తప్పు చేస్తున్న వైఎస్ షర్మిల !

కొందరు అంతే.. ఇతరులు వేరే ఎవ్వరూ కూడా తమకు హాని పెట్టగల స్థాయికి అందనంత ఎత్తులో ఉంటారు. కానీ, తమకు తామే చేటు చేసుకుంటూ ఉంటారు. తమకు తామే నష్టం చేసుకుంటూ ఉంటారు. దివంగత…

కొందరు అంతే.. ఇతరులు వేరే ఎవ్వరూ కూడా తమకు హాని పెట్టగల స్థాయికి అందనంత ఎత్తులో ఉంటారు. కానీ, తమకు తామే చేటు చేసుకుంటూ ఉంటారు. తమకు తామే నష్టం చేసుకుంటూ ఉంటారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ‌, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల పరిస్థితి ప్రస్తుతం అలాగే కనిపిస్తోంది. 

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ వారసత్వపు రాజకీయ ముద్ర చూపించాలనే ఆశతో కష్టనష్టాల కోర్చి సొంతంగా ఒక పార్టీ స్థాపించి ప్రస్థానం సాగిస్తున్న షర్మిల, ఆ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలని అనుకున్న ఆలోచన ఆమెకు లాభం చేస్తుందా? చేటు చేస్తుందా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

వైఎస్ షర్మిల.. తానొక్కతే కేసీఆర్ ను మట్టికరిపించే, వైఎస్సార్ తెలంగాణ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి, నిరుద్యోగులకు మేలు చేసేస్తానని చాలా పెద్దస్థాయిలో ప్రగల్భాలు పలికారు. తీరా ఆమె ప్రకటనలు గాలిమాటలుగా తేలిపోయాయి. కాంగ్రెసు పార్టీలో విలీనం కావడానికి వారు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారా? అని ఆమె ఇప్పుడు నిరీక్షిస్తున్నారు. ఒక రకంగా చూసినప్పుడు ఇది కాంగ్రెస్ మైండ్ గేమ్ అనిపిస్తుంది.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ను రెండు మూడు పర్యాయాలు కలవడం ద్వారా.. షర్మిల విలీనం కాబోతున్నదనే వార్తలు పుట్టాయి. నిజానికి డికెతో భేటీ అనేది వార్తల రూపంలో బయటకు పొక్కకుండా దాచి ఉంచడం షర్మిలకు పెద్ద విషయం కాదు. కానీ ఆమె ఆ జాగ్రత్త తీసుకోలేదు. ఢిల్లీ వెళ్లి సోనియా రాహుల్ లతో భేటీకి వెంపర్లాడడం.. వారి ఇంటి ఆవరణలో తచ్చట్లాడడం అన్నీ మీడియాలో వచ్చాయి. వారిద్దరినీ కలిసిన తర్వాత కూడా ఇప్పటిదాకా ముహూర్తం తేలకపోవడం ఏమిటి?

పై చర్యల ద్వారా ‘షర్మిల సొంత పార్టీని నడపలేకపోతున్నది, అందుకే విలీనానికి వెంపర్లాడుతున్నది..’ అనే స్పష్టమైన సంకేతాలను  కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది. ఇప్పుడిక ముహూర్తం తేల్చకుండా నాన్చుతున్నది! అయితే ఈ గ్యాప్ లో తన పార్టీ కార్యకలాపాలు వదిలేయడం ద్వారా.. షర్మిల తప్పు చేసిందనే అనుకోవాలి. 

ఎందుకంటే.. ఇలాంటి పని వల్ల ‘మీలో విలీనం తప్ప నాకు గత్యంతరం లేదు’ అనే సంకేతాలు వెళతాయి. అప్పడిక కాంగ్రెస్ తమ అసలు డ్రామాను ప్రారంభిస్తుంది. విలీన సమయంలో ఆ పార్టీ ఎదుట డిమాండ్లు పెట్టగల సామర్థ్యం పలచబడిపోతుంది. విలీనం జరగకపోతే.. ఒంటరిగా పోటీచేస్తాం అని షర్మిల ప్రకటించి ఉండొచ్చు గానీ.. ఇంకొన్నాళ్లు వేచిచూడాలని చెప్పిన కాంగ్రెస్ సలహాదారు మాటలకు లొంగడం ఆమెకు ప్రమాదమే. 

ఇంకా వేచిచూస్తే.. ఆ తర్వాత వేరే గత్యంతరం కూడా లేక వారు ఇచ్చింది పుచ్చుకోవాల్సిందే తప్ప, ఆమె డిమాండ్ చేయడానికి ఏమీ ఉండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.