లాభాల్లోని ఎల్ఐసీ ప్రైవేటీక‌ర‌ణ‌.. ఇదేం ఆర్థిక‌శాస్త్ర‌మో!

ఇప్ప‌టికే బీఎస్ఎన్ఎల్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం తీరు విమ‌ర్శ‌ల‌కు తావిస్తూ ఉంది.  భారీ ఎత్తున ఆస్తుల‌ను, వ్య‌వ‌స్థ‌ను క‌లిగి ఉన్న బీఎస్ఎన్ఎల్ ను పోటీలో నిల‌ప‌లేక‌.. న‌ష్టాలు అంటూ.. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ…

ఇప్ప‌టికే బీఎస్ఎన్ఎల్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం తీరు విమ‌ర్శ‌ల‌కు తావిస్తూ ఉంది.  భారీ ఎత్తున ఆస్తుల‌ను, వ్య‌వ‌స్థ‌ను క‌లిగి ఉన్న బీఎస్ఎన్ఎల్ ను పోటీలో నిల‌ప‌లేక‌.. న‌ష్టాలు అంటూ.. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఉద్యోగుల‌ను వ‌దిలించుకుంటూ.. వారికి భారీ ప్యాకేజీలు ఇస్తూ వాలంట‌రీ రిటైర్మెంట్ ల‌ను అమ‌లు చేస్తూ ఉన్నారు. ప‌దేళ్ల కింద‌టి వ‌ర‌కూ కూడా బీఎస్ఎన్ఎల్ టెలికాం రంగంలో గ‌ట్టి పోటీదారుగానే ఉండేది. ఆ త‌ర్వాత ప్రైవేట్ ఆప‌రేట‌ర్ల‌ను బీఎస్ఎన్ఎల్ ఎదుర్కోలేక‌పోయింది.

దానికి నిస్సందేహంగా ప్ర‌భుత్వమే బాధ్య‌త వ‌హించాలి. యూపీఏ హ‌యాంలో బీఎస్ఎన్ఎల్ బాగు కోసం ఒక క‌మిటీని వేశారు. అదేదో స‌ల‌హాలు ఇచ్చింది. మోడీ స‌ర్కారు మాత్రం బీఎస్ఎన్ఎల్ ను పూర్తిగా వ‌దిలించుకుని చేతులు దులుపుకుంటూ ఉంది. ఇండియాలో స్మార్ట్ ఫోన్ ల యుగంలో, ప్రైవేట్ ఆప‌రేట‌ర్లు త‌మ స్థాయిని భారీగా పెంచుకున్న త‌రుణంలో.. ప్ర‌భుత్వ ర్ంగ సంస్థ మాత్రం ఫెయిల్యూర్ కావ‌డానికి ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించ‌దా? బ‌రువు దించుకోవ‌డ‌మే ప్ర‌భుత్వాల ప‌నా?

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఇప్పుడు ఎల్ఐసీ ప్రైవేటీ క‌ర‌ణ‌కు కూడా మోడీ ప్ర‌భుత్వం రెడీ అయిపోయింది. అదేమంటే డిజెన్వెస్ట్మెంట్ అంటున్నారు! భారీ లాభాల్లో ఉన్న సంస్థ‌ను ప్రైవేటీక‌రించ‌డం.. ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బో ఈ ఆర్థిక వేత్త‌ల‌కే తెలియాలి. ఇటీవ‌లే ఎల్ఐసీ భారీ లాభాల‌ను ప్ర‌క‌టించింది. 

భారీ లాభాల‌తో కేంద్ర ప్ర‌భుత్వానికి భారీ మొత్తం డివిడెండ్ ను కూడా చెల్లించింది ఎల్ఐసీ. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వానికి 2,611 కోట్ల రూపాయ‌ల డివెడెంట్ ను ఎల్ఐసీ చెల్లించింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కు ఎల్ఐసీ ఈ మేర‌కు చెక్కును అందించింది. గ‌త సంవ‌త్స‌రంలో ఎల్ఐసీ ప‌ది శాతం వృద్ధిని న‌మోదు చేసింది. దీని విలువ 53,214 కోట్ల రూపాయ‌లు. ఇక పాల‌సీల ప‌రంగా కూడా ఎల్ఐసీ మార్కెటింగ్ విలువ పెరిగింది. ఎల్ఐసీ అర‌వై మూడు సంవ‌త్స‌రాలను పూర్తి చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎల్ఐసీ ఆస్తుల విలువ 31.11 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అని తెలుస్తోంది.

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలోనే ఎల్ఐసీ ఏకంగా 5.61 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ఆదాయాన్ని ఆర్జించ‌డం గ‌మ‌నార్హం. ఇలా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్  ఇండియా లాభ‌సాటిగా న‌డుస్తున్న కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌గా త‌న ఉనికి చాటుతూ ఉంది. 

ఎల్ఐసీ విజ‌య ర‌హ‌స్యంలో అది  ప్ర‌భుత్వ రంగ సంస్థ కావ‌డ‌మే కీల‌క‌మైన‌ది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎప్పుడు ఏది చేతులెత్తేస్తుందో అనే భ‌యంతో ప్ర‌జ‌లు వాటిని న‌మ్మ‌డం లేదు. ఎల్ఐసీకి  న‌మ్మ‌కమే పెట్టుబ‌డి అనే స్లోగ‌న్ కూడా ఉన్న‌ట్టుగా ఉంది. అలాంటి సంస్థ‌కు ప్రైవేటీక‌ర‌ణ మందు వేయ‌డం.. సామాన్య ప్ర‌జ‌ల్లో దాన్ని విశ్వ‌స‌నీయ‌త‌ను కూడా దెబ్బ‌తీసేది కాదా? మ‌రి ఈ దెబ్బ‌తో ఎల్ఐసీ ప‌రిస్థితి ఎలా మారుతుందో!