మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్వస్థలమైన చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లెలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి కారణం మూడు రాజధానులకు మద్దతుగా 20 వేల మందితో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో బహిరంగ సభను ఆదివారం నిర్వహిస్తుండటమే.
ఈ సభకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు. రంగంపేట- నారావారిపల్లె మార్గంలో మెయిన్‌రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సభ నిర్వహించనున్నారు. ఈ సభను చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని చంద్రబాబు సొంత గ్రామంలోనే చేపడుతున్నాడు.
ఈ సభకు మంత్రులు కురసాల కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, సీఎం ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, అజయ్ కల్లం తదితర పెద్దలు హాజరు కానున్నారు.
కాగా చంద్రబాబు స్వగ్రామంలో రెచ్చగొట్టేలా వైసీపీ సభ నిర్వహిస్తుండటంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార వైసీపీ వైఖరికి నిరసనగా అదే రోజు తిరుపతిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నిరసన తెలిపేందుకు నిర్ణయించింది. అయితే పోలీసులు అనుమతించలేదు. ఏది ఏమైతేనేం చంద్రబాబు స్వగ్రామంలో మూడు రాజధానులకు మద్దతుగా సభ నిర్వహిస్తుండటం టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది.