ఎంతో తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నాడు హీరో బన్నీ. కానీ ఆ మాటల్లో సౌండ్ జనాలకు అర్థం అవుతూనే వుంది. 'తన సినిమా ఇండస్ట్రీ రికార్డు కొట్టిందోచ్' అనే పదే పదే డప్పు వేస్తూనే వున్నాడు. అక్కడితో ఆగక మరో అడుగు ముందుకు వేసి, తన రికార్డును బద్దలు కొట్టండోయ్ అని స్మూత్ గా పరోక్షంగా సవాలు విసురుతున్నాడు. కానీ ఈ రికార్డు ఎలా సాధ్యమైంది? అన్నది ఆలోచిస్తున్నట్లు లేదు.
ఏణ్ణర్థం ఇంట్లో కూర్చుని, డిజాస్టర్ 'నా పేరు సూర్య' తరువాత ఏం చేయాలా? అని కిందా మీదా పడి ఆఖరికి త్రివిక్రమ్ ను డైరక్టర్ గా తోడు తెచ్చుకున్నాడు. త్రివిక్రమ్ తోడు లేకుంటే బన్నీ సినిమా ఓవర్ సీస్ లో ఇన్ని మిలియన్లు చేసేదా? ఓవర్ సీస్ లో బన్నీ మార్కెట్ ఎంతో జనాలకు తెలియని విషయమా? థమన్ ఇచ్చిన పాటల పుణ్యమా అని ఈ సినిమాను రెగ్యులర్ మీడియా, ఇంకా సోషల్ మీడియా ఎంతలా మోసిందో తెలియని విషయమా? ఇవన్నీ సినిమా విజయం మీద ప్రభావం చూపించిన మాట వాస్తవం కాదా?
ఇక డొమస్టిక్ మార్కెట్ కు వస్తే, నైజాంలో రేట్ల పెరుగుదల అన్నది గత కొద్దికాలంగా ప్రారంభమైంది. గతంలో అంటే రంగస్థలం, బాహుబలి నాటికి లేదు. పైగా ఇన్ని రోజులు రేట్లు పెంచుకుని వుండడం అన్నది గతంలో లేదు. నైజాంతో సహా తెలుగు రాష్ట్రాల్లో ఇంత భయంకరమైన రేట్ల మీద, ఇన్ని రోజులు వుంచితే, ఈ బ్లాక్ బస్టర్ ఫీట్ సాధ్యమైంది.
అలవైకుంఠపురములో అనే సినిమా త్రివిక్రమ్ మ్యాజిక్. అందులో సందేహం లేదు. థమన్ మంచి ప ాటలు ఇచ్చాడు. బన్నీ బాగా నటించాడు. అంతవరకు ఓకె. భవిష్యత్ తో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమానో, రాజమౌళి ఆర్ఆర్ఆర్ నో ఈ సినిమా రికార్డులను తుడిచేసే అవకాశం ఎలాగూ వుంది. భవిష్యత్ లొ టికెట్ ల రేట్ల పెంపు మరింత భయంకరంగా వుండొచ్చు. అప్పుడు ఎలాగూ ఈ రికార్డు మాయం కాక తప్పదు. కానీ ముందుగానే చాలా తెలివిగా, చాలా వినయంగా ఈ రికార్డు ఎవరైనా బద్దలు కొట్టేయాలి, అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది అని చెప్పడం ఎందుకు? రికార్డులు బద్దలు కొట్టేసే ఒక్క సినిమా వస్తే ఇండస్ట్రీ బాగుపడిపోదు. జస్ట్ హిట్ అనిపించుకునే సినిమాలు ఎక్కువ వస్తే అప్పుడు బాగుంటుంది. సినిమాలు ఎక్కువ వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది తప్ప, భారీ సినిమా ఒక్కటి వస్తే బాగుపడిపోదు.
పైకి ఇలా మాట్లాడుతూ మరోపక్క మీడియాలో ఒక్క నెగిటివ్ షేడ్ వున్న ఆర్టికల్ వస్తే చాలు కిందా మీదా అయిపోతుంటే, ఎవరికి తెలియకున్నా మీడియాకు తెలియదా? బన్నీ లేదా గీతా యూనిట్ మనస్తత్వం ఏమిటో? ఇకనైనా ఈ ఇండస్ట్రీ హిట్..ఇండస్ట్రీ రికార్డు అనే విషయాల గురించి బన్నీ ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుందేమో? మనం గొప్పగా మాట్లాడేసాం అని మనం అనుకుంటే చాలదు..జనం కూడా నమ్మాలి కదా? జరుగుతున్న తెరవెనుక విషయాలు తెలిసిన జనాలు అస్సలు నమ్మరు కదా?