నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా!

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై కేసీఆర్ ప్ర‌భుత్వంపై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లలో ఇద్దరిని తిర‌స్క‌రించిన గ‌వ‌ర్న‌ర్‌ త‌మిళ‌సై పై…

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై కేసీఆర్ ప్ర‌భుత్వంపై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లలో ఇద్దరిని తిర‌స్క‌రించిన గ‌వ‌ర్న‌ర్‌ త‌మిళ‌సై పై బీఆర్ఎస్ నేత‌లు, మంత్రులు చేసిన విమ‌ర్శ‌ల‌పై గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. 

ఇవాళ రాజ్ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన ఓ స‌మావేశంలో గ‌వ‌ర్న‌ర్ తమిళిసై మాట్లాడుతూ.. త‌న‌పై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు క‌ట్టుకుంటాన‌ని.. త‌న‌పై దాడి చేస్తే ర‌క్తాన్ని సిరాగా వాడుకుని త‌న చ‌రిత్ర రాసుకుంటానంటూనే.. తెలంగాణ‌లో అడుగుపెట్ట‌క ముందు మ‌హిళా మంత్రులే లేర‌ని.. త‌ను వ‌చ్చాకే మ‌హిళ మంత్రుల‌తో ప్ర‌మాణం చేయించాన‌ని.. ప్రొటోకాల్ గౌర‌వం ఇచ్చినా, ఇవ్వ‌క‌పోయినా ప‌నిచేసుకుంటూ పోతానంటూ.. బీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి కౌంట‌ర్ ఇచ్చారు.

కాగా క్యాబినెట్ ఆమోదంతో సిఫారసు చేసిన కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను తిరస్కరిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం ఆ ఇద్దరు ఎమ్మెల్సీలుగా గవర్నర్ నామినేట్ చేయడానికి అనర్హులని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడానికి అర్హులైన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అనేక మంది ఉన్నారని .. రాజకీయ నాయకులను నామినేట్ చేయడం వలన ఆయా రంగాలకు చెందిన ప్రముఖులకు అవకాశాలను తిరస్కరించినట్లు అవుతుందని ఆమె స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్ నేత‌లు, మంత్రులు గవ‌ర్న‌ర్ నిర్ణ‌యన్ని త‌ప్పు ప‌డుతూ పెద్ద ఎత్తున్న విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే.