కొత్త జిల్లాలు వస్తే…?

కొత్త జిల్లాల నోటిఫికేషన్ కూడా ఇచ్చేసిన తరువాత ఈ ప్రశ్న కాస్త అర్ధరహితంగా కనిపించవచ్చు. కానీ ఇల్లు అలకగానే పండగ కాదు కదా? ఓ జిల్లా ఏర్పాటు అంటే అంత సులవు అయిన పని…

కొత్త జిల్లాల నోటిఫికేషన్ కూడా ఇచ్చేసిన తరువాత ఈ ప్రశ్న కాస్త అర్ధరహితంగా కనిపించవచ్చు. కానీ ఇల్లు అలకగానే పండగ కాదు కదా? ఓ జిల్లా ఏర్పాటు అంటే అంత సులవు అయిన పని కాదు. పరిపాలన వికేంద్రీకరణలో భాగమే కొత్త జిల్లాల ఏర్పాటు. కొత్త రాష్ట్రాలయినా, కొత్త జిల్లాలయినా విభజన అనేది చాలా సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. 

సమితుల స్థానంలో మండలాలను తీసుకువచ్చిన తరువాత అంతా సజావుగా, సక్రమంగా సెట్ రైట్ కావడానికి దాదాపు దశాబ్దకాలం పట్టింది.ఆ సమయంలో ఎన్నో చోట్ల రికార్డులు గల్లంతయ్యాయి. అప్పటి వరకు వున్న వ్యవస్థ నుంచి కొత్త వ్యవస్థలోకి రికార్డులు రావడం అన్నది అంత సులవుగా జరగలేదు. అమలులోకి వచ్చిన తరువాత కనిపించే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సరేసరి.

అయితే జిల్లాల విభజన మరీ ఇంత కష్టం కాదు కానీ, చాలా వ్యయ ప్రయాసలతో కూడు కున్నదే. ఓ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విభాగాల ఉద్యోగుల సంఖ్య నాలుగు అంకెల్లో వుంటుంది తప్ప మూడు అంకెల్లో అయితే కాదు. ప్రతి ప్రభుత్వ విభాగమూ జిల్లా కేంద్రంలో వుండాల్సిందే. దాని కోసం ఓ కార్యాలయం, సిబ్బంది, ఇన్ ఫాస్ట్రక్చర్ ఇవన్నీ అవశ్యం. 

ఇప్పుడు కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు అవుతున్నాయి. వీటన్నింటికీ కొత్త కార్యాలయాలు కావాలి. అందుకు అద్దె భవనాలే శరణ్యం. ఎమ్మార్వో, ఎండీవో లాంటి కార్యాలయాలు అరకొర సౌకర్యాలతో నెట్టుకు వస్తున్నాయి. ఆర్డీవో కార్యాలయాలు కొన్ని చొట్ల స్వంత భవనాల్లో, కొన్ని చోట్ల అద్దె భవనాల్లో వున్నాయి. కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటికీ తాత్కాలికంగానైనా భవన వసతి చూడాలి. లేదా ప్రతి జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాలను ప్లాన్ చేయాల్సి వుంటుంది. వాటికి స్థలాలు కావాలి. నిధులు కావాలి. నిర్మాణాలు జరగాలి. ఈలోగా రికార్డులు చెదిరిపోకుండండా చూసుకోవాలి. 

చిరకాలంగా నియామకాలు జరగడం లేదు. చాలా మంది ప్రభుత్వ సిబ్బంది రిటైర్ మెంట్ కు దగ్గరవుతున్నారు. ఇలాంటి సమయంలో కొత్త జిల్లాలు అంటే సిబ్బంది కొరత తీవ్రంగా వుంటుంది. ఐఎఎస్, ఐపిఎస్ కేడర్ అధికారులు పెద్ద సంఖ్యలో అవసరం పడతారు. 

కేవలం కార్యాలయాలు ఏర్పాటు చేస్తే సరిపోదు. అక్కడకు వెళ్లే ప్రజలకు సంబంధిత అధికారులు, సిబ్బంది వుండాలి. ఫైళ్లు రాలేదు. ఇంకా అక్కడ వున్నాయి, ఇక్కడ వున్నాయి లాంటి సమాధానాలు ఇక అలవాటైపోతాయి.

అదనపు జిల్లాలు ఏర్పాటు చేస్తే ఏమిటి లాభం అనే ప్రశ్న కూడా సామాన్యుల మదిలో వుంది. పరిపాలన అందుబాటులోకి రావడం అన్నది కేవలం 10శాతం ప్రజలకు కూడా సంబంధించిన వ్యవహారం కాదు. ఎందుకంటే హైకోర్టు అమరావతిలో వున్నా, హైదరాబాద్ లో వున్నా కేవలం కోర్టులతో పని పడే పది శాతం మందికి మించి మిగిలిన వారికి సంబంధించినది కాదు.

అలాగే కలెక్టరేట్, జిల్లా ఎస్పీ, జిల్లా కార్యాలయాలతో సామాన్య ప్రజానీకానికి పెద్దగా పని పడే వ్యవహారం కాదు. ఎటొచ్చీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త పుంజుకోవడానికి అవకాశం వుంటుంది. కొత్తగా జిల్లా కేంద్రాల్లో వెంచర్లు పుట్టుకువస్తాయి. భూముల రేట్లలో కదలిక వస్తుంది. 

విశాఖ నుంచి కొన్ని ప్రాంతాలు వేరు చేసి విజయనగరం జిల్లా ఏర్పాటుచేసిన రోజుల్లో కాస్త సెంటిమెంట్ లాంటిది జనాల్లో వుండేదేమో కానీ ప్రస్తుతం అయితే అలాంటి సెంటిమెంట్ లేదు. ఎందుకంటే జనజీవనంలో మార్పు వచ్చింది. గ్లోబలైజేషన్ పేరిగిన తరువాత జిల్లా కేంద్రం అన్నది పక్క ఊరులా మారిపోయింది. అందువల్ల కొత్తగా జిల్లా కేంద్రం దగ్గరగా వచ్చిందనో, లేదా తమ ప్రాంతం జిల్లా అయిందనో పెద్దగా స్పందన జనం నుంచి ఆశించడం సరి కాదేమో?

మొత్తం మీద కొత్త జిల్లాల ఏర్పాటు అన్నది కొన్నాళ్లు చిన్న హడావుడికి దారి తీసే అవకాశం వుంది తప్ప, మరీ సంచలనాలు అయితే నమోదు చేయదనే అనుకొవాలి.