తీరిపోతున్న పాన్ ఇండియా భ్రమలు!

ఏదైనా సినిమా పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయితే అది ఎందుకు హిట్ అయిందో చూడాలి. ఎలా హిట్ అయిందో చూడాలి. అంతే తప్ప హిట్ చేసుకోవాలని కిందా మీదా అయిపోవడం కాదు.…

ఏదైనా సినిమా పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయితే అది ఎందుకు హిట్ అయిందో చూడాలి. ఎలా హిట్ అయిందో చూడాలి. అంతే తప్ప హిట్ చేసుకోవాలని కిందా మీదా అయిపోవడం కాదు. సినిమాకు పాన్ ఇండియా లక్షణాలు వున్నాయని హీరోలు డిసైడ్ అయిపోతే సరిపోదు..చూడాల్సిన జనాలు ఫీల్ కావాలి. కానీ టాలీవుడ్ లో ఇలా లేదు వ్యవహారం. సినిమా అనౌన్స్ మెంట్ నాడే పాన్ ఇండియా రిలీజ్ పోస్టర్ వేసేస్తున్నారు. అయిదు భాషల్లో టైటిల్ డిజైన్ చేయించేస్తే చాలు ఇక పాన్ ఇండియా సినిమా అయిపోయినట్లే అని కలగనేస్తున్నారు.

పాన్ ఇండియా సినిమాకు అతి పెద్ద సమస్య..విడుదలనే. ఇక్కడ మనం బయ్యర్లకు సినిమా చూపించకుండా, కాంబినేషన్లు చూపించి అమ్మేసినట్లు అమ్మేద్దాం అంటే అక్కడ కుదరదు. ఈ కాంబినేషన్లు అన్నీ అక్కడ చెల్లవు. ఎంత పెద్ద సినిమా అయినా కమిషన్ పద్దతి మీద పంపిణీకే ఇవ్వాల్సిందే. ఓ మాదిరి విడుదలకైనా కనీసం మూడు కోట్లు ఖర్చు చేయాల్సిందే. పబ్లిసిటీకి భారీగా డబ్బులు జల్లాల్సిందే. మొత్తం మీద ఓ రేంజ్ లో హడావుడి చేసి, విడుదల చేయాలంటే అయిదు నుంచి ఏడు కోట్ల కావాలి. కానీ ఆ మేరకు వెనక్కు రావాలి అంటే పదిహేను నుంచి ఇరవై కోట్ల మేరకు వసూళ్లు రావాల్సి వుంటుంది.

ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవెల్ లో మాంచి వసూళ్లు సాగించిన మన సినిమాలు అన్నీ కలిపి గట్టిగా అరడజను వుండవు. వీటిలో రాజమౌళి సినిమాలే మూడు. పుష్ప, కార్తికేయ2 సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో చేయాలని చేసినవి కావు. కంటెంట్ జనాలకు రీచ్ అయింది. నెత్తిన పెట్టుకున్నారు. సాహు సినిమా బాహుబలి సక్సెస్ నేపథ్యంలో జరిగిన విడుదల.

డియర్ కామ్రేడ్, లైగర్ సినిమాల కోసం హీరో విజయ్ దేవరకొండ పడిన ప్రచార కష్టం ఇంతా అంతా కాదు. కానీ కంటెంట్ జనాలకు చేరువ కాలేదు. భీమ్లానాయక్ హిందీ వెర్షన్ అన్నారు. పాటలు రెడీ చేయించాం అన్నారు. కనీసం ఆ జాడ ఎక్కడా లేదు. రానా వున్నాడు కదా హడావుడి చేద్దాం అనుకున్నారు

మొన్నటికి మొన్న దసరా సినిమా సంగతీ అంతే నిర్మాతకు అయిదు కోట్లకు పైగా చేతి డబ్బులు ఆవిరి అయిపోయాయి. హీరో నాని పాన్ ఇండియా సంబరానికి నిర్మాత బలైపోయారు. లేదూ అంటే నిర్మాతకు హ్యాపీగా అయిదు కోట్లు చేతిలో వుండి వుండేవి.

సందీప్ కిషన్ మైఖేల్ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసారు ఏమయింది? సమంత కు ఫ్యామిలీమన్, పుష్ప ఇమేజ్ వుండడంతో శాకుంతలం పాన్ ఇండియా అనుకున్నారు. సమంత తెలుగులో కన్నా బాలీవుడ్ లో, ఇతర భాషల్లో ప్రమోషన్ ఎక్కువ చేసారు. ఏం జరిగింది?

అఖిల్ ఏజెంట్ సినిమా కూడా పాన్ ఇండియానే. ఇప్పటి వరకు ఒక్క సింగిల్ కంటెంట్ అదర్ లాంగ్వేజెస్ లో విడుదల చేయలేదు. ఇక్కడ పబ్లిసిటీ వీక్ అంటే అక్కడ అస్సలు లేనే లేదు. ఇప్పుడు ఇంకా చాలా పాన్ ఇండియా సినిమాలు లైన్ లో వున్నాయి. కానీ ఇక్కడే పబ్లిసిటీ లేక కిందా మీదా అవుతున్నాయి.

హీరోలు పాన్ ఇండియా సినిమా కావాలని అడిగితే నిర్మాతలు మొహమాటం లేకుండా పాన్ ఇండియా పబ్లిసిటీ ఖర్చు వరకు అయినా హీరోల జేబుల్లోంచి పెట్టుకోమని అడగాలి. అప్పుడు విడుదల ఖర్చులు నిర్మాత భరించవచ్చు. లేదూ మొత్తం నిర్మాతే అంటే గుల్ల అయిపోవడం మినహా మరేం వుండదు.

ఈ పాన్ ఇండియా భ్రమలు ఒక్కో హీరోకీ తీరుతూ వస్తున్నాయి. అలా అలా అందరికీ తీరిపోతే ఇక ఈ అయిదు భాషల్లో లోగోలు తయారుచేయించే పనికి ఫుల్ స్టాప్ పడుతుంది.