మానవళికి అంతులేని మిస్టరీగా మారిన కరోనా వైరస్ అంతుబట్టని రీతిలో కొనసాగుతూ ఉంది. ప్రపంచంలో తొలి కరోనా వైరస్ గుర్తించి ఏడాది గడిచిపోయింది. గత ఏడాది ఈ సమయంలో చైనాలో కరోనా విజృంభణ మొదలైంది.
నవంబర్, డిసెంబర్ నెలల్లో కరోనా గురించి చైనా కొంత అర్థం చేసుకోగలిగింది. ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి అంటుకుంటుందనే విషయాన్ని గుర్తించి.. చైనాలో స్ట్రిక్ట్ రూల్స్ మొదలుపెట్టారు. కరోనా వ్యాపించిన వుహాన్ ప్రావీన్స్ లాక్ డౌన్లు పెట్టారు. ఆ ప్రావీన్స్ తో మిగతా చైనాకు సంబంధాలు తెంచేశారు. అయితే వుహాన్ నుంచి విదేశాలకు కొనసాగిన బంధంతో.. కరోనా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది.
నవంబర్ నెలలో చైనాలో తొలి కేసులు నమోదు కాగా.. డిసెంబర్ లో చైనా ఆ వైరస్ తో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. 2020 జనవరి నుంచి మిగతా దేశాలకూ కరోనా వ్యాపించింది. ఫిబ్రవరి వరకూ ఇండియాలో ఆ కేసులు నమోదు కాలేదు.. మార్చిలో ఇండియాలోనూ భయాందోళనలు మొదలయ్యాయి. లాక్ డౌన్ పెట్టారు. ఫలితం అంతంత మాత్రమే. లాక్ డౌన్ బంధనాలు ఎత్తేయగానే.. కరోనా కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఆ తర్వాతి సంగతి అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం అయితే ఇండియాలో కరోనా కేసుల సంఖ్య అవరోహన క్రమంలో కొనసాగుతూ ఉంది. ఒక దశలో రోజుకు లక్ష కేసుల స్థాయికి వెళ్లిన దేశంలో ప్రస్తుతం రోజు వారీగా ముప్పై వేల వరకూ కేసులు నమోదవుతున్నాయి. 95 శాతం వరకూ రికవరీ రేటు నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షల స్థాయిలో ఉన్నాయి. ఇంతటితో కరోనా అవరోహన క్రమంలోనే కొనసాగి.. అంతమైతే అంత కన్నా కావాల్సింది ఏమీ లేదు.
అయితే దేశంలోనే పలు చోట్ల మళ్లీ కరోనా నంబర్లలో పెరుగుదల చోటు చేసుకుంటోంది. ఢిల్లీనే ఈ విషయంలో భయపెడుతూ ఉంది. అక్కడ కరోనా ఒకదశలో రోజువారీ కేసుల విషయంలో బాగా తగ్గుదల స్థాయిలో కనిపించి, మళ్లీ పెరుగుదల చోటు చేసుకుంది.
ప్రస్తుతం ఢిల్లీలో కరోనా మూడో వేవ్ కొనసాగుతోందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మూడో వేవ్ కూడా తగ్గుముఖం పడుతోందని అక్కడి మంత్రి ఒకరు ప్రకటించారు. మరోవైపు యూరోపియన్ దేశాల్లో కరోనా తీవ్ర స్థాయికి చేరుతూ ఉండటంతో స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నారు. లాక్ డౌన్లు పెడుతున్నారు. యూరోపియన్ దేశాలు మళ్లీ రోనాకు భయపడిపోతూ ఉన్నాయి. ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి.
ఏపీలోనే ఒక సమయంలో కొన్ని జిల్లాల్లో రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదు అయ్యాయి. అలాంటి జిల్లాల్లో ప్రస్తుతం రోజువారీగా 50 లోపు కేసుల నమోదవుతున్నాయి. ఇక ప్రజల సంగతికి వస్తే.. కరోనాకు భయపడటం మానేశారు. అమ అవసరాల కోసం, పనుల నిమిత్తం ప్రజలు బయటకు వస్తున్నారు.
ఇళ్లలోనే ఉంటే జరగడం కష్టం కావడంతో ప్రజలు తెగిస్తున్నారు. జనజీవనం చాలా చోట్ల సాధారణ స్థితికి వచ్చినా కరోనా నంబర్లు మాత్రం క్రమం తప్పకుండా తగ్గుతున్నాయి. ఇది ఊరటను ఇచ్చే అంశమే. అయితే ఢిల్లీ నంబర్లు మాత్రం భయపెడుతూ ఉన్నాయి. యూరోపియన్ దేశాలు విధిస్తున్న లాక్ డౌన్లు ఇండియాకు ఒక రకంగా హెచ్చరిక లాంటివే.
కరోనాను పూర్తిగా లైట్ తీసుకోవడానికి వీల్లేదని అంతర్జాతీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రజలు మాత్రం దేన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఏపీ వంటి రాష్ట్రాల్లో టెస్టుల సంఖ్య మెరుగ్గా ఉన్నా కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతోంది.
ఏతావాతా కరోనా మానవళిలో గుర్తించి ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో.. ప్రస్తుతం కొన్ని ఊరటను ఇచ్చే పరిణామాలు చోటు చేసుకోగా, ఆందోళనకరమైన అంశాలూ అంతుబట్టనివిగానే ఉన్నాయి. కరోనా మిస్టరీ ఇంకా కొనసాగుతూ ఉంది!
హిమ