ఎట్టకేలకు చంద్రబాబు గుడివాడ వెళ్లారు. అది ఆయన అత్తింటివారి నియోజకవర్గం. గుడివాడలో ఎలాగైనా కొడాలి నానీని ఓడగొట్టాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికి వరుసగా నాలుగుసార్లు గుడివాడ నుంచి కొడాలి గెలుపొందారు. పార్టీ ఏదైనా కొడాలిదే గుడివాడ గడ్డ అనే బలమైన వాదన వుంది. కొడాలిపై బలమైన అభ్యర్థి చంద్రబాబుకు లేరు. దీంతో ఎన్ఆర్ఐని బరిలో నిలపాలని ఆయన చూస్తున్నారు.
గుడివాడ పర్యటనలో అభ్యర్థిపై చంద్రబాబు బహిరంగంగా ప్రకటించలేకపోయారు. ఒకవేళ ప్రకటిస్తే గుడివాడలో టీడీపీ పరిస్థితి ఎలా వుంటుందో అనే భయం ఆయన్ను వెంటాడుతోంది. సహజంగానే చంద్రబాబుది నాన్చివేత ధోరణి. దీనికి తోడు ఎక్కువ మంది టికెట్ ఆశావహులు ఉంటే, చంద్రబాబు నిర్ణయం ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. గుడివాడలో అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీకి మరింత నష్టం కలిగించేలా తన పర్యటన వుండకూడదని చంద్రబాబు జాగ్రత్త పడ్డారు.
మరీ ముఖ్యంగా గుడివాడలో ఎమ్మెల్యే కొడాలిపై కంటే జగన్‌నే ఎక్కువ టార్గెట్ చేయడం గమనార్హం. అసలే కొడాలి నాని నోరు మంచిది కాదని, ఎక్కువతక్కువలు మాట్లాడితే కథ వేరేలా వుంటుందనే భయం చంద్రబాబును వెంటాడింది. అందుకే కొడాలిపై కనీసం పేరు పెట్టి విమర్శలు చేయలేని దుస్థితి. బూతుల ఎమ్మెల్యే తులసి వనంలో గంజాయి మొక్కలా తయారయ్యారని బాబు విమర్శించారు. రాజకీయ భిక్ష పెట్టామని, ఇప్పుడు చరిత్ర హీనులుగా మారారని కొడాలిపై పరోక్ష విమర్శలు చేశారు. అలాంటి వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ఎన్టీఆర్ గెలిచిన గుడివాడను పేకాట క్లబ్బులుగా మార్చారన్నారు. క్యాసినోలు తెచ్చారన్నారు. క్యాబరేలు చేయించారని విమర్శించారు. నోరు విప్పితే బూతులే అని, అలాంటి వ్యక్తిని ఏం చేయాలో మీరే తేల్చుకోవాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునివ్వడం గమనార్హం. తాను ఒకటి తిడితే, కొడాలి పది తిడ్తాడని బాబుకు బాగా తెలుసు. అందుకే ఎందుకొచ్చిన ఖర్మ అనుకుని ఆచితూచి విమర్శలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే కాస్త మెతక ఎమ్మెల్యేలుంటే…. నీ కథ తేలుస్తా, భరతం పడతా అని చంద్రబాబు హెచ్చరించేవారు. గుడివాడలో అలాంటి హెచ్చరికల జోలికి వెళ్లలేదు. ప్రధానంగా జగన్‌ను టార్గెట్ చేసి, గుడివాడలో మమ అనిపించారు. తిట్టేవాడంటే చంద్రబాబుకు అంత భయం మరి. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడ్డం అంటే ఏంటో గుడివాడలో కొడాలిపై బాబు విమర్శలను వింటే తెలుస్తుంది.