ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే యుద్ధాన్ని తలపిస్తుంటాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటూ నిత్యం వేడిని రగుల్చుతుంటారు. రాజకీయ వేడికి తాళలేక కాసింత చల్లదనం ఉంటే బాగుంటుందని మెజార్టీ ప్రజానీకం అభిప్రాయం. అప్పుడప్పుడు కేఏ పాల్, బండ్ల గణేష్, ఇటీవల కాలంలో సోము వీర్రాజు తమ వంతు కామెడీ పాత్రను పోషిస్తుంటారు.
ఇక చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ అన్ని సమయాల్లోనే కామెడీ పండించగల రాజకీయ నటుడిగా పేరుగాంచారు. అందుకే రాజకీయాల్లో ఆయన క్యారెక్టర్‌కు నిడివి తక్కువ, ప్రాధాన్యం ఎక్కువ. ట్విటర్‌పై తప్ప, ప్రత్యక్షంగా ఆయన అరుదుగా కనిపించక పోవడానికి కారణం ఏంటో జగద్వితమే.
తెలుగు భాషపై లోకేశ్ అపార పాండిత్యమే, ఆయన్ను మీడియాకు దూరం చేసింది. లోకంలో కుల పిచ్చి, మతపిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే…అది ఒక్క తెలుగుదేశం పార్టీనే అని …ఆ పార్టీ భవిష్యత్ రథసారథే చెప్పారంటే, ఆయన గొప్పదనం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో లోకేశ్‌పై మరో అదిరిపోయే పంచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీన్ని ఆయుధంగా తీసుకుని వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే టీడీపీ వ్యూహం అనుకున్న స్థాయిలో సత్ఫలితాలను ఇవ్వలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల అంశాన్ని తెరపైకి తెచ్చింది.
కృష్ణా జిల్లాకు టీడీపీ వ్యవస్థాపక అధినేత, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ పేరు పెట్టింది. దీంతో నెటిజన్లు తమ సృజనాత్మకతకు పదును పెట్టారు. అదుర్స్ అనిపించే పంచ్ పేల్చారు. అదేంటో చూద్దాం.
“కృష్ణా జిల్లాకు మామయ్య ఎన్టీఆర్ పేరు సరే! గోవాకు మా అబ్బాయి లోకేశ్ పేరు పెట్టరే. బాధగా ఉండదాండీ? కడుపు మండదాండీ?” అంటూ చంద్రబాబు మాటల్లోనే నెటిజన్లు సెటైర్ విసిరారు.
గతంలో లోకేశ్ కొంత మంది అమ్మాయిలతో చెట్టపట్టాల్ వేసుకుని తిరిగినట్టు ప్రధాన ప్రత్యర్థి వైసీపీ కొన్ని ఫొటోలను విస్తృతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల తనను టార్గెట్ చేసిన టీడీపీపై మరోసారి లోకేశ్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ మంత్రి కొడాలి నాని ఎదురు దాడి చేసిన సంగతి తెలిసిందే. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు …వేడెక్కిన రాజకీయ తెరపై కామెడీ పండించే క్రమంలో సృజనాత్మక సెటైర్ విసిరారు.