డబ్బే జీవితం అనుకున్న వాళ్లకు, అందుకోసం ఏమైనా చేయడానికి వెనుకాడరని చెబుతారు. చివరికి భార్యతో ఏకాంతంగా గడపడాన్ని కూడా చిత్రీకరించి, ఆ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఓ శాడిస్ట్ భర్తపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ దుర్మార్గానికి గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారానికి చెందిన ఓ శాడిస్ట్ భర్త పాల్పడ్డాడు.
పోలీసుల కథనం మేరకు ….ఏటీ అగ్రహారానికి చెందిన ఓ మహిళ తన భర్త వికృత చేష్టలకు నిర్ఘాంతపోయిన వైనం ఇది. ఎలాంటి పని చేయకుండా, సులభంగా డబ్బు సంపాదించాలనే దుర్భుద్ధితో యూట్యూబ్‌లో నీలి వీడియోలను అప్‌లోడ్ చేయడం బాధితురాలి భర్త పనిగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో చివరికి భార్యతో ఏకాంతంగా గడపడాన్ని కూడా చిత్రీకరించాడు. ఆ వీడియోలను భార్యకు తెలియకుండా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు.
ఈ విషయాన్ని పసిగట్టిన బాధితురాలు న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దిశా పోలీస్ స్టేషన్‌కు రెఫర్ చేశారు. దిశా సిబ్బంది యుద్ధప్రాతిపదికన కేసు నమోదు దర్యాప్తు మొదలు పెట్టారు. వెంటనే ఐటీ కోర్ బృందం ఆ వీడియోలు అప్‌లోడ్‌లను తొలగించారు.
ఇంకా ఏయో సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలను అప్‌లోడ్ చేశాడనే విషయమై ఐటీ కోర్ బృందం ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఈ ఫిర్యాదును అర్బన్ పోలీసు ఉన్నతాధికారి పరిశీలిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆ ప్రబుద్ధుడికి తగిన బుద్ధి చెప్పే అవకాశాలున్నాయి.