జ‌గ‌న్ స‌ర్కార్ మ‌న‌సులో ఏముంది?

ప్ర‌భుత్వ ఉద్యోగులు స‌మ్మెబాట ప‌ట్ట‌నున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌ర్కార్ మ‌న‌సులో ఏముంద‌నే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు నాలుగు రోజుల పాటు ఉద్యోగ సంఘాల నేత‌ల కోసం ఎదురు చూశామ‌ని, ఇక‌పై వారు వ‌స్తే త‌ప్ప…

ప్ర‌భుత్వ ఉద్యోగులు స‌మ్మెబాట ప‌ట్ట‌నున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌ర్కార్ మ‌న‌సులో ఏముంద‌నే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు నాలుగు రోజుల పాటు ఉద్యోగ సంఘాల నేత‌ల కోసం ఎదురు చూశామ‌ని, ఇక‌పై వారు వ‌స్తే త‌ప్ప చ‌ర్చ‌లు జ‌ర‌ప‌మ‌ని మంత్రులు తేల్చి చెప్పారు. ఈ నేప‌థ్యంలో పీఆర్సీ బంతిని ఉద్యోగుల కోర్టులోనే వేసిన‌ట్టైంది. అస‌లు ప్ర‌భుత్వ మ‌న‌సులో ఏముంది? ఇక చ‌ర్చ‌ల‌కే పిల‌వ‌మ‌ని ప్ర‌భుత్వం భీష్మించుకోడానికి కార‌ణాలేంటి? అనేది ఉద్యోగ సంఘాల‌కు అంతుచిక్క‌డం లేదు.

నూత‌న‌ పీఆర్సీ విష‌యంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు సంతృప్తిగా లేరు. ఈ పీఆర్సీ వ‌ల్ల త‌మ జీతాలు త‌గ్గుతాయ‌ని వారు ఆందోళ‌న చెందుతున్నారు. పాత పీఆర్సీ ప్ర‌కారం వేత‌నాలు చెల్లించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కానీ కొత్త పీఆర్సీ ప్ర‌కార‌మే వేత‌నాలు చెల్లిస్తామ‌ని, త‌గ్గితే అప్పుడు త‌మ‌ను ప్ర‌శ్నించాల‌ని ప్ర‌భుత్వం వాదిస్తోంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ఉద్యోగుల అనుమానాల‌ను నివృత్తి చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం మంత్రుల‌తో కూడిన క‌మిటీని ఏర్పాటు చేసింది.

ఈ క‌మిటీ వ‌రుస‌గా నాలుగు రోజులు పాటు స‌చివాల‌యంలో ఉద్యోగ సంఘాల నేత‌ల రాక కోసం ఎదురు చూసింది. అయినా వారి నుంచి ఎలాంటి స్పంద‌నా రాలేదు. మ‌రోవైపు నూత‌న పీఆర్సీపై ఇటీవ‌ల హైకోర్టు ఘాటు కామెంట్స్ ప్ర‌భుత్వానికి ధైర్యాన్ని ఇచ్చాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ్మెపై గ‌తంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా స‌మ‌యం, సంద‌ర్భం చూసుకుని సానుకూలంగా మ‌లుచుకోవ‌చ్చ‌నే భావ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

పీఆర్సీ సాధ‌న స‌మితి ఈ నెల 24న ప్ర‌భుత్వానికి స‌మ్మె నోటీసు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే నెల మొద‌టి వారంలో స‌మ్మె బాట‌లో ప‌య‌నించేందుకు ప్ర‌భుత్వ ఉద్యోగులు సిద్ధ‌మ‌వుతున్నారు. అలాగే ఫిబ్ర‌వ‌రి 3న చ‌లోవిజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని త‌ల‌పెట్టారు. దీన్ని విజ‌య‌వంతం చేసే ప‌నిలో ఉద్యోగ సంఘాల నేత‌లు ఉన్నారు. 

ఒక ర‌కంగా బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న చేసి, రాజ‌కీయ కోణంలో ప్ర‌భుత్వాన్ని బెద‌ర‌గొట్టాల‌నే రీతిలో ఉద్యోగులు ముంద‌డుగు వేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఉద్యోగుల‌ను తాము ఏమీ అన‌కుండానే , సుప్రీంకోర్టు ఆదేశాల‌ను ప్ర‌యోగించి అదుపులోకి తెచ్చుకోవాల‌నే ఎత్తుగ‌డ‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో హైకోర్టులో ఉద్యోగుల స‌మ్మెపై ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ప్ర‌భుత్వోద్యోగులు స‌మ్మె చేయ‌డం రాజ్యాంగ వ్య‌తిరేక‌మే కాక‌, స‌ర్వీసు నిబంధ‌న‌ల‌కు కూడా విరుద్ధ‌మంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, ఈ నేప‌థ్యంలో వారి స‌మ్మె నోటీసును రాజ్యాంగ విరుద్ధంగా, చ‌ట్ట విరుద్ధంగా ప్ర‌క‌టించాల‌ని కోరుతూ విశాఖ‌ప‌ట్నంకు చెందిన విశ్రాంత ప్రొఫెస‌ర్ నాదెండ్ల సాంబ‌శివ‌రావు వ్యాజ్యాన్ని దాఖ‌లు చేశారు. 

టీకే రంగ‌రాజ‌న్ కేసులో సుప్రీంకోర్టు 2003లో ఇచ్చిన తీర్పును అనుస‌రించి స‌మ్మె చేసే ప్రాథ‌మిక‌, నైతిక‌, చ‌ట్ట‌బ‌ద్ధ హ‌క్కు ఉద్యోగుల‌కు లేద‌ని ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న కోర్టును కోరారు. స‌మ్మె నోటీసు ఆధారంగా స‌మ్మెకు వెళ్ల‌కుండా ఉద్యోగుల‌ను నియంత్రించే విష‌యంలో త‌గిన చ‌ర్య‌లు తీసుకునేలా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని ఆయ‌న కోర్టును అభ్య‌ర్థించారు.

ప్ర‌భుత్వానికి సంబంధం లేకుండానే అన్నీ జ‌రుగుతాయ‌ని భావిస్తే అంత‌కంటే అజ్ఞానం మ‌రొక‌టి వుండ‌దు. ఉద్యోగ సంఘాల ఎత్తుకు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వం పైఎత్తులు వేసేందుకు రెడీగా ఉంది. ఈ పీఆర్సీ ఆట‌లో చివ‌రికి ఎవ‌రు గెలుస్తార‌నేదే కీల‌కంగా మారింది. కానీ ప్ర‌భుత్వం మాత్రం త‌న చేతికి మ‌ట్టి అంట‌కుండానే అన్నీ చ‌ట్ట‌బ‌ద్ధంగా కంట్రోల్ చేసేందుకు, రిమోట్‌ను చేతిలో ఉంచుకుంద‌నే వాస్త‌వాన్ని ఉద్యోగులు విస్మ‌రించొద్దు. 

ఉద్యోగులుగా త‌మ హ‌క్కుల ప‌రిధి ఏంటో తెలుసుకుని మెలిగితే గౌర‌వం ద‌క్కుతుంది. అలా కాకుండా తాము 13 ల‌క్ష‌ల మంది ఉద్యోగులున్నామ‌ని, త‌మ కుటుంబ స‌భ్యులంద‌రివి క‌లిపితే 50 ల‌క్ష‌ల ఓట్లున్నాయ‌నే లెక్క‌లేస్తే మాత్రం… పీఆర్సీ లెక్క త‌ప్పుతుంద‌ని హెచ్చ‌రించ‌క త‌ప్ప‌దు.