గత కొన్నాళ్లుగా పేలవమైన ఫామ్ తో పరుగుల లేమితో సతమతమవుతున్న భారత క్రికెటర్లు అజింక్య రహనే, చతేశ్వర్ పుజారాలకు ఇక జట్టులో చోటు దక్కుతుందా? అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఈ మధ్యకాలంలోనే ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా పర్యటనల్లో వీరు చెప్పుకోదగినంత స్థాయి బ్యాటింగ్ ప్రదర్శన చేయలేదు. వీరి ఆట తీరుపై విమర్శలు అధికం అయ్యాయి.
ఒకవైపు జట్టులోకి రావడానికి యువ ఆటగాళ్లు ఎంతో మంది ఎదురుచూస్తున్న వేళ.. తమకు చోటు ఖాయమనే ధీమాతో ఉన్న పుజారా, రహనేలు వరస ఫెయిల్యూర్లతో వార్తల్లో నిలుస్తున్నారు. విదేశీ పిచ్ లపై బాగా రాణించిన నేపథ్యం అయితే వీరిద్దరికీ ఉంది. అయితే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా దేశాల్లో భారత జట్టు చివరి సారి పర్యటనించినప్పుడు మాత్రం వీరిద్దరిదీ చెప్పుకోదగిన ప్రదర్శన కాదు. ఏదో ఒకటీ రెండు ఇన్నింగ్స్ లలో మాత్రమే బాధ్యతగా ఆడారు. ఒక్కో సీరిస్ లో ఒక్క ఇన్నింగ్స్ లో బాగా ఆడటమే గగనంగా మారింది.
ఇక స్వదేశంలో వీరు రాణించినా అది లెక్కలోకి రాదు. ఇండియాలో జరిగే టెస్టు మ్యాచ్ లలో వీరే కాదు.. రంజీ నేపథ్యం ఉన్న ఏ క్రికెటర్ అయినా దుమ్మురేపుతున్నారు బ్యాటింగ్ లో. ఇక స్వదేశంలో కూడా వీరు గత రెండేళ్లలో చేసిన అద్భుతాలు కానీ, అద్భుత ఇన్నింగ్స్ లు కానీ లేవు. గతంలో ఉన్నంత నమ్మకం వీరిపై ఫ్యాన్స్ లో అణుమాత్రం కూడా లేదిప్పుడు.
ఈ క్రమంలోనే రహనేకు వైస్ కెప్టెన్సీ పోయింది. నాయకుడిగా రహనే మంచి ప్లేయరే అయినా, బ్యాటింగ్ ఫామ్ లేమి అతడిని మాజీ వైస్ కెప్టెన్ ను చేసింది. ఇక ఇప్పుడు బోర్డు కాంట్రాక్ట్ లలో కూడా వీరిద్దరికీ డిమోషన్ అని సమాచారం.
ప్రస్తుతం వీరిద్దరూ ఏ గ్రేడ్ ప్లేయర్లుగా ఉన్నారు. వీరికి బీసీసీఐ డిమోషన్ ఇచ్చిందని, వీరు బీ గ్రేడ్ కు పడిపోనున్నారని సమాచారం. ఏ ప్లస్ కేటగిరిలో విరాట్, రోహిత్, బుమ్రా ఉన్నారు. ఏ కేటగిరిలో అశ్విన్, పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలున్నారు. ఇక బీ కేటగిరి కాంట్రాక్ట్ లిస్ట్ లో షమీ, ఉమేష్ యాదవ్ వంటి వారున్నారు. వీరిలో షమీకి ఏ గ్రేడ్ కు ప్రమోషన్ దక్కనుందని తెలుస్తోంది.
గత కొన్నాళ్లుగా షమీ బౌలింగ్ చాలా మెరుగైన నేపథ్యంలో అతడికి ఏ గ్రేడ్ లో చోటు దక్కవచ్చని తెలుస్తోంది. ఉమేష్ యాదవ్ పై నమ్మకాలు సడలిన నేపథ్యంలో అతడికి సీ గ్రేడ్ డిమోషన్ తప్పనట్టుగా ఉంది. సీ గ్రేడ్ లోని అక్షర్ పటేల్ కు బీ గ్రేడ్ లోకి ప్రమోషన్ ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే కొత్త కాంట్రాక్ట్ లిస్ట్ ల జాబితా రానుంది.
ప్రస్తుతం ఏ ప్లస్ కేటగిరిలోని ఆటగాళ్లు ఏడాదికి ఏడు కోట్లు, ఏ కేటగిరి ఆటగాళ్లు ఐదు, బీ కేటగిరి ఆటగాళ్లు మూడు కోట్లు, సీ కేటగిరి ఆటగాళ్లు కోటి రూపాయల మొత్తాలను ఏడాదికి రెమ్యూనిరేషన్ గా పొందుతున్నారు.