కోవిడ్ కేసులు.. పెరుగుతూ, త‌గ్గుతూ, పెరుగుతూ!

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతూ, త‌గ్గుతూ, పెరుగుతూ.. సాగుతోంది. గ‌త వారం రోజుల్లో క‌రోనా కేసుల సంఖ్య బాగా పెర‌గ‌డం, ఆ వెంట‌నే మ‌రి కాస్త త‌గ్గ‌డం జ‌రుగుతోంది. వాస్త‌వానికి ఈ నెల…

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతూ, త‌గ్గుతూ, పెరుగుతూ.. సాగుతోంది. గ‌త వారం రోజుల్లో క‌రోనా కేసుల సంఖ్య బాగా పెర‌గ‌డం, ఆ వెంట‌నే మ‌రి కాస్త త‌గ్గ‌డం జ‌రుగుతోంది. వాస్త‌వానికి ఈ నెల ఆరంభం నుంచినే కేసుల సంఖ్య వేగంగా పెర‌గ‌డం ప్రారంభం అయ్యింది.

జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన దేశ వ్యాప్తంగా క‌లిసి 22 వేల కేసులు న‌మోద‌య్యాయి. అవి కాస్తా కేవ‌లం ప‌ది రోజుల వ్య‌వ‌ధిలోనే రెండు ల‌క్ష‌ల స్థాయికి చేరాయి. జ‌న‌వ‌రి ప‌న్నెండో తేదీ నాటికి దేశంలో న‌మోదైన రోజువారీ కేసుల సంఖ్య దాదాపు రెండు ల‌క్ష‌లు.

ఇక గ‌త వారం రోజులుగా చూసుకుంటే.. జ‌న‌వ‌రి ఇర‌వైతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజువారీగా మూడు ల‌క్ష‌ల మార్కును దాటేసింది. ఆ రోజున 3.17 ల‌క్ష‌ల కేసులు న‌మోద‌య్యాయి. జ‌న‌వ‌రి 21వ తేదీన అత్య‌ధికంగా 3.47 ల‌క్ష‌ల  కేసులు న‌మోద‌య్యాయి. ఆ మ‌రుస‌టి రోజు ఈ స్థాయి కాస్త త‌గ్గింది. ఇలా నిన్న వెల్ల‌డైన డేటా ప్ర‌కారం ఒక్క రోజులో రెండున్న‌ర ల‌క్ష‌ల స్థాయిలో కేసులు వ‌చ్చాయి. మూడున్న‌ర ల‌క్ష‌ల స్థాయి నుంచి రోజువారీ కేసుల సంఖ్య రెండున్న‌ర ల‌క్ష‌ల స్థాయికి త‌గ్గింది.

అయితే మ‌ళ్లీ ఇప్పుడు కేసుల సంఖ్య రోజువారీగా 2.80 ల‌క్ష‌ల పై స్థాయికి చేరింది. ఇలా గ్రాఫ్ ఎగుడుదిగుడుగా కొన‌సాగుతూ ఉంది. మూడో వేవ్ లో అత్య‌ధికంగా రోజుకు మూడు ల‌క్ష‌ల స్థాయిలో కేసులు రావొచ్చ‌ని కొన్ని నెల‌ల  కింద‌ట ఒక అధ్య‌య‌నం అంచ‌నా వేసింది. రెండో వేవ్ లో అత్య‌ధికంగా రోజుకు ఐదు ల‌క్ష‌ల స్థాయిలో కేసులు వ‌చ్చాయి. మూడో వేవ్ గ‌రిష్ట స్థాయి మూడు ల‌క్ష‌ల కేసుల వ‌ర‌కూ అంటూ ఒక అధ్య‌య‌న సంస్థ కొన్నాళ్ల కింద‌టే ప్ర‌క‌టించింది. 

మ‌రి మూడు ల‌క్ష‌ల మార్కును అందుకోవ‌డం, కాస్త త‌గ్గ‌డం ఇప్ప‌టికే జ‌రిగింది. మ‌రోవైపు అన‌ధికారిక కేసుల సంఖ్య కూడా ఈ సారి భారీగా ఉంద‌నేది క్షేత్ర స్థాయి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి స్ప‌ష్టం అవుతున్న అంశం. చాలా మంది టెస్టుల‌కే వెళ్ల‌కుండా మందులు తీసుకుంటూ మూడు నాలుగు రోజుల్లో ఆరోగ్య‌వంతుల‌వుతున్నారు. కేసుల నంబ‌ర్లు ఎలా ఉన్నా… మూడో వేవ్ లో అత్యంత సానుకూల ప‌రిణామం ఇదే.