స్టీల్ ప్లాంట్ కోసం…సీబీఐ మాజీ జేడీ సంచ‌ల‌న పిలుపు!

విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకునేందుకు సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ‌ల‌న పిలుపునిచ్చారు. ప్రైవేటీక‌ర‌ణ‌కు నిర‌స‌న‌గా విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ కార్మికుల‌తో క‌లిసి ఆయ‌న సింహాచ‌లం వ‌ర‌కు పాద‌యాత్ర చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న…

విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకునేందుకు సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ‌ల‌న పిలుపునిచ్చారు. ప్రైవేటీక‌ర‌ణ‌కు నిర‌స‌న‌గా విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ కార్మికుల‌తో క‌లిసి ఆయ‌న సింహాచ‌లం వ‌ర‌కు పాద‌యాత్ర చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. అలాగే ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కాపాడుకునేందుకు ల‌క్ష్మీనారాయ‌ణ స‌రికొత్త నినాదాన్ని తెర‌పైకి తేవ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

జనం తరపున బిడ్‌లో పాల్గొనాలని నిర్ణ‌యించుకున్న‌ట్టు ల‌క్ష్మీనారాయ‌ణ తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు EOIలో పాల్గొన‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. మన స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయ‌న‌ పిలుపు ఇచ్చారు. ఒక్కొక్కరు 400 రూపాయలు స్టీల్ ప్లాంట్ కోసం వెచ్చిస్తే… మన స్టీల్ ప్లాంట్‌ను మనమే కాపాడుకుంటామని చెప్పుకొచ్చారు. ఇది చరిత్రలో నిలిచిపోతుంద‌న్నారు. ఫగ్గన్ సింగ్ ఉక్కు సహాయ మంత్రి కాదని.. ఆసహాయ మంత్రి అని ఆయ‌న ఎద్దేవా చేశారు.

ఇదిలా వుండ‌గా బిడ్డింగ్‌లో త‌మ ప్రతిపాదన‌ను రిజెక్ట్ చేస్తే కోర్టుకు వెళ్తామని లక్ష్మీనారాయణ హెచ్చ‌రించారు. స్టీల్‌ ప్లాంట్‌ పబ్లిక్‌ సెక్టార్‌లో ఉండాలన్న‌దే తమ లక్ష్యమని ఆయ‌న‌ ప్రకటించారు. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌క‌ట‌న‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది. ఆయ‌న ఏ విధంగా బిడ్డింగ్ వేస్తార‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. 

కొన్ని రోజులుగా ఆయ‌న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా గ‌ట్టిగా మాట్లాడుతున్నారు. మ‌రోవైపు ఆయ‌న‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌ద్ద‌తు వుంటుందా? అనే చ‌ర్చ న‌డుస్తోంది. అందుకే విశాఖ ఉక్కును కాపాడుకుంటామ‌నే భ‌రోసా ఆయ‌న వ్య‌క్తం చేస్తున్నార‌నే చ‌ర్చ న‌డుస్తోంది.

ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కాపాడుకునేందుకు ఇవాళ చేప‌ట్టిన పాద‌యాత్ర దిగ్విజ‌యంగా సాగింది. ఉక్కు సంక‌ల్ప యాత్ర పేరుతో కార్మికులు, ప్ర‌జాస్వామిక‌వాదులు, వామ‌ప‌క్ష కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. రెండున్నరేళ్లుగా చేస్తున్న ఈ పోరాటాన్ని అవసరమైతే మరో రెండున్నర సంవత్సరాలు కొనసాగించేందుకు తామంతా సిద్ధమని కార్మికులు ప్రకటించారు.