పొత్తుః జ‌న‌సేన గ‌ట్టి డిమాండే!

జ‌న‌సేన‌తో పొత్తు విష‌య‌మై టీడీపీలో భిన్న‌వాద‌న‌లున్నాయి. వ‌ద్ద‌నే వాళ్ల నేత‌ల సంఖ్య బాగానే వుంది. అయితే టీడీపీకి చావుబ‌తుకుల స‌మ‌స్య అయిన ఈ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేయ‌డం లాంటి ప్ర‌యోగం మంచిది కాద‌నే…

జ‌న‌సేన‌తో పొత్తు విష‌య‌మై టీడీపీలో భిన్న‌వాద‌న‌లున్నాయి. వ‌ద్ద‌నే వాళ్ల నేత‌ల సంఖ్య బాగానే వుంది. అయితే టీడీపీకి చావుబ‌తుకుల స‌మ‌స్య అయిన ఈ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేయ‌డం లాంటి ప్ర‌యోగం మంచిది కాద‌నే నేత‌లూ ఉన్నారు. దీంతో చంద్ర‌బాబు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. మ‌రోవైపు ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ముంచుకొస్తుండ‌డంతో టీడీపీ మ‌న‌సులో ఏముందో తెలుసుకోవాల‌ని జ‌న‌సేన ఆత్రుత ప‌డుతోంది.

ఈ నేప‌థ్యంలో రానున్న ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్ల‌ను చీల‌నివ్వ‌నన్న ప‌వ‌న్ వ్యూహం ఏంటో తెలుసుకోవాల‌ని కొంద‌రు టీడీపీ నేత‌లు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఇందులో మ‌రో మ‌ర్మం కూడా లేక‌పోలేదు. ఒక‌వేళ పొత్తు కుదుర్చుకోవాలంటే జ‌న‌సేన డిమాండ్స్ ఏంటో తెలుసుకోవాల‌నే ఆస‌క్తి కూడా టీడీపీకి లేక‌పోలేదు. గౌర‌వ‌ప్ర‌ద‌మైన సీట్లు ఇస్తేనే టీడీపీతో పొత్తు అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల ఆవిర్భావ స‌భ‌లో తేల్చి చెప్పారు. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ఆత్మాభిమానాన్ని ఏ మాత్రం తాక‌ట్టు పెట్ట‌న‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

కేవ‌లం 20-25 సీట్లు మాత్ర‌మే జ‌న‌సేన‌కు ఇవ్వ‌నున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని న‌మ్మొద్ద‌ని ప‌వ‌న్ వేడుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా జ‌న‌సేన నేత‌లు నాదెండ్ల మ‌నోహ‌ర్‌, నాగ‌బాబు త‌దిత‌రుల‌తో టీడీపీ ముఖ్య నేత‌లు హైద‌రాబాద్‌లో స‌మావేశం అయ్యిన‌ట్టు తెలిసింది. ఈ భేటీలో జ‌న‌సేన త‌న డిమాండ్స్‌ను నిర్మొహ‌మాటంగా టీడీపీ ముందు పెట్టినట్టు స‌మాచారం.

జ‌న‌సేనాని ప‌వ‌న్‌కు రెండేళ్ల సీఎం ప‌ద‌వి, అలాగే 50 అసెంబ్లీ సీట్ల‌కు ఏ మాత్రం త‌గ్గేదే లే అని తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం. ఎంపీ సీట్ల విష‌యానికి వ‌స్తే …పెద్ద‌గా ప‌ట్టింపులేద‌ని జ‌న‌సేన నేత‌లు త‌మ ప్ర‌తిపాద‌న‌ను టీడీపీ నేత‌ల ఎదుట కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీంతో టీడీపీ నేత‌ల నోట మాట రాలేద‌ని తెలిసింది. రెండేళ్ల పాటు సీఎం ప‌ద‌వి కోరుకోవ‌డం, 50 అసెంబ్లీ సీట్లు ఇక త‌మ పార్టీ ప‌రిస్థితి ఏంట‌ని టీడీపీ నేత‌లు అనుకున్నార‌ట‌. ఏదో 20 లేదా కాదు కూడ‌దంటే మ‌రో ఐదు సీట్లు పెంచుదామ‌నే ఆలోచ‌న‌లో ఉన్న టీడీపీ, జ‌న‌సేన ప్ర‌తిపాద‌న‌కు అవాక్కైంద‌న్న మాట వాస్త‌వం.

ఇలాగైతే పొత్తు అట‌కెక్క‌డం త‌ప్ప‌, మ‌రో మార్గం లేద‌ని టీడీపీ నేత‌లు ప్రాథ‌మికంగా ఓ అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. కానీ జ‌న‌సేన మాత్రం త‌న గౌర‌వాన్ని త‌గ్గించుకోడానికి స‌సేమిరా అంటోంది. అధికారంలోకి రావ‌డానికి త‌మ‌తో టీడీపీకే ఎక్కువ రాజ‌కీయ అవ‌స‌రం వుంద‌ని, అలాంట‌ప్పుడు ప్ర‌తిసారి జ‌న‌సేన ఎందుకు త‌గ్గాల‌ని ఆ పార్టీ నేత‌ల ప్ర‌శ్న‌. దీన్ని కొట్టి పారేయ‌లేం. 

నిజానికి 15 శాతం ఓటు బ్యాంక్ క‌లిగిన సామాజిక వ‌ర్గం త‌మ వెనుక ఉంద‌ని న‌మ్ముతున్న జ‌న‌సేన‌… ఇంత‌కు త‌గ్గితే మాత్రం వారిని అవ‌మానించిన‌ట్టే అని కాపు నేత‌లు అంటున్నారు. చివ‌రికి ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి.