తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో.. పార్టీ సారథి కిషన్ రెడ్డి అభీష్టానికి వ్యతిరేకంగా ఏమైనా కొన్ని నిర్ణయాలు జరుగుతున్నాయా? ఆయనకు ఇష్టం లేకపోయినా వాటిని అమలు చేయాల్సి వస్తోందా? తెలంగాణ పార్టీ శాఖను తన సొంతమైన సామంత రాజ్యంలాగా నిర్వహించడానికి ఆయనకు వీలుపడడం లేదా? అనే రకరకాల అభిప్రాయాలు జనంలో కలుగుతున్నాయి.
ఒకప్పుడు- పార్టీలో జాయినింగ్ అనేది చివరి నిమిషం దాకా వచ్చి.. కిషన్ రెడ్డికి ఇష్టం లేదనే కారణంగా ఆగిపోయిన కృష్ణయాదవ్ చేరిక ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది.
కిషన్ రెడ్డికి సొంతమైన, ఆయన పలుమార్లు గెలిచిన అనుభవం ఉన్న అంబర్ పేట నియోజకవర్గాన్ని ఆశిస్తున్న మాజీమంత్రి కృష్ణయాదవ్ భారాసను వీడి బిజెపిలో చేరడానికి గతంలో నిర్ణయించుకున్నారు. భాజపాకూడా అందుకు ఓకే చెప్పేసింది.
కిషన్ రెడ్డి కొత్త సారథి అయిన తర్వాత.. కిషన్ రెడ్డి ఫోటోలతో కూడా కలిపి భాగ్యనగరమంతా ఫ్లెక్సిలు వేయించి.. తాను కమలదళంలో చేరే కార్యక్రమాన్ని ధూమ్ ధామ్ గా నిర్వహించడానికి కృష్ణయాదవ్ రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ కార్యాలయం వరకు తన బలగంతో ఊరేగింపు కూడా తీశారు. కానీ అప్పట్లో ఆయన చేరిక వాయిదా పడింది. ఆయన తన సందోహంతో పార్టీ కార్యాలయానికి రావడానికి కొద్ది సేపటి ముందే.. కిషన్ రెడ్డి వెళ్లిపోయారు. ఆ రకంగా కృష్ణయాదవ్ చేరిక కార్యరూపం దాల్చలేదు.
గత 2018 ఎన్నికల్లో తాను అక్కడినుంచి గెలవలేక పోయినప్పటికీ.. అంబర్ పేట నియోజకవర్గాన్ని కృష్ణయాదవ్ కు ఇవ్వడం కిషన్ రెడ్డికి ఇష్టం లేదని అందుకే మొహం చాటేశారని అప్పట్టో వినిపించింది. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చేస్తే తాను ముఖ్యమంత్రి అయిపోగలననే కల కిషన్ రెడ్డికి ఉండవచ్చుననే వాదన కూడా వినిపించింది.
కానీ.. ఆ కలలన్నీ సాధ్యమయ్యేవి కాదనీ తేలిపోయింది. కనీసం తమ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు దక్కుతాయనే నమ్మకం కూడా లేని కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు కూడా చేైసుకోలేదు. అయితే భార్యను అంబర్ పేట నుంచి రంగంలోకి దించుతారనే ప్రచారం జరిగింది. ఆ సంగతి ఎలా ఉన్నా తాజాగా కృష్ణయాదవ్ పార్టీలో చేరడం మాత్రం జరిగింది.
మాజీ మంత్రులు కృష్ణయాదవ్, చిత్తరంజన్ దాస్ ఇద్దరూ బిజెపిలో చేరారు. వీరి చేరిక సరే.. పాపం కృష్ణ యాదవ్ తరహాలోనే పార్టీలో చేరికకు సర్వం సిద్ధం చేసుకుని, చివరి క్షణంలో ఆ పర్వం వాయిదా పడడంతో భంగపడ్డ.. చీకోటి ప్రవీణ్ సంగతేంటో తెలియదు. అత్యం వివాదాస్పదమైన జూదాల నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ ను పార్టీలో చేర్చుకోవడానికి, అసలు ఆ ఘట్టం ఏర్పడడానికి బిజెపి ఎంతగా దిగజారిందో, ఎంతకు అమ్ముడుపోయిందో కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.