దివంగత వైఎస్సార్‌ను అన్ని కులాల వారు ఆరాధిస్తారు. రెడ్ల సామాజిక వర్గీయులు కాస్త ఎక్కువ ఆయన్ను ప్రేమిస్తుంటారు. ఈ విషయాన్ని పసిగట్టిన నారా లోకేశ్, రెడ్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తాడిపత్రి నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర సాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెడ్లతో లోకేశ్ భేటీ కావడం విశేషం.
రెడ్లపై వైఎస్సార్ అస్త్రాన్ని ప్రయోగించి, తమ వైపు తిప్పుకోడానికి లోకేశ్ ప్రయత్నించడం ఈ సమావేశం ప్రత్యేకత. సమావేశంలో లోకేశ్ ప్రసంగిస్తూ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా తీసుకున్న అన్ని నిర్ణయాలతో తాను ఏకీభవించనన్నారు. అయితే రాజకీయాల్లో రాజనీతిని వైఎస్సార్ నిలబెట్టారని ప్రశంసించారు.. శాసనసభ సాక్షిగా కొన్ని సందర్భాల్లో స్పీడ్‌గా వెళ్లినట్టు ఆయన పెద్ద మనసుతో ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. ఇటు బాబు, అటు వైఎస్సార్ వ్యక్తిగతంగా ఎప్పుడూ దూషించుకోలేదని సమాన హోదా కల్పించారు. రాజకీయాలు ఒక పద్ధతిగా నడిచాయన్నారు.
కానీ ఈ రోజు ఏం జరుగుతున్నదో మీరే సాక్ష్యం అన్నారు. ఈ రోజు అందరితో పాటు రెడ్డి సోదరులు కూడా ప్రభుత్వం చేతిలో బాధితులే అన్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారన్నారు. కమ్మ వాళ్లందరికీ డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపించారని గుర్తు చేశారు. మొన్న శాసనసభలో 36 మందిలో ఐదారుగురికే ప్రమోషన్లు వచ్చినట్టు ఒప్పుకున్నారన్నారు. 2014 నుంచి 2019 వరకూ పాలనలో ఏనాడైనా దొంగ కేసు పెట్టామా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టామా? అని లోకేశ్ ప్రశ్నించారు.
పని చేయాలంటే మీ ఇంటిపేరు ఏంటని తెలుగుదేశం ప్రభుత్వం అడిగిందా? అని ప్రశ్నించారు. ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా జవహర్‌రెడ్డి ఉన్నారన్నారు. ఎంతో అద్భుతంగా పని చేశామన్నారు. ఇద్దరం కలిసి ఫైల్స్ పెండింగ్ లేకుండా చేశామన్నారు.
కాంగ్రెస్‌ను వీడి వైఎస్ జగన్‌తో ప్రయాణిస్తున్న వారు కూడా ఈ రోజు తమకేంటి ఈ బాధలు అని అంటున్నారని చెప్పుకొచ్చారు. ఈ రోజు తాడేపల్లిలో సీఎం ఇంటి చుట్టూ వున్న రెడ్డి సోదరులంతా టీడీపీలో చేరుతున్నారంటే ఒక్కసారి ఆలోచించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. టీడీపీలో ఎంత మంది రెడ్డి సామాజిక వర్గ నాయకులు మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా పని చేశారో తనకంటే మీకే బాగా తెలుసని రెడ్డి సోదరులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ముఖ్యంగా రెడ్డి సోదరులు బాగా కష్టపడడం వల్లే తాను గెలుపొందినట్టు ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి తనకు స్వయంగా వచ్చి చెప్పారన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ రాష్ట్ర పరువు తీయలేదని ప్రశంసించారు. కానీ వైఎస్సార్ తనయుడిగా తాను అద్భుతాలు సృష్టిస్తానని జగన్ చెప్పారన్నారు. జగన్ పాలనలో రాష్ట్ర పరువు పోయిందన్నారు. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడని ఆరోపించారు. రెడ్లతో నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్‌పై ప్రశంసలు, జగన్‌పై విమర్శలు చేయడాన్ని గమనించొచ్చు.
వైఎస్సార్‌ను రెడ్డి సామాజిక వర్గం గుండెల్లో పెట్టుకుందని గ్రహించి, ఆయనపై గౌరవాన్ని ప్రదర్శించడం ద్వారా తమ వైపు తిప్పుకోవచ్చని లోకేశ్ ఎత్తుగడ వేశారు. మరి లోకేశ్ మాటలు రెడ్డి సోదరుల్లో ఎంత వరకూ నమ్మకం కలిగిస్తాయో కాలమే తేల్చి చెప్పాలి.