మరో ఐదు నగరాలను స్మార్ట్ సిటీల జాబితాలో చేరుస్తున్నట్టుగా బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ ఐదు నగరాలు ఏవనేది ముఖ్యం కాదు కానీ.. ఈ జాబితానే పెద్ద కామెడీగా మారింది. ఆ ప్రహసనం పై నెటిజన్లు సెటైర్లు వేస్తూ ఉన్నారు. ఆ కామెడీ ఏమిటంటే.. ఇప్పటికే మోడీ ప్రభుత్వం వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసే జాబితాలో పేర్కొన్నారు! ఇప్పుడు వాటికి తోడు మరో ఐదు నగరాలను ఆ జాబితాలోకి చేర్చారట!
జాబితాది ఏముంది.. ఐదు చేర్చవచ్చు, మరో వంద కూడా చేర్చవచ్చు.. అలా చేర్చుకుంటూ పోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. ఇంతకీ.. ఇప్పటికే ప్రకటించబడిన వంద స్మార్ట్ నగరాల పరిస్థితి ఏమిటో కేంద్రం చెప్పగలదా? ఇప్పుడు కాదు..మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ స్మార్ట్ సిటీల జాబితా ఒకటి ప్రకటిస్తూ వచ్చారు. అదిగో ఆ నగరాన్ని స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చారు, ఇదిగో ఈ నగరాన్ని ఈ సారి స్మార్ట్ సిటీగా చేస్తున్నారు.. అంటూ ప్రహసనపు ప్రకటనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి.
వాటికి తోడు ఇప్పుడు మరో ఐదు నగరాలను స్మార్ట్ సిటీలుగా ప్రకటించారు. ఈ పరిణామంపై సోషల్ మీడియా గొల్లుమంటోంది. ఇంతకు ముందు ప్రకటించిన వంద స్మార్ట్ సిటీల పని అయిపోయిందా.. వాటిని స్మార్ట్ గా మార్చేశారా? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తూ ఉన్నారు. బడ్జెట్ ప్రకటనలో ఇలాంటి ఆర్భాటపు ప్రకటనలకు మాత్రం లోటు ఉండదేమో! ఇలాంటి ప్రకటనల్లో మాత్రం మోడీ సర్కారు చాలా ఉదారంగా వ్యవహరించేస్తూ ఉంది. అయినా దేశంలోని అన్ని ఓ మోస్తరు నగరాలనూ స్మార్ట్ సిటీలుగా ప్రకటించేస్తే పోదా! ప్రకటిస్తే పోయేదేముందబ్బా!