అధికార దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్ అరెస్టు తప్పదా? ఆయనపై విచారణ, ఆ పై అరెస్టు తప్పదనే ఊహాగానాల మధ్యన.. ఆరెస్టును తప్పించుకునేందుకు కూడా ఆయనే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. తన అరెస్టు జరగకుండా ఆయనే కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెప్పించుకున్నట్టుగా సమాచారం. ఫిబ్రవరి ఆరో తేదీ వరకూ కృష్ణ కిషోర్ అరెస్టును ఆపుతూ.. కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని కృష్ణ కిషోర్ వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తన బంధువులను, ఒక సామాజికవర్గం వారిని ఔట్ సోర్సింగ్, కన్సల్టెంట్స్ గా చేర్చుకుని భారీ వారికి దోచి పెట్టారనే అభియోగాలున్నాయి. ఆయన తీరును గమనించి ఇప్పటికే జగన్ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయనపై విచారణ వార్తలు వస్తున్నాయి. అధికార దుర్వినియోగం అభియోగాలపై అరెస్టు జరగవచ్చని అంటున్నారు.
ఇక ఆయనను తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ గట్టిగా సమర్థిస్తూ ఉంది. చంద్రబాబుకు చాలా సన్నిహితుడు కావడంతో.. ఆయన కోసం తెలుగుదేశం గళం విప్పుతూ ఉంది. కృష్ణ కిషోర్ కు మద్దతుగా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే స్పందించారు. అధికార దుర్వినియోగం ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికారికి చంద్రబాబు నాయుడు బాహాటంగానే మద్దతు పలుకుతున్నారు.