నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్‌రెడ్డి నక్క తోక తొక్కారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఏవి? ఎక్కడ? అని ప్రశ్నిస్తే… వేళ్ల మీద లెక్క పెట్టగలిగే పరిస్థితి. అలాంటి వాటిలో ఆళ్లగడ్డ ఉన్నట్టు అక్కడి వైసీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత అన్ని చోట్లా ఉన్నట్టే, ఆళ్లగడ్డలో కూడా ఉంది. అయితే ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేకు కలిసొచ్చే అంశం ఏంటంటే… భూమా కుటుంబంలో విభేదాలు.
మాజీ మంత్రి అఖిలప్రియ వ్యవహారశైలే ఆమెకు ప్రధాన శత్రువైంది. అఖిలప్రియ పోకడలు నచ్చక భూమా అనుచరులంతా దూరమయ్యారు. అంతేకాదు, కుటుబంలో ఆమొ ఒంటరి అయ్యారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏంటంటే…అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి మాత్రమే కలిసి ఉన్నారు. చెల్లి మౌనిక చాలా కాలంగా అక్కతో విభేదించి దూరంగా వుంటున్నారు. ఇటీవల మంచు మనోజ్‌ను పెళ్లి చేసుకుని, హైదరాబాద్‌లో ఆమె భవిష్యత్‌పై కార్యాచరణ రూపొందించు కుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో బీజేపీ ఇన్చార్జ్, మాజీ మంత్రి సోదరుడు భూమా కిశోర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా భూమా అనుచరులు పెద్ద ఎత్తున వచ్చారు. కిశోర్‌రెడ్డి మాట్లాడుతూ అఖిలప్రియపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే నంద్యాల మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి బావ రఘునాథరెడ్డి సమావేశంలో మాట్లాడుతూ వారసత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకత్వ లక్షణాలున్న కిశోర్ ముమ్మాటికీ భూమా కుటుంబ వారసుడని తేల్చి చెప్పారు. అఖిలప్రియ, ఆమె తమ్ముడు జగత్‌విఖ్యాత్ చేష్టల్ని భరించలేకే ఇవాళ కార్యకర్తలతో ఓపెన్‌గా మాట్లాడాల్సి వచ్చిందని ఆయన తేల్చి చెప్పారు.
మరోవైపు అఖిలప్రియతో బ్రహ్మానందరెడ్డికి అసలు పొసగడం లేదు. రానున్న ఎన్నికల్లో ఆళ్లగడ్డ టీడీపీ టికెట్‌పై భిన్నాభిప్రాయాలున్నాయి. అఖిలప్రియకు టికెట్ ఇవ్వడం అంటే టీడీపీ ఓటమి ఖాయమని సొంత పార్టీ వాళ్లు చెబుతున్న పరిస్థితి. తాజాగా భూమా కుటుంబంలో మరొకసారి విభేదాలు రచ్చ కెక్కడంతో వైసీపీ సంబరాలు చేసుకుంటోంది. రానున్న ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి బరిలో వుంటానని భూమా కిశోర్‌రెడ్డి తేల్చి చెప్పారు. గత కొంత కాలంగా ఆయన నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు.
భూమా అనుచరులు, అలాగే కుటుంబ సభ్యుల్ని తన వైపు తిప్పుకోగలిగారు. స్వతంత్ర అభ్యర్థిగా నిలిచినా కనీసం 30 వేల ఓట్లకు తక్కువ కాకుండా సాధించేంతగా ఆయన బలం పెంచుకున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో భూమా కిశోర్ కోసం టీడీపీ ప్రయత్నిస్తోందనే ప్రచారం జరుగుతోంది. భూమా కుటుంబంలో విభేదాలు ఎలా వున్నా, ఇవన్నీ రాజకీయంగా వారికి నష్టం కలిగించేవే. అందుకే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్‌రెడ్డి మరోసారి తాను ఎమ్మెల్యే కావడం ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే చర్చ నడుస్తోంది.