వేడి త‌గ్గింది.. లేట‌య్యింది.. టీడీపీ నిద్ర‌లేచింది!

తెలుగుదేశం అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు అరెస్టుపై ఆ పార్టీ నిర‌స‌న‌ల‌కు దిగింది. ఏదో ఒక సౌండ్ చేసి చంద్ర‌బాబు అరెస్టుపై నిర‌స‌న‌లు తెలిపే ప్రోగ్రామ్ ఒక‌టి వీకెండ్ లో పెట్టుకుంది!…

తెలుగుదేశం అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు అరెస్టుపై ఆ పార్టీ నిర‌స‌న‌ల‌కు దిగింది. ఏదో ఒక సౌండ్ చేసి చంద్ర‌బాబు అరెస్టుపై నిర‌స‌న‌లు తెలిపే ప్రోగ్రామ్ ఒక‌టి వీకెండ్ లో పెట్టుకుంది! ఈ ప్రోగ్రామ్ ను కూడా వీకెండ్ లో పెట్టుకుందంటే.. తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి ఏమిటో స్ప‌ష్టం అవుతోంది. అయినా.. చంద్ర‌బాబు అరెస్టు  జ‌రిగి ఇప్ప‌టికే ఇర‌వై రోజులు గ‌డిచాయి. ఇలాంటి స‌మ‌యంలో ఇలా ఒక రోజు నిర‌స‌న ఏమిటో తెలుగుదేశం పార్టీకే తెలియాలి!

మ‌రి ఆ ప్రోగ్రామ్ కూడా అట్ట‌ర్ ఫ్లాప్ అయినట్టుగా ఉంది. చంద్ర‌బాబు అరెస్టు జ‌రిగిన మ‌రుస‌టి రోజే ఇలాంటి నిర‌స‌న ఒక‌టి ప్లాన్ చేసి ఉంటే.. అది ఎంతో కొంత ఇంపాక్ట్ అనిపించుకునేది. అయితే ఇర‌వై రోజులు గ‌డిచాకా.. ఒక సాయంత్రం పూట ఇలాంటి నిర‌స‌నని ప్లాన్ చేయ‌డం వెనుక తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మ‌క త‌ప్పిదం క‌నిపిస్తోంది.

చంద్ర‌బాబు అరెస్టుపై ప్రపంచ వ్యాప్తంగా నిర‌స‌న‌లు అంటూ ఒక వైపు ప‌చ్చ మీడియాలో ఒక డ్రామాను అయితే ఇన్నాళ్లూ చూపారు. అయితే అదేమాత్రం ర‌క్తి క‌ట్ట‌లేదు. అది కేవ‌లం ఒక కులం వారు చేసే డ్రామా, ఒక కుల మీడియా చూపే డ్రామాగా మిగిలిపోయింది. మ‌రి ఆ కులం అయినా.. చంద్ర‌బాబు కోసం గ‌ట్టిగా నిర‌స‌న తెలుపుతున్న దాఖ‌లాలు లేవు.

ఇంకోవైపు చంద్ర‌బాబు అరెస్టుకు నిర‌స‌న‌గా రిలే నిరాహార దీక్ష‌లు అంటూ కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో.. ఒక‌ ప‌దీ ఇర‌వై కుర్చీల్లో ప‌గ‌లు కొంత‌మంది కూర్చుని నామ‌మాత్రంగా ఒక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఉద‌యం ప‌ద‌కొండు గంట‌ల‌కు కూడా అలాంటి శిబిరాలు ఖాళీగానే ఉంటాయి. 

ఇక బాగోద‌న్న‌ట్టుగా.. ఆ స‌మ‌యానికి ఫుల్ గా భోంచేసి కొంత‌మంది వ‌చ్చి కూర్చోవ‌డం, మ‌ధ్య‌మ‌ధ్య‌ల్లో అటూ ఇటూ తిరిగి.. మ‌ళ్లీ వ‌చ్చి కూర్చుని.. పొద్దు పోగొట్టుకుని.. ఐదు గంట‌ల‌కు శిబిరాల‌ను ఖాళీ చేసి ఎవ‌రి దారిన వారు వెళ్లిపోవ‌డం అనే కామెడీ కూడా జ‌రుగుతోంది! ఇంతోటి దానికి నిరాహార దీక్ష అనే పేరును కూడా అడ్డంగా వాడేసుకుంటూ ఉన్నారు!

అలాంటి కామెడీలతోనే చంద్ర‌బాబు అరెస్టును జ‌నాలు మ‌రింత లైట్ తీసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. అవే అనుకుంటే.. ఇన్నాళ్ల త‌ర్వాత‌.. నిర‌స‌న‌ల‌కు దిగి మ‌రో కామెడీ చేస్తున్నారు. మొద‌టి రోజు చేయాల్సిన ప‌ని మూడు వారాల త‌ర్వాత పెట్టుకున్నారు. చంద్ర‌బాబు జైల్లో ఉంటే టీడీపీ ప‌రిస్థితి ఏమిటో తేట‌తెల్లం చేస్తోంది ఈ సంఘ‌ట‌న‌!