నో డౌట్.. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పక్కా

జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. గతంలో కూడా ఇలాగే అన్నీ అయిపోయాయి అనుకున్న తర్వాత…

జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. గతంలో కూడా ఇలాగే అన్నీ అయిపోయాయి అనుకున్న తర్వాత మళ్లీ అది అటకెక్కేసింది. 

ఈసారి కూడా అదే జరుగుతుందా.. జన గణన అనేది పూర్తి కాకుండా జిల్లాల్ని విభజించొచ్చా అనే చర్చ జరుగుతోంది. అయితే కేంద్రం ఇచ్చిన ఊరట ప్రకారం ఏపీలో జిల్లాల విభజన ఉగాది నాటికి పక్కా అని తేలిపోయింది.

జూన్ వరకు గడువు..

దేశవ్యాప్తంగా జన గణన జరగాల్సి ఉండగా.. కొవిడ్ పరిస్థితుల వల్ల అది ఆలస్యం అవుతోంది. జన గణన జరిగే వరకు జిల్లాలు, రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులు మార్చకూడదు అనేది నిబంధన. అయితే జనగణన ఎలాగూ లేట్ అవుతుంది కాబట్టి.. జిల్లాల సరిహద్దులు మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. జూన్ వరకు గడువు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.

కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న జన గణన విభాగం డైరెక్టర్ రజత్ కుమార్ ఈమేరకు రాష్ట్రాలకు లేఖలు రాశారు. గతేడాది డిసెంబర్ 31 వరకు ఆంక్షలు ఉన్నాయని, అయితే కొవిడ్ వల్ల జనగణన ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడంలేదని, అందుకే జూన్ వరకు రాష్ట్రాల సరిహద్దులు మార్చేందుకు అవకాశం ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. జూన్ లోగా రాష్ట్రాలు పరిపాలనా విభాగాలను, ప్రాంతాలను భౌగోళికంగా విభజిస్తే వాటి వివరాలు తమకు తెలియజేయాలన్నారు. ఆ వివరాలతో జూన్ తర్వాత జనగణను మొదలుపెడతామని చెప్పారు.

ఉగాదికి శుభవార్త..

జూన్ వరకు సమయం ఉండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. 26 జిల్లాలకోసం నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం అభ్యంతరాలు స్వీకరించి ఉగాది నాటికి 26 జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ఖాయంగా మారుతుంది. అయితే జిల్లాల పేరు, జిల్లాల కేంద్రాల విషయంలో రచ్చ జరుగుతోంది కాబట్టి, దానిపై ప్రభుత్వం కూడా దృష్టిపెట్టింది. 

అభ్యంతరాలు, వారు సూచించిన సవరణలు సమంజసంగా ఉంటే సానుకూల నిర్ణయం ఉంటుంది. మొత్తమ్మీద సవరణలు ఉన్నా లేకపోయినా ఉగాదికి మాత్రం కొత్త జిల్లాల ఏర్పాటు పక్కా.