భర్త నపుంసకుడని, సంసారిక జీవితానికి పనికి రాడని భార్య లిఖిత పూర్వక ఫిర్యాదుపై కోర్టు ఘాటుగా స్పందించింది. ఇలాంటి తప్పుడు ఆరోపణ చేయడం క్రూరత్వమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇలాంటి ఆరోపణలు అతని ఆత్మ విశ్వాసంతో పాటు మానసిక ఆరోగ్యంపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపుతాయనే వాదనతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. అంతేకాదు, ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది.
2012లో ఢిల్లీకి చెందిన జంట పెళ్లి చేసుకుంది. అతనికి రెండో పెళ్లి కాగా ఆమెకు మొదటి పెళ్లి. అయితే తన భార్య పెళ్లి కాక ముందే నుంచే మానసిక సమస్యతో బాధపడుతోందని, ఆ విషయాన్ని దాచారని ఆవేదన వ్యక్తం చేస్తూ విడాకులు కోరుతూ అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇదే సందర్భంలో తన భర్త సంసారానికి పనికి రాడని ఫిర్యాదు చేసింది. ఇదంతా కింది కోర్టులో జరిగిన తతంగం.
భార్య ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న కోర్టు …భర్తకు వైద్యుడితో పరీక్షలు చేయించింది. అనంతరం వైద్యుడి నివేదికను ముందుంచుకుని తిరిగి విచారణ చేపట్టింది. అయితే భార్య ఫిర్యాదు చేసినట్టు అతను సంసారానికి పనికి రాడనే ఆరోపణలో వాస్తవం లేదని వైద్య నివేదిక తేల్చినట్టు న్యాయస్థానం పేర్కొంది.
భర్త కోరుకున్నట్టు హిందూ వివాహ చట్టం కింద విడాకులు మంజూరు చేస్తూ కింది కోర్టు తీర్పు చెప్పింది. అయితే భర్తతో కలిసి ఉంటానని, విడాకుల తీర్పును రద్దు చేసి, తిరిగి వైవాహిక హక్కులను పునరుద్ధరించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంజీవ్ నరూలాల ధర్మాసనం విచారించింది.
అన్ని వివరాలను పరిశీలించి, అధ్యయనం చేసిన ధర్మాసనం దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో ఎలాంటి లోపం లేదని పేర్కొంటూ ఆ మహిళ అప్పీల్‌ను కొట్టివేసింది.
భర్త పురుషత్వానికి సంబంధించి తీవ్ర ఆరోపణలు చేసి అతనికి తీవ్ర దుఃఖాన్ని కలిగించిన మహిళతో కలిసి ఉండటం ప్రమాదకరమని భర్త భావించడం సరైందేనని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. వైవాహిక బంధం పునరుద్ధరించడానికి సాధ్యం కానంతగా దెబ్బతిందని వ్యాఖ్యానించి విడాకులు మంజూరును సమ్మతించింది.
సహజంగా భర్త నుంచి విడాకులు కోరుకునే మహిళలు … సదరు ఢిల్లీ మహిళ చేసిన ఆరోపణలే ఎక్కువగా పునరావృతం అవుతుండటం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. విడాకుల మంజూరులో న్యాయస్థానం అవలంబించిన విధానంపై నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.