ఎమ్బీయస్‌: బ్రిటిష్‌ రాచకుటుంబం మళ్లీ మీడియా పాలు

 బ్రిటన్‌లో ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉన్నా రాచకుటుంబానికి మర్యాద యిస్తూనే ఉంటారు. ఆ సౌధంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని ప్రజలు ఆసక్తితో గమనిస్తూ ఉంటారు. అందువలన బ్రిటిషు మీడియా ఆ కుటుంబసభ్యులపై ఎప్పుడూ…

 బ్రిటన్‌లో ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉన్నా రాచకుటుంబానికి మర్యాద యిస్తూనే ఉంటారు. ఆ సౌధంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని ప్రజలు ఆసక్తితో గమనిస్తూ ఉంటారు. అందువలన బ్రిటిషు మీడియా ఆ కుటుంబసభ్యులపై ఎప్పుడూ నిఘా వేసి ఉంచుతుంది. ఎవరైనా సంప్రదాయాన్ని అధిగమిస్తే, గగ్గోలు పెట్టేస్తూ, రసవత్తరమైన కథనాలను వండి వారుస్తూ ఉంటుంది. గతంలో ప్రిన్సెస్‌ డయానా యీ మీడియా పాలన పడి, నానా అవస్థలూ పడి చివరకు దుర్మరణం పాలైంది.

ఇప్పుడు ఆమె చిన్న కోడలు మేగన్‌ని తగులుకుంది మీడియా. పెళ్లయిన తర్వాత డయానా భిన్నంగా ప్రవర్తిస్తే, యీమె ఎప్పణ్నుంచో భిన్నమైన వ్యక్తిత్వం, నేపథ్యం కలది. లోకం పోకడ తెలియని యువరాజుని బుట్టలో పెట్టి, అర్హత లేకపోయినా భార్య స్థానం పొంది, తన యిష్టం వచ్చినట్లు ఆడించేసి, యిప్పుడు యింట్లోంచి బయటకు తీసుకెళ్లిపోయి రాచకుటుంబం పరువు తీస్తోందని, తన భర్తకు రాచరికపు హోదా కూడా లేకుండా చేసిందని బ్రిటిషు మీడియా ఆమెను దుమ్మెత్తి పోస్తోంది. 

జానపద కథల్లో చూస్తాం – ఓ యువరాణి చిన్నప్పటి నుంచి ఒంటరితనంతో బాధపడుతూ ఉంటుంది. తల్లి చిన్నపుడే పోయింది. సవతి తల్లి ఆలనా, పాలనా చూడదు, తండ్రి పట్టించుకోదు. దాంతో లోకం పోకడ తెలియక, ఆ భవనంలోనే కునారిల్లుతూ ఉంటుంది. తిక్కతిక్కగా ప్రవర్తించి తిట్లు తింటూ ఉంటుంది. అంతలో ఆమెకు అనుకోకుండా ఓ సామాన్య యువకుడు పరిచయమవుతాడు. అతను స్ట్రీట్‌ స్మార్ట్‌. యువరాణిని బయటకు తిప్పి వర్ణమయమైన లోకాన్ని చూపిస్తాడు, అన్ని తరహాల ప్రజల్ని పరిచయం చేస్తాడు. ఆమెలో ధైర్యం నింపుతాడు. ప్రవర్తనను సరిదిద్దుతాడు. 

రాజమహళ్లలో ఉండి మగ్గడం కంటె బయటి లోకంలో  స్వేచ్ఛాజీవుల్లా బతకడంలో ఎక్కువ హాయి ఉందని అనిపిస్తాడు. ఓ శుభముహూర్తాన ఆమె తండ్రిని ధిక్కరించి, యితని చేయి పట్టుకుని మహలు నుంచి బయటకు నడిచింది. ఇదే కథను హీరోయిన్‌ ఓరియెంటెడ్‌గా కూడా చూపవచ్చు. అలా చూపితే మేగన్‌- హ్యేరీ కథ అవుతుంది. కథలో యువరాజు సవతితల్లి  కోడలిపై కక్ష కట్టి 'మావాడికి మందు పెట్టేసిందంటూ విరుచుకు పడింది' అని కల్పిస్తే ఆ సవతితల్లి పాత్రను పోషిస్తున్నది మీడియా!

ముందుగా మన యువరాజు గురించి చెప్పుకుందాం. డయానా రెండవ కొడుకు ప్రిన్స్‌ హ్యేరీ. 35 ఏళ్లవాడు. అతను పుట్టిన కొన్నేళ్లకే తలిదండ్రుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. 12 ఏళ్లు వచ్చేసరికి విడిపోయారు. మరుసటి ఏడాది (1997) తల్లి ప్రమాదంలో చచ్చిపోయింది కూడా. భర్తతో ఉండగానే తల్లి ఎవరెవరితోనో తిరిగిందనే కథనాలు వచ్చాయి. విడిపోయాక అరబిక్‌ ప్రియుడితో కలిసి తిరిగిందనేది బహిరంగ రహస్యం. ఆమె పిల్లల్ని తనతో తీసుకెళ్ల లేదు. ఆమె మరణం తర్వాత తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. ఆమె వివాహిత. పిల్లల తల్లి. లోకం దృష్టి వీళ్ల మీద ఉంది. వీళ్లు ఎలా రియాక్టవుతున్నారు, ఎలా పెరుగుతున్నారు అని నిరంతరం భూతద్దంలో చూస్తున్నారు. 

ఇలాటి అసాధారణ వాతావరణంలో పెరిగినవాడి మానసిక స్థితి ఊహించుకోవలసినదే. స్కూలులో బిలో యేవరేజిగా ఉన్నాడు. చదువయ్యాక 21 ఏళ్ల వయసులో రాయల్‌ మిలటరీ ఎకాడెమీలో చేరాడు. వాళ్ల బాబాయి ప్రిన్స్‌ ఏండ్రూ తర్వాత మిలటరీలోకి వెళ్లినవాడు యితనే. ఇరాక్‌, ఆఫ్గనిస్తాన్‌లలో సైన్యంలో పనిచేశాడు. రాచకుటుంబ సభ్యులు ఆనవాయితీగా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. ఇతనూ ఆ పని చేస్తూంటాడు. 

ఇక వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే, ఇతను ఎవరి మాటా వినని రకమనీ, ''వైల్డ్‌ చైల్డ్‌'' అని బ్రిటిషు మీడియా 17 ఏళ్ల వయసులోనే ముద్ర వేసింది. గంజాయి తాగడం, నైట్‌క్లబ్బుల బయట కొట్లాడడం,ఓ పార్టీలో నాజీ డ్రస్సు వేసుకోడం, పాకిస్తానీ ఆఫీసర్‌ను పాకీ అనడం – యిలాటివన్నీ టాబ్లాయిడ్‌లలో వచ్చేశాయి. 2012లో లాస్‌ వెగాస్‌లో స్ట్రిప్‌ బిలియర్డ్‌స్‌ ఆడుతూ ఎవరో అమ్మాయితో కలిసి నగ్నంగా కనబడిన ఫోటో కూడా వచ్చేసింది. తన 21వ యేట ఓ గర్ల్‌ఫ్రెండ్‌తో తిరిగి ఐదేళ్ల తర్వాత విడిపోయాడు. 2012లో క్రెసిడా అనే మోడల్‌, నటీమణితో స్నేహం ప్రారంభించి, రెండేళ్ల తర్వాత విడిపోయాడు. ఇలాటి పరిస్థితుల్లో అతనికి ఒక బ్లయిండ్‌ డేట్‌లో రేచెల్‌ మేగన్‌ మార్కెల్‌ పరిచయమైంది.

మేగన్‌ అతని కంటె మూడేళ్లు పెద్దది. తల్లి ఆఫ్రో-అమెరికన్‌ సంతతికి చెందిన నల్లజాతీయురాలు. సోషల్‌ వర్కర్‌. యోగా టీచర్‌. తండ్రి థామస్‌ యూరోప్‌ నుంచి వలసవచ్చిన కుటుంబానికి చెందినవాడు. టీవీ రంగంలో ఫోటోగ్రాఫర్‌. మేగన్‌కు ఆరు సంవత్సరాల వయసులో తలిదండ్రులు విడిపోయారు. కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పొందింది. తండ్రి ద్వారా టీవీ రంగానికి పరిచయమై కొన్ని సీరియళ్లలో వేసింది. ''నేను పూర్తిగా బ్లాక్‌ కాదు, పూర్తిగా వైట్‌ కాదు. అందుకని నాకెలాటి పాత్ర యివ్వాలో నిర్మాతలకు తోచేది కాదు. అందుకే రావలసినన్ని అవకాశాలు వచ్చేవి కావు.'' అని చెప్పుకుందామె. 

2010లో సినిమాల్లోకి ప్రవేశించింది. ''గెట్‌ హిమ్‌ టు ద గ్రీక్‌'', ''రిమెంబర్‌ మీ'', ''హారిబుల్‌ బాసెస్‌'' సినిమాల్లో వేసింది. 2011లో ''సూట్స్‌'' (కేసులు) అనే టీవీ సీరియల్‌లో నటించడం ఆరంభించి ఆరేళ్ల పాటు వేసింది. దానిలో పైకి వద్దామని తంటాలు పడే రేచెల్‌ అనే ఓ సామాన్యయువతి పాత్ర వేసింది. అది ఆమెకు చాలా పేరు తెచ్చింది. 2014లో ఆమె ''ద టిగ్‌'' అనే లైఫ్‌స్టయిల్‌ వెబ్‌సైట్‌ ప్రారంభించింది. దానిలో ఫుడ్‌, ఫ్యాషన్‌, బ్యూటీ, ట్రావెల్‌ అంశాలతో బాటు విజేతలైన మహిళల గురించి రాసేది. వెబ్‌సైట్‌కు ఆదరణ పెరగడంతో ఆ యా రంగాలలో వున్న నిపుణులను తీసుకుని వచ్చి వెబ్‌సైట్‌కు మరింత పేరు తెచ్చింది. 

డబ్బు బాగా సంపాదించడంతో బాటు ఆమెకు చక్కటి ఫ్యాషన్‌ సెన్స్‌ ఉందనే పేరు తెచ్చుకుంది. తన రేచెల్‌ పాత్ర ఆధారంగా 2015లో, 2016లో ఓ కెనడియన్‌ క్లాతింగ్‌ కంపెనీతో కలిసి రెండు ఫ్యాషన్‌ కలక్షన్లు రిలీజ్‌ చేసింది. 2017 ఏప్రిల్‌లో ఆ వెబ్‌సైట్‌ను మూసేసింది. ఆమె ఫెమినిస్టు. అనేక సామాజిక సమస్యలపై నిర్భయంగా మాట్లాడుతుంది. 2016 ఎన్నికలలో ఆమె హిల్లరీ క్లింటన్‌ను సమర్థిస్తూ ప్రకటనలు చేసింది. అదే ఏడాది బ్రెగ్జిట్‌ నిర్ణయం వెలువడ్డాక తన అసంతృప్తిని వెల్లడించింది. 

టీవీ నటుడు, నిర్మాత ట్రెవర్‌ ఎంజెల్సన్‌తో 2004లో ప్రేమ మొదలై 2011లో పెళ్లి చేసుకుంది. 2013 కల్లా విడాకులు తీసుకుంది. తర్వాత సెలబ్రిటీ షెఫ్‌, రెస్టారెంట్ల ఓనరు కోరీ విటియెలోతో ప్రేమ వ్యవహారం సాగి, రెండేళ్ల తర్వాత 2016లో ముగిసిపోయింది. 2016 జూన్‌లో యిద్దరికీ తెలిసున్న వ్యక్తి ద్వారా ప్రిన్స్‌ హ్యేరీని కలిసింది. 2017 సెప్టెంబరులో యిద్దరూ కలిసి పబ్లిక్‌లో కనబడ్డారు. ఇక బ్రిటిష్‌ మీడియా అందుకుంది – ఆమె సగం బ్లాక్‌ కావడం, వివాహిత కావడం, నటి కావడం.. వాళ్లకు కావలసినంత మేత దొరికింది. చిత్తమొచ్చినట్లు కథనాలు రాయసాగారు. 

దాంతో ఆమె గురించి యిలాటివి రాయకూడదని బ్రిటిష్‌ రాయల్‌ ఫ్యామిలీ నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడింది.  మేగన్‌ తను యికపై నటించనని ప్రకటించింది. తన సోషల్‌ మీడియా ఖాతాలు మూసేసింది. బ్రిటన్‌ పౌరసత్వం తీసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంటర్‌బరీ ఆర్చిబిషప్‌ జోర్డాన్‌ నదీ జలాలు తీర్థంగా యిచ్చి, ఆమెను చర్చి ఆఫ్‌ ఇంగ్లండ్‌లోకి చేర్చుకున్నాడు. నవంబరులో మేగన్‌, హ్యేరీ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. 2018 మేలో పెళ్లయింది. పెళ్లికి ముందు బ్రిటిషు రాణి హ్యేరీని ప్రిన్స్‌ ఆఫ్‌ సెసెక్స్‌ చేసింది. దాంతో మేగన్‌ డచెస్‌ ఆఫ్‌ ససెక్స్‌ అయిపోయింది. 

పెళ్లి నిశ్చయమైన తర్వాతి నుంచి బ్రిటిషు పౌరులకు ఆమెపై ఆసక్తి మరీ పెరిగిపోయింది. తనకు ఫ్యాషన్‌ డిజైనర్‌గా పేరుంది కాబట్టి తను ఏ వస్తువు కొంటే దానికి అమ్మకాలు పెరగసాగాయి. 2017 డిసెంబరులో ఆమె స్ట్రాత్‌బెరీ హేండ్‌ బ్యాగ్‌లో పబ్లిక్‌లో కనబడితే అందరూ ఆ బ్యాగ్‌ కొనసాగారు. 2019లో బ్రిటిష్‌ బ్రాండ్‌ రీయిస్‌ మినీ డ్రెస్‌లో కనబడితే అదీ విపరీతంగా అమ్ముడుపోయింది. అలాగే అనేక బ్రాండ్‌లు! బ్రిటన్‌లోనే కాదు, అమెరికాలో కూడా! 2018లో ఓ ఫ్యాషన్‌ వెబ్‌సైట్‌ 'బ్రిటన్స్‌ బెస్ట్‌ డ్రెస్‌డ్‌ పీపుల్‌'లో ఒకరిగా గుర్తించింది. 

అదే ఏడాది ''టైమ్‌'' మ్యాగజైన్‌ ''100 మోస్ట్‌ ఇన్‌ఫ్లుయెన్షియల్‌ పీపుల్‌ ఇన్‌ ద వ(ర)ల్డ్‌''లో ఒకరిగా ఆమె పేరు ప్రకటించింది. బ్రిటిష్‌ మ్యాగజైన్‌ ''ఓగ్‌'' కూడా అలాటి గౌరవమే యిచ్చింది. పెళ్లయ్యాక యీ జంట యిల్లు మారారు. విండ్సర్‌ కాసిల్‌ హోమ్‌ పార్క్‌లోని కాటేజీకి మారి 2.4 మిలియన్‌ పౌండ్ల ప్రజాధనం ఖర్చు పెట్టి మార్పులు చేయించారు. 2019 మేలో వాళ్లకు ఆర్చీ అనే కొడుకు పుట్టాడు. అదే ఏడాది ''కోర్టు'' అనే పేర ఆ దంపతులిద్దరూ ఓ ప్రత్యేకమైన ఆఫీసు పెట్టుకుంటే దాని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా పది లక్షల మంది ఫాలోయర్స్‌ను అతి త్వరగా సంపాదించుకోవడంలో రికార్డులు బద్దలుకొట్టింది. 

వీళ్ల కిలా పలుకుబడి పెరుగుతున్న కొద్దీ మీడియా మరింత కక్ష కట్టేసి, వారి ప్రయివేటు వ్యవహారాలు కూడా రాసేయసాగింది. వాళ్ల కొడుకుకి సంబంధించిన ఫోటోలతో సహా అనేక వ్యక్తిగతమైన ఫోటోలు సంపాదించి ప్రచురించ సాగింది. వాళ్ల్లు కాటేజీ మార్పులపై పెట్టిన ఖర్చును తప్పుపట్టింది. వాళ్లు వాడుతున్న ప్రయివేటు జెట్స్‌ కారణంగా కాలుష్యం పెరిగిపోతోందంది. దాంతో హ్యారీ, మేగన్‌ పత్రికలపై కేసులు పెట్టసాగారు. కొన్ని రాజీపడి నష్టపరిహారం చెల్లించగా కొన్ని కోర్టుల్లో కేసులు నడుపుతున్నాయి. 

వీళ్లకు మేగన్‌ తండ్రి అంది వచ్చాడు. అతను కూతురు గురించి యిప్పటిదాకా పట్టించుకోలేదు కానీ, హ్యేరీతో పెళ్లి కుదిరి, అమెరికన్‌ మీడియా తన వెంట పడడంతో చెలరేగిపోయాడు. సడన్‌గా వచ్చిన ఫోకస్‌కు తన పబ్లిసిటీకి వాడుకున్నాడు. పెళ్లికి వెళ్లడానికి సూట్లు కుట్టించుకున్న ఫోటోల దగ్గర్నుంచి మీడియాకు యిచ్చాడు. చివరకు గుండె ఆపరేషన్‌ అయిన కారణంగా పెళ్లికి వెళ్లలేదు. కానీ మేగన్‌ గతం గురించి చాలా మాట్లాడడం మొదలెట్టాడు. 

పెళ్లయ్యాక ఆగస్టులో మేగన్‌ తండ్రికి ఈమెయిల్‌ రాసింది. 'నువ్వు మీడియాతో అనవసరమైన విషయాలు మాట్లాడడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. మన మధ్య సంబంధాలు బాగు పడాలంటే నీ పద్థతి మార్చుకో.' అని. అది అతను కొన్నాళ్లపాటు దాచి, యిటీవల మీడియాకు అందించాడు. దాన్ని బ్రిటన్‌లో ''ద మెయిల్‌ ఆన్‌ సండే'' పత్రిక ప్రచురించింది. మేగన్‌ దానిపై కేసు పెడితే 72 మంది బ్రిటిషు మహిళా ఎంపీలు ఆమెను సమర్థిస్తూ బహిరంగ లేఖ రాశారు. కానీ తండ్రి మాత్రం  నేను కోర్టుకి వచ్చి పత్రిక తరఫున సాక్ష్యం చెపుతాను అంటూ ప్రకటించాడు. 

ఈ గొడవలు నడుస్తూండగానే హ్యేరీ, మేగన్‌ ఈ జనవరి మొదటివారంలో రాచసౌధంలోంచి బయటకు వెళ్లిపోతూ, తాము రాజకుటుంబంలోని బాధ్యతల నుంచి వెనక్కి తగ్గుతున్నామనీ. యికపై పార్ట్‌టైమ్‌ రాయల్స్‌ మాత్రమేననీ ప్రకటించారు. బ్రిటిషు రాణికి ముందుగా చెప్పి అనుమతి తీసుకోలేదని, ఆవిడ ఊళ్లో లేని రోజున వెళ్లపోయే ముహూర్తం పెట్టుకున్నారని తెలియడంతో 'ఎంత అమర్యాద, ఎంత అగౌరవం, యిదంతా ఆ రాక్షసి మేగన్‌ నిర్వాకమే, అమాయకుడైన హ్యేరీని ఆడిస్తోంది.' అని బ్రిటిష్‌ మీడియా విరుచుకు పడుతోంది.

హ్యేరీ, మేగన్‌ తాము యికపై తమ సమయాన్ని యుకె, నార్త్‌ అమెరికాల మధ్య పంచుతామని, వ్యాపారాలు చేసి ఆదాయం సంపాదించి దానిలో నుంచి విరాళాలు యిస్తూ వుంటామని, రాణి గారి విధుల్లో సాయపడుతూ ఉంటామని ప్రకటించారు. వాళ్లిద్దరికీ రాయల్‌ హైనెస్‌ వంటి తమ బిరుదులు యిప్పటికీ వున్నా వాటిని ఉపయోగించమని వారు మాట యిచ్చారని బకింగ్‌ హామ్‌ ప్యాలస్‌ నుంచి జనవరి 18న ప్రకటన వెలువడింది. 

మీడియా మేగన్‌పై విరుచుకుపడడం హ్యేరీని మండిస్తోంది. ''గతంలో మీడియా నా తల్లిని యిలాటి వేదనకు గురి చేసి చేసి, చంపేసింది. దానివలననే నాకు మానసిక అనారోగ్యం కలిగింది. ఇప్పుడు నా భార్యపై మళ్లీ అలాటి దాడే జరుగుతోంది. అప్పుడంటే చిన్నపిల్లవాణ్ని. ఇప్పుడు చూస్తూ ఊరుకోను. నా భార్యను రక్షించుకోవడం నా కర్తవ్యం.'' అంటున్నాడు. ఇప్పుడు ఏదో విధంగా వార్తల్లోకి ఎక్కి ప్రాచుర్యంలోకి వచ్చిన ఆ దంపతులు అమెరికా, కెనడాలలో ఏవైనా ప్రోడక్టులకు బ్రాండ్‌ అంబాసిడర్లగా వ్యవహరిస్తూ, వెబ్‌సైట్‌ నడుపుతూ డబ్బు సంపాదించవచ్చు. వాళ్ల నిర్వహణ ఖర్చు వారిదే అవుతుంది కాబట్టి ఆ మేరకు బ్రిటిషు పౌరులకు ఆర్థికభారం తగ్గినట్లే!

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2020)
 [email protected]