ఓ పెద్ద సినిమా విడుదల తేదీని ప్రకటించినప్పుడు చిన్న సినిమాలన్నీ ఆటోమేటిగ్గా తప్పుకుంటాయి. భీమ్లానాయక్ విషయంలో అదే జరిగింది. ఫిబ్రవరి 25న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఆ మధ్య ప్రకటించారు. దీంతో ఆ తేదీ వైపు మరో హీరో చూడలేదు. ఉన్నట్టుండి సడెన్ గా శర్వానంద్, ఆ తేదీని ప్రకటించాడు. తను నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను ఫిబ్రవరి 25న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ఎనౌన్స్ చేశాడు.
పవన్ కల్యాణ్ సినిమా బరిలో ఉండగా, తన సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసేంత సాహసం చేయడు శర్వా. అంటే దీనిర్థం, ఇంతకుముందు చెప్పిన తేదీకి భీమ్లానాయక్ రాదనే. ఆ పక్కా సమాచారం ఉంది కాబట్టే తన సినిమా విడుదల తేదీని శర్వానంద్ బహిరంగంగా ప్రకటించగలిగాడు. దీంతో ఇప్పుడు మరోసారి అందరి చూపు భీమ్లానాయక్ పై పడింది.
ఈ సినిమా ఇలా వాయిదా పడడం ఇది రెండో సారి. ముందుగా సంక్రాంతి బరిలో భీమ్లానాయక్ ను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఆర్ఆర్ఆర్ రావడంతో, తప్పనిసరి పరిస్థితుల మధ్య సినిమాను ఫిబ్రవరికి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ నెల నుంచి కూడా భీమ్లానాయక్ తప్పుకున్నట్టు వార్తలొస్తున్నాయి.
నిజానికి ఫిబ్రవరి 25 నాటికి పరిస్థితులన్నీ చక్కబడేలా ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడు, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఆల్రెడీ థియేటర్లు నడుస్తున్నాయి. అప్పటికి పరిస్థితి మరింత మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఎందుకో భీమ్లానాయక్ ను మరోసారి పోస్ట్ పోన్ చేసినట్టున్నారు. ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశం, ఈ నిర్ణయం వెనక కనిపిస్తోంది.
ప్రస్తుతానికైతే భీమ్లా యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.
పవన్ కల్యాణ్, రానా నటించిన ఈ మల్టీస్టారర్ మూవీకి త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందించాడు. సాగర్ చంద్ర దర్శకత్వం వహించాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.