చక్కగా ఆకాశంలో హాయ్‌హాయ్ అంటూ విహరిస్తూ, రుచికరమైన భోజనాన్ని ఆరగిస్తూ…. ఆ కిక్కే వేరబ్బా. అంతేనా ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను విహంగ వీక్షనం చేసే అరుదైన అవకాశం కూడా దక్కుతుంది. జీవితంలో మధురమైన జ్ఞాపకాలను పదిలపరచుకోవాలంటే ఒక్కసారి ఆగ్రా వెళ్లి తీరాల్సిందే.
దాదాపు 150 అడుగుల ఎత్తులో ….గాల్లో విహరిస్తూ మిత్రులతో కలసి డిన్నర్ చేసే అవకాశాన్ని ఆగ్రాలోని ఓ రెస్టారెంట్ కల్పిస్తోంది. ఆగ్రాలోని కలాకుర్తిలో తాజ్‌మహల్‌కు సమీపంలో ఓ రెస్టారెంట్‌ను నిర్మించారు. ఈ రెస్టారెంట్‌ను మరో వారంలో ప్రారంభించనున్నట్టు డైరెక్టర్ మనోజ్ అగర్వాల్ వెల్లడించాడు. ఓ భారీ బల్లపై కుర్చీలు, డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసి ఒకేసారి 24 మందిని కూర్చోపెడతారు. ఆ తర్వాత హైడ్రాలిక్ క్రేన్ సాయంతో పైకెత్తుతారు.
రోప్స్ సాయంతో ఆకాశంలో విహరిస్తుందని, అక్కడే భోజనాలు వడ్డిస్తామని రెస్టారెంట్ డైరెక్టర్ తెలిపాడు. ఒక్కో బ్యాచ్‌ను 45 నిమిషాల పాటు ఆకాశంలో తిప్పుతామని ఆయన తెలిపాడు. విదేశీ పర్యాటకుల్ని ఇది ఎంతగానో ఆకర్షిస్తుందని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆగ్రాలో తాజ్‌మహల్ తర్వాత ఇది రెండో పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందుతుందన్నాడు.
ఈ రెస్టారెంట్‌లో రుచికరమైన పదార్థాలను ఆరగిస్తూ, తాజ్‌మహల్‌ను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తామని రెస్టారెంట్ డైరెక్టర్ వివరించాడు. ఈ రెస్టారెంట్‌కు రావడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుందని ఆయన అన్నాడు.