ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ నోటీసులు అందుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు సీబీఐ ఎదుట విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. సీబీఐ సమన్లపై కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేస్తూ.. అరెస్టు చేయాలని బీజేపీ వాళ్లు ఆదేశిస్తే సీబీఐ వాళ్లు చేయక ఏం చేస్తారు? అంటూ ప్రశ్నించారు.
లిక్కర్ కేసులో కోర్టుకు సీబీఐ, ఈడీలు అబద్ధాలు చెబుతున్నారని.. ఇప్పటికే ఆరెస్టయిన వారిని వేధిస్తున్నారని.. అరుణ్ పిళ్లై, మహేంద్రను భయపెట్టి వాంగ్మూలం తీసుకున్నారని.. ఈ కేసులో మనీష్ సిసోడియాను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తను కూడా మోడీకి రూ. వెయ్యి కోట్లు ఇచ్చాని చెప్తా.. ఆయనను కూడా అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. అవినీతికి వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడినప్పుడే సీబీఐ సమన్లు పంపుతుందనే విషయం తెలుసునన్నారు.
ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టై జైల్లో ఉన్నారు.. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సీబీఐ విచారణ ఎదుట విచారణ నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓవైపు కేజ్రీవాల్‌పై కుట్ర జరుగుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తుంటే.. మరోవైపు ఢిల్లీ సీఎంకు వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలున్నట్టు సీబీఐ చెబుతోంది.
కాగా ఇదే కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. సీబీఐ సమన్లు అందుకున్న కేజ్రీవాల్ కూడా ఈ కేసులో నేరుగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి రావడంతో ఏం జరగనుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.