దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో? ఆంధ్రజ్యోతి ఆర్కే చెబుతున్న పలుకులు చూస్తుంటే భలే ఫన్నీగా వుంది. చంద్రన్న కానుక అంటూ పప్పు బెల్లాలు జనాలకు పంచేసి, పసుపు కుంకుమ అంటూ ఎన్నికల ముందు వేలకు వేలు పంచేసి, బొక్క బోర్లా పడ్డారు ఆయనకు ఇష్టమైన ఏకైక నాయకుడు చంద్రబాబు. ఇప్పుడు అదే పని వేరే వాళ్లు చేస్తుంటే ఆర్కే ధర్మ పన్నాలు పలుకుతున్నారు.
వాట్సప్ లో ఇటీవల తెగ చలామణీ అయిన శిబిచక్రవర్తి-ధర్మరాజు కథను తన కొత్త పలుకులో ఇరికించేసి, ''…ప్రజలను ఉచితాలకు అలవాటు చేసిన దేశం, రాష్ట్రం ఎప్పటికైనా తలదించుకోవలసిందే! …'' అంటూ నీతి సూత్రాలు వల్లిస్తున్నారు. ఇంత నిస్సిగ్గుగా చెప్పడం ఆర్కేకు మాత్రమే సాధ్యం అవుతుందేమో?
పసుపు కుంకుమ, రైతులకు డబ్బులు పంచినపుడు, అహో, అద్భుతం, అంటూ డప్పేసింది ఎవరో? అది బ్రహ్మాస్త్రం అంటూ హడావుడి చేసిన సంగతిని జనం అంత సులువుగా మరిచిపోయారా? ఆర్థిక సర్వే ప్రీ స్కీములు వద్దంటోంది అని అంటున్నారు ఆర్కే. ఆ సర్వేను చేయించిన కేంద్రంలో అధికారంలో వున్న భాజపా ఢిల్లీ ఎన్నికల్లో అమ్మాయిలకు స్కూటర్లు ఉచితంగా ఇస్తాం అంటోంది. ఆ సంగతి కూడా ఆర్కే కు తెలియదా?
అంతెందుకు, 2024 ఎన్నికల టైమ్ లో ఉచిత వాగ్దానాలు ఏవీ చేయకుండా వుంటాను అని బాబు గారి చేత ఆర్కే అనిపించగలరా? ఆ మేరకు ఇప్పుడు ఓ పలుకు వండి వార్చగలరా?