దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో నెలకొన్న అందోళన దృష్టా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 కారణంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. తీవ్రత తక్కువగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం దేశంలో కోవిడ్ ఎండమిక్ దశలోకి ప్రవేశిస్తోందని.. వచ్చే 10 నుండి 12 రోజుల్లో కొత్త కేసులు పెరుగుతాయని తెలిపాయి. ఆ తర్వాత కేసులు తగ్గుతాయని అంచనా వేసింది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రిలో చేరికలు మాత్రం తక్కువగా ఉన్నాయని రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగుతుందని.. వాటిపై ఆందోళన అక్కర్లేదని అంటున్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటే చాలని.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్లు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
కాగా ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ ఎక్స్‌బీబీ.1.16 కారణంగా భారత్‌లో కరోనా కేసులు పెరుగుతూ పోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో 21.6 శాతం, మార్చిలో 35.8 శాతం పెరుగుదల నమోదు అయ్యింది. నిన్న ఒక్కరోజులోనే 7,830 కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతిచెందారు. గతేడాది ఆగస్టు తరువాత ఒకే రోజు ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,47,76,002 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 5,31,016 మంది కరోనా కారణంగా మృతి చెందారు.