుకున్నాడని అందరూ అనుకున్న అతీక్ అహ్మద్, అదే జర్నలిస్టుల కారణంగానే (?) దుర్మరణం పాలయ్యాడు.

ఉత్తరప్రదేశ్ లో రౌడీలు, గ్యాంగ్ స్టర్ ల మీద ప్రభుత్వం ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నదో మనం చాలాకాలంగా గమనిస్తున్నాం. సాధారణంగా ‘‘గ్యాంగ్ స్టర్లను ఉక్కుపాదంతో అణిచేస్తాం’’ అనే మాటను మనం సినిమాల్లోను, రాజకీయ నాయకుల ప్రసంగాల్లోను చూస్తుంటాం. కానీ ఉక్కుపాదంతో అణచివేయడం అంటే ఏమిటో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ నిరూపిస్తున్నారు. ‘మిట్టీ మే మిలాదేంగే’ అని శాసనసభ సాక్షిగా హెచ్చరించిన ఈ ముఖ్యమంత్రి.. గ్యాంగ్‌స్టర్లను ఎన్ కౌంటర్ చేయిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

తాజాగా అతీక్ అహ్మద్ హత్యకు సంబంధించి విచారణ నిమిత్తం ముఖ్యమంత్రి ముగ్గురు సభ్యులతో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుచేశారు. 

గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ ను గురువారం పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. తండ్రి అతీక్ ను కోర్టు విచారణకు హాజరవుతున్న సమయంలోనే కొడుకు ఎన్ కౌంటర్ జరిగింది. అతీక్ కు ఇంకా నలుగురు కొడుకులున్నారు. ఇద్దరు ప్రస్తుతం జైల్లోనే ఉండగా, మరో ఇద్దరు మైనర్లు. వారూ గృహనిర్బంధంలోనే ఉన్నారు. అతీక్ అహ్మద్ ను పోలీసులు వైద్యపరీక్షల నిమిత్తం తీసుకువెళుతుండగా ఇప్పుడు ఈ హత్య జరిగింది. చుట్టుముట్టిన మీడియా జర్నలిస్టుల మధ్యలోంచి.. జర్నలిస్టుల్లాగానే వచ్చిన ముగ్గురు అతి సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. 

కొన్ని రోజుల కిందట అతీక్ అహ్మద్ ను కూడా పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారని కుటుంబసభ్యులు సహా అంతా అంచనా వేశారు. ఆయనను విచారణకు తరలించినప్పుడు దాదాపు 1200 కిమీల దూరం కుటుంబసభ్యులు, జర్నలిస్టులు పోలీసుల వాహనాల్ని వెంబడించి వెళ్లారు. 

జర్నలిస్టులు వెంబడిస్తున్నందువల్లనే ఆ రోజు అతీక్ ఎన్ కౌంటర్ జరగలేదని వినిపించింది. అయితే ఇప్పుడు, జర్నలిస్టుల రూపంలో వచ్చిన వారే అతీక్ ను కాల్చి చంపడం గమనార్హం. పోలీసుల సమక్షంలో, మీడియా కెమెరాలే సాక్ష్యాలుగా జరిగిన హత్యలు ఇవి. ఆ ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి ఎలాంటి కారణాలు వెలుగుచూస్తాయో గమనించాలి.