వివేకా కేసులో…సీబీఐ వాద‌నలో డొల్ల‌!

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో సీబీఐ వాద‌న మ‌రీ డొల్ల‌గా వుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా ఉద‌య్‌కుమార్‌రెడ్డిని అరెస్ట్ చేయ‌డానికి సీబీఐ చెబుతున్న కార‌ణాల్లో బ‌లం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. హ‌త్య జ‌రిగిన…

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో సీబీఐ వాద‌న మ‌రీ డొల్ల‌గా వుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా ఉద‌య్‌కుమార్‌రెడ్డిని అరెస్ట్ చేయ‌డానికి సీబీఐ చెబుతున్న కార‌ణాల్లో బ‌లం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. హ‌త్య జ‌రిగిన నాలుగేళ్ల‌కు ఉద‌య్‌ని అరెస్ట్ చేయ‌డ‌మే పెద్ద వింత‌. మ‌రీ ముఖ్యంగా త‌మ విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం, అలాగే పారిపోతాడ‌నే అనుమానంతోనే అరెస్ట్ చేశామ‌ని ఉద‌య్‌కుమార్ రిమాండ్ రిపోర్ట్‌లో సీబీఐ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం అంటే త‌మకు అనుకూలంగా చెప్పాల‌ని సీబీఐ భావిస్తోందా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి… సీబీఐ చెప్పిన‌ట్టు న‌డుచుకుంటున్నాడ‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి న్యాయ స్థానంలో పిటిష‌న్లు కూడా వేశారు. సీబీఐ వాద‌న న్యాయ స్థానంలో ఎంత వ‌ర‌కు నిలుస్తుందో తెలియ‌దు కానీ, వాద‌న మాత్రం బ‌ల‌హీనంగా వుంద‌నే వాళ్ల సంఖ్య ఎక్కువ‌.

నేరాన్ని ఉద‌య్‌కుమార్‌రెడ్డి అంగీక‌రించ‌క‌పోవ‌డంతో తాను ఊహించి, క‌ల్పించిన‌ట్టుగా రిమాండ్ రిపోర్ట్‌ను సీబీఐ త‌యారు చేసింద‌ని వైఎస్ అవినాష్‌రెడ్డి అనుచ‌రులు ఆరోపిస్తున్నారు. వైఎస్ అవినాష్‌రెడ్డికి ఉద‌య్ కుమార్ అత్యంత స‌న్నిహితుడ‌ని చెప్ప‌డం ద్వారా, చివ‌రికి హ‌త్య‌తో క‌డ‌ప ఎంపీకి ముడిపెట్టాల‌నే కోణంలో సీబీఐ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని వారు విమ‌ర్శిస్తున్నారు. వైఎస్ అవినాష్, ఆయ‌న తండ్రి భాస్క‌ర్‌రెడ్డి టార్గెట్‌గా సీబీఐ ద‌ర్యాప్తు చేస్తుంద‌నేందుకు తాజా ఉద‌య్‌కుమార్ అరెస్ట్‌కు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ నిద‌ర్శ‌న‌మ‌ని ఎంపీ అనుచ‌రులు మండిప‌డుతున్నారు.

వివేకా హ‌త్య కేసుకు సంబంధించి సంఘ‌ట‌నా స్థ‌లంలో ఆధారాలు తారుమారు చేయ‌డంలో ఉదయ్ , శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పాత్ర వుంద‌ని చెప్ప‌డం విడ్డూరంగా వుంద‌ని క‌డ‌ప ఎంపీ అనుచ‌రులు విమ‌ర్శిస్తున్నారు. 

నాలుగేళ్లుగా పులివెందుల‌లోనే వుంటున్న ఉద‌య్ పారిపోతాడ‌ని సీబీఐ చెప్ప‌డం …కుట్ర ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరుస్తోంద‌ని వైఎస్ అవినాష్‌రెడ్డి త‌ర‌పు వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వాస్త‌వ విరుద్ధంగా, త‌మ విచార‌ణ‌కు అనుకూలంగా సీబీఐ త‌ప్పుడు రిపోర్ట్‌లు త‌యారు చేస్తోంద‌నేది వారి వాద‌న‌.