శకునిజం చూపిస్తున్న హరీష్ రావు

మహాభారతంలో ఒక్కడే శకుని. ఇప్పుడు రాజకీయ పార్టీల్లో అడుగడుగునా కనిపిస్తున్నారు. పంచనే ఉంటూ అయినవాళ్ల పతనాన్ని కోరుకుంటూ అందులో మానసికానందం పొందడమే శకునితనం. దాన్నే ముద్దుగా శకునిజం అని పిలుచుకోవచ్చు.  Advertisement ఈ శకునిజాన్ని…

మహాభారతంలో ఒక్కడే శకుని. ఇప్పుడు రాజకీయ పార్టీల్లో అడుగడుగునా కనిపిస్తున్నారు. పంచనే ఉంటూ అయినవాళ్ల పతనాన్ని కోరుకుంటూ అందులో మానసికానందం పొందడమే శకునితనం. దాన్నే ముద్దుగా శకునిజం అని పిలుచుకోవచ్చు. 

ఈ శకునిజాన్ని చూపించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చివాట్లు తింటున్నది ఎవరంటే హరీష్ రావు. ఇతను బీఆరెస్ పాలిటి శకుని. 

సైజులో మామకన్నా ఎత్తు పెరిగాడు కానీ రాజకీయంలో మాత్రం అంత ఎత్తుకి ఎదగలేకపోయాడు. మొదటి నుంచీ మామ చాటు, అతని కొడుకు చాటు వ్యక్తే ఈ హరీష్. 

రాజకీయంగా కేసీయార్ తర్వాత ఆ స్థాయిలో చక్రం తిప్పేద్దామని దిగినప్పుడల్లా మొట్టికాయలు వేసి మూలన కూర్చోపెట్టేవారు. పోయిన ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్లో నియోజకవర్గాలన్నీ చుట్టేస్తూ దాదాపు నెంబర్2 స్థాయిలో తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటే అంతొద్దని చెప్పి హెలికాప్టర్ లో తిరగనివ్వకుండా చేసి, రోడ్లకే పరిమితం చేసి తన స్థాయిని గుర్తుచేసారు. 

కేసీయార్ వారసుడు కేటీయార్ సర్వసమర్ధుడు. తండ్రికి తీసిపోని రాజకీయం, మొండితనం, ఆపైన ప్రపంచాన్ని నాలుగాకులు ఎక్కువ చదివినతనం తన సొంతం. హరీష్ పరిధి తెలంగాణా రాష్ట్రాన్ని దాటలేదు. దాటాలనుకున్నా సొంత ఇంటిలోనే భయంకరమైన కాంపిటీషన్ ఉంది తనకి. అందుకే తాను ఎప్పటికీ పార్టీలో నెంబర్ 2 కాలేడు. ఈ విషయం అతనికి బోధపడడానికి చాలా కాలం పట్టింది. 

కొన్నాళ్లు బుంగ మూతి పెట్టి అలిగితే మామ చేరదీస్తాడని అనుకుని కినుక వహించాడు. కానీ అది జరగలేదు. ఆ కర్కశరాజకీయాన్ని తట్టుకోలేక “చెరువు మీద అలిగి కడుక్కోకపోతే ఎవడికి నష్టం” అనే సామెతని గుర్తు చేసుకుని మామ కాళ్లు, వేళ్లు పట్టుకుంటే మంత్రి పదవి పారేసి కూర్చోమన్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లో అతనికి పార్టీ పట్ల, అధినాయకుడైన తన మామ పట్ల, అతని కొడుకైన కేటీయార్ పట్ల గౌరవం ఎందుకుంటుంది? ఉన్నంతలో అధికారం వెలగబెట్టే అవకాశాన్ని అనవసర భేషిజాలకి పోయి పోగొట్టుకోకూడదు కదా అని మంత్రిగా కాలక్షేపం చేస్తున్నాడు. 

సర్వకాల సర్వావస్థలయందు బీఆరెస్ ఓడిపోయి మామ, అతని కొడుకు పదవీచ్యుతులైతే చూడాలనుకునే ప్రపధముడు హరీషే. 

ప్రత్యర్థులకంటే పక్కలో బల్లెం చాలా ప్రమాదకరం. మహాభారతం చదువుకున్న కేసీయార్ కి హరీష్ మనోగతాన్ని అర్ధం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయినా ఒక్కోసారి బంధుత్వానికి కరిగో, ఇతర కార్యకలాపాలవల్ల దృష్టి పెట్టకో అతనిపై సరైన దృష్టి సారించకపోవచ్చు. సారిస్తే మహాభారత సినిమాల్లో శకుని పాత్రలేసిన సీయస్సార్, ధూళిపాళ హరీష్ ముఖంలో కుటిలవికటాట్టహాసం చేస్తూ కనిపిస్తారు. 

ఒక పక్కన బీఆరెస్ అధినాయకత్వం వైకాపా అధినాయకుడు జగన్ మోహన్ రెడ్డితో తమదైన వ్యవహారమేదో నడుపుతోంది. ఇద్దరి మధ్యనా శత్రుత్వం లేదు. 

ఆ మధ్యన కేటీఆర్ ఆంధ్రలో రోడ్ల గురించి ఏదో మాట తూలి తర్వాత బహిరంగ క్షమాపణ చెప్పి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ తనకు సోదరసమానుడని పేర్కొన్నాడు. అది రాజకీయమే కవొచ్చు, నిజంగా ఆ భావన ఉండొచ్చు. అది వేరే విషయం. 

కానీ హరీష్ రావు ఆంధ్ర భవన నిమ్రాణ కార్మికులని తమ రాష్ట్రంలో తమకి ఎటువంటి ప్రగతి జరగడంలేదు కనుక తమ స్థానాన్ని వదిలి వచ్చి తెలంగాణాలో ఓటు హక్కు సాధించమని పిలుపునిచ్చాడు. ఇది తెలిసీతెలియక చేసిన పసికూత కాదు. మనసు పొరల్లో బీఆరెస్ అధినాయకులపై ఉన్న కుళ్ళే అతనిని అలా పలికించింది. 

ఎందుకంటే హరీష్ అన్న మాటల్ని సమాజం బీఆరెస్ మాటగా తీసుకుంటుంది. వైకాపా వాళ్లు బీఆరెస్ ని బూతులు తిడతారు. ఆ ఫ్లోలో తెలంగాణాలో జరుగుతున్న అనేకమైన అవకతవకలను తవ్వి బయట పెడతారు ఆంధ్ర వైకాపా నాయకులు. బీఆరెస్ అధినాయకత్వం డిఫెన్సులో పడి మళ్లీ ఏదో కవరింగ్ చేసుకోవాలి. ఇదంతా చూస్తే హరీష్ కి కడుపు చల్లగా ఉంటుంది. 

ఒకవేళ మామయ్యో, అతని కొడుకో “ఏందిది గిట్ల జేసినవ్?” అని నిలదీసి చివాట్లు పెట్టినా అలవాటే కనుక తల వంచుకుని చేతులు కట్టుకుని నిలబడి, “తప్పు జేసినా. సోయి లేక వాగేసినా! ఆగమాగమయ్యింది. సారీ మామా! ఇంకెప్పుడు గిట్ల చెయ్య!” అని బడిలో మొద్దబ్బాయిలాగ డైలాగొకటి కొట్టొచ్చు. కేసీయార్ క్షమించి చిరాకుగా వెనక్కి తిరగ్గానే హరీష్ తలెత్తి శకుని టైపు నవ్వు నవ్వొచ్చు. ఇదీ జరగబోయే సీను!

హరీష్ వాగుడు పుణ్యమా అని తెలంగాణాను దోచుకున్న కేసీయార్ ఆస్తి లక్ష కోట్ల పైమాటే అని ఆంధ్రా నాయకులు, సోషల్ మీడియాలో లెక్కలు తోడుతున్నారు. 

ఒక పక్క కవిత లిక్కర్ స్కాముని కూడా మరోసారి ఏకరువు పెడుతున్నారు. లాభాల్లో ఉన్న సింగరేణిని సర్వనాశం చేసారని చెప్పుకొస్తున్నారు. ఏపీలో ఇచ్చే సంక్షేమ పథకాల్లో సగమైనా కేసీయార్ ఇస్తున్నాడా అంటూ తెలంగాణా పేదల్ని అడుగుతున్నారు. చినుకు పడితే హైదరాబాదు రోడ్లపై పడవలో తిరగాలి… ఆ రిపేర్ల ఏడుపు ఏడవకుండా గొప్పలు ఫేకడమేంటి అంటున్నారు. 

ఇలా ఎలా పడితే అలా విరుచుకుపడుతున్నారు వైకాపా సోషల్ మీడియా శ్రేణులు. 

మరో పక్క హరీష్ రావు చదువుకున్న నిరక్షరాశ్యుడంటూ పేర్కొంటున్నారు జగన్ మోహన్ రెడ్డిపై సానుకూల అభిప్రాయమున్న తెలంగాణాకు చెందిన సోషల్ మీడియా నెటిజెన్లు. 

ఇప్పటికైనా కేసీయార్, కేటీఆర్ కళ్లు తెరిచి అనర్ధం మరింత పెరగకముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే శకునిజానికి బలి కావాల్సి రావొచ్చు. 

ఎప్పటికైనా బీఆరెస్ లో చీలిక వస్తే అది హరీష్ తోటే రావొచ్చని జనబాహుళ్యంలో ఎప్పటి నుంచో ఉన్న అభిప్రాయం. ఇన్నాళ్లూ ఆ అభిప్రాయం ప్రాణం పోసుకోనీయకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. మళ్లీ మంత్రి పదవి ఇచ్చి శకునికి జవసత్వాలను ఇచ్చారు. ఆ జవసత్వాలు పార్టీ భవిష్యత్తుని మింగక మునుపే జాగ్రత్తపడాలి. 

ఇది ఆంధ్రపై చేసిన వ్యతిరేక వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాసిన రాత కాదు. బీఆరెస్ పాలిటి శకుని గురించి చెప్పాల్సిన సమయం ఆసన్నమయ్యింది కనుక చెబుతున్న మాట. 

శ్రీనివాసమూర్తి