పాన్ ఇండియా నుంచి లోకల్ కు మారిన ఏజెంట్

ఏజెంట్.. అఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా. అంతేకాదు, అఖిల్ కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా మూవీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ రెండు విషయాల్లో మొదటిది నిజం. రెండోది…

ఏజెంట్.. అఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా. అంతేకాదు, అఖిల్ కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా మూవీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ రెండు విషయాల్లో మొదటిది నిజం. రెండోది మాత్రం కార్యాచరణకు వచ్చేసరికి సాధ్యం కాలేదు. అవును.. అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వడం లేదు.

28వ తేదీన ఈ సినిమా తెలుగు వెర్షన్ తో పాటు, మలయాళం వెర్షన్ (మమ్ముట్టి ఉన్నాడు కాబట్టి) రిలీజ్ అవుతోంది. హిందీలో 28న రిలీజ్ కావడం లేదు.

దీనికి ప్రధానంగా 2 కారణాలు చెబుతున్నాడు హీరో అఖిల్. వీటిలో ఒకటి ప్రచారానికి టైమ్ లేకపోవడం. ఇక రెండోది సల్మాన్ ఖాన్ సినిమాతో పోటీ. అలా అని పాన్ ఇండియా రిలీజ్ కోసం టోటల్ సినిమా విడుదలను వాయిదా వేయడం ఇష్టం లేదంటున్నాడు అఖిల్. ఎందుకంటే, తనకు తెలుగు మార్కెట్ ముఖ్యమంటున్నాడు.

మరో మంచి డేట్ చూసి, ప్రత్యేకంగా ప్రచారం చేసి మరీ హిందీ వెర్షన్ ఏజెంట్ ను విడుదల చేస్తామంటున్నాడు ఈ అక్కినేని హీరో. కంటెంట్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని, కాస్త ఆలస్యంగా హిందీలోకి వచ్చినప్పటికీ తమ సినిమా నిలదొక్కుకుంటుందని చెబుతున్నాడు. గతంలో కాంతార లాంటి సినిమాలు అలానే వచ్చాయని గుర్తుచేస్తున్నాడు.

ఏదేమైనా ఏజెంట్ సినిమాతో పాన్ ఇండియా రిలీజ్ మిస్సయ్యాడు అఖిల్. ఇలా మిస్సవ్వడం వల్ల తనకు ఎలాంటి బాధ లేదని, సినిమాపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెబుతున్నాడు. మూవీ రిజల్ట్ ప్రేక్షకుల చేతుల్లో ఉంటుందని, ఈ మూవీ జర్నీని మాత్రం తను బాగా ఎంజాయ్ చేశానని, చాలా నేర్చుకున్నానని చెబుతున్నాడు.